మద్యానికి డబ్బులు ఇవ్వలేదని
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:42 PM
పండగ పూట మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను హత్య చేసి భర్త పరారైన ఘటన సాలూరు పట్టణం దుగ్గాన వీధిలో బుధవారం చోటు చేసుకుంది.
- భార్యను హత్య చేసిన భర్త
- మిక్సీ వైరును పీకకు బిగించి చంపేసి పరారీ
- సాలూరు పట్టణంలో ఘటన
- కేసు నమోదు చేసిన పోలీసులు
సాలూరు, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): పండగ పూట మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను హత్య చేసి భర్త పరారైన ఘటన సాలూరు పట్టణం దుగ్గాన వీధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మక్కువ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన రాయల త్రివేణి (38)కి, పార్వతీపురం మండలం బందలుప్పి గ్రామానికి చెందిన రామకృష్ణకు కొన్ని సంవత్సరాల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఆదిత్య, మహేందర్ ఉన్నారు. సాలూరు పట్టణంలోని దుగ్గాన వీధిలో ఓ అద్దె ఇంట్లో చిన్నకుమారుడు మహేందర్‌తో కలసి రామకృష్ణ, త్రివేణి నివాసం ఉంటున్నారు. రామకృష్ణ తాపీ మేస్త్రీగా పని చేస్తుంటుగా, త్రివేణి భర్తతో కలిసి కూలి పనికి వెళ్లేది. గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పనులు లేక ఇద్దరూ ఇంటి వద్దనే ఉంటున్నారు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని భార్య త్రివేణిని రామకృష్ణ అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన రామకృష్ణ ఇంట్లో ఉన్న మిక్సీ వైరును త్రివేణి మెడకు బిగించి గట్టిగా లాగడంతో మృతి చెందింది. రాత్రి 7.30 గంటల సమయంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొని ఇంటికి వచ్చిన చిన్న కొడుకు మహేందర్ తల్లి విగతజీవిగా పడిఉండడాన్ని చూశాడు. ఆమెను లేపేందుకు ప్రయత్నించగా ఉలుకుపలుకు లేకపోవడంతో ఏమైందని తండ్రిని అడిగాడు. ‘మీ అమ్మ గుండెపోటుతో పడిపోయిందని. ఈ విషయం సాలూరు గొల్లవీధిలో ఉంటున్న మీ పెద్దమ్మ బందారి మంగకు చెప్పు’ అని రామకృష్ణ తన కుమారుడికి చెప్పి పంపించాడు. అనంతరం రాత్రి 8.30 సమయంలో త్రివేణిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యులకు చూపించాడు. అప్పటికే ఆమె మృత్యువాత పడినట్లు వైద్యులు ధ్రువీకరించటంతో అక్కడ నుంచి రామకృష్ణ పరారయ్యాడు. కుమారుడు మహేందర్ వెంటనే కాకినాడలో బార్బర్ వృత్తి చేసుకొని ఉంటున్న తన అన్నయ్య ఆదిత్యకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పట్టణ సీఐ అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. త్రివేణి మృతితో కుమారులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.