వనరులు గుర్తించు.. రాబడి పెంచు
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:16 AM
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు సొంతంగా ఆదాయ వనరులు సృష్టించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
- సొంత ఆదాయ వనరులపై పంచాయతీల దృష్టి
- ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా అభివృద్ధి
- ఆర్థికంగా మరింత బలపడేందుకు చర్యలు
- సర్పంచ్‌లు, కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణ
శృంగవరపుకోట, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు సొంతంగా ఆదాయ వనరులు సృష్టించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ఇటీవల మండలాల వారీగా సర్పంచ్‌లు, కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లకు రెండు రోజుల పాటు అధికారులు శిక్షణ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టిసారిస్తే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆర్థిక సంఘం నిధులు, ఇంటి పన్నుల రూపంలో వచ్చే సాధారణ నిధుల కోసం వేసి చూడాల్సిన అవసరం ఉండదు.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో 777 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 12 మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి ఏడాదీ 3,90,772 నివాసాల నుంచి రూ.19.37 కోట్ల వరకు ఇంటి పన్ను రూపంలో పంచాయతీలకు ఆదాయం సమకూరుతుంది. ఇది కాక ఏడాదికి రెండుసార్లు ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల ఖాతాకు జమవుతున్నాయి. వీటిని పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాల నిర్వహణ తదితర వాటికి పంచాయతీలు ఖర్చు చేస్తున్నాయి. అయితే, చాలా పంచాయతీలకు ఈ నిధులు సరిపోవడం లేదు. దీంతో పారిశుధ్య కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంటుంది. రోడ్లు, కాలువలు, ఇతర అత్యవసర పనులు చేపట్టేందుకు కూడా నిధులు ఉండడం లేదు. నిధుల కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ సర్పంచ్‌లు ప్రదక్షిణలు చేస్తున్నారు. దీని నుంచి బయటపడి, గ్రామ పంచాయతీలు సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వం చేసింది. సొంతంగా ఆదాయాన్ని సృష్టించుకుని, ఎంతో అభివృద్ధి సాధిస్తున్న ఉత్తరఖాండ్ రాష్ట్రంలోని సిరసు, ఒడిశా రాష్ట్రంలోని ముకుందపూర్‌పట్నం తదితర పంచాయతీలను అధ్యాయనం చేసింది. వీటిల్లాగే స్థానికంగా ఉన్న ప్రకృతి సంపద, దేవాల యాలు, ఇతర ఖాళీ ప్రదేశాల వంటి వాటిని వినియోగంలోకి తీసుకురావడం ద్వారా పంచాయతీలకు సొంతంగా ఆదాయం సమకూర్చుకోవాలని సూచిస్తుంది.
సద్వినియోగం చేసుకోలేక..
జిల్లాలోనే శృంగవరపుకోట అతిపెద్ద మేజర్ పంచాయతీ. ఏడాదికి రూ.కోటి పైబడి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఇలాంటి పంచాయతీ పారిశుధ్య కార్మికులకు సకాలంలో జీతా లను చెల్లించలేకపోతుంది. సొంతంగా ఆదాయం పొందేందుకు అనేక వనరులు ఉన్నా వినియోగించుకోలేకపోతుంది. ఈ గ్రామానికి ఆనుకుని పుణ్యగిరి ఆలయం ఉంది. ఫొటో షూట్ చేసుకునేందుకు ఇది అనువైన స్థలం. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే దీన్నించి రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. పంచాయతీకు ఖాళీ స్థలాలకు కొదవ లేదు. వీటిని నిరుపయోగంగా ఉంచారు. వీటిని వినియోగంలోకి తీసుకువస్తే నెలకు రూ.లక్షల్లో ఆదాయం తెచ్చిపెడతాయి. సందర్శకులను ఆకర్శించేలా స్థానిక గాంధీ పార్కును తీర్చిదిద్దితే ఆదాయం పొందవచ్చు. గ్రామానికి ఆనుకుని చెరువులు, బందలు ఉన్నాయి. ఈ గట్లపై వివిధ రకాల ఫలం సాయం అందించే మొక్కలను పెంచవచ్చు. చేపల పెంపకానికి లీజుకు ఇవ్వవచ్చు. ఇలా ఈ పంచాయతీలో రాబడి పొందేందుకు అనేక అవకాశాలు ఉన్నప్పటికీ పాలక మండలిలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాయి.
ఇలా రాబడి పెంచుకోవచ్చు..
ఆస్తి పన్ను, ఇంటి పన్ను, వృత్తి పన్ను, వినోదం పన్ను, ప్రకటన పన్ను, వాహన పన్ను, మొబైల్ టవర్, కట్టెలు, చెట్ల ఉత్పత్తుల వేలం, వర్మీ కంపోస్ట్ వ్యాపారం, వినియోగాదారుల చార్జీలు, మార్కెట్ ఫీజు, సేవల ఫీజు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ, నిర్మాణాల అనుమతులకు రుసుం, ఖాళీ స్థలాలు, భవనాలను అద్దెకు ఇవ్వడం, వ్యాపార సముదాయాలను నిర్మించడం, చెరువు గట్లపై పండ్ల మొక్కల పెంపకం, చేపల పెంపకానికి లీజుకు ఇవ్వడం, పర్యాటక ప్రదేశాలను ఆకర్షనీయంగా తీర్చిదిద్ది పర్యాటకులు వచ్చేలా చేయడం ద్వారా పంచాయతీలు సొంతంగా ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుంది. వచ్చే ఆదాయాన్ని ఖర్చు చేయడంలోనూ జాగ్రత్తలు పాటించాలి.
ఆదాయ మార్గాలను చూస్తున్నాం..
పంచాయతీల్లో ఆదాయం పెంచేందుకు రెండు రోజుల పాటు సర్పంచ్‌లు, కార్యదర్శులకు శిక్షణ ఇచ్చాం. ప్రభుత్వ సూచనల ప్రకారం పంచాయతీలు సొంతంగా నిధులను సమకూర్చుకునే అవకాశాలను పరిశీలిస్తున్నాం. ఆర్థికంగా బలపడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆదాయ మార్గాలు పెంచుకుంటే అభివృద్ధి ఉంటుంది. ప్రభుత్వ నిధుల కోసం పంచాయతీలు ఎదురు చూసే పరిస్థితి మారాలి.
-సతీష్, ఎంపీడీవో, శృంగవరపుకోట