ఈ దుమ్ము, ధూళి భరించలేం
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:58 AM
‘ఈ క్వారీ లారీల వల్ల దుమ్ము, ధూళి భరించలేక పోతున్నాము. శబ్దకాలుష్యంతో నిద్రే పట్టడం లేదు. చాలామందికి జబ్బులొస్తున్నాయి. వేలాది రూపాయలు ఖర్చవుతోంది. వెంటనే వీటిని ఆపించండి’ అంటూ గరుగుబిల్లి మండలం పెద్దగుడబ గ్రామస్థులు వాపోతున్నారు.

శబ్ద కాలుష్యంతో అల్లాడుతున్నాము
రోగాలొస్తే వేలాది రూపాయల ఖర్చు
తొమ్మిది గ్రామాలకు తీవ్ర అసౌకర్యం
పెదగుడబలో క్వారీ లారీల అడ్డగింత
రెండు రోజులుగా ప్రజల ఆందోళనలు
తమగోడు పట్టించుకోవడంలేదని ఆవేదన
పోలీసుల రంగప్రవేశంతో ఉద్రిక్తత
15మంది గ్రామస్థులపై కేసుల నమోదు
పార్వతీపురం/గరుగుబిల్లి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ‘ఈ క్వారీ లారీల వల్ల దుమ్ము, ధూళి భరించలేక పోతున్నాము. శబ్దకాలుష్యంతో నిద్రే పట్టడం లేదు. చాలామందికి జబ్బులొస్తున్నాయి. వేలాది రూపాయలు ఖర్చవుతోంది. వెంటనే వీటిని ఆపించండి’ అంటూ గరుగుబిల్లి మండలం పెద్దగుడబ గ్రామస్థులు వాపోతున్నారు. తమ గ్రామం మీదుగా వెళ్తున్న లారీలను అడ్డుకున్నారు. వాహనాల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. వారి వివరాల మేరకు.. చిన్నగుడబ రె వెన్యూ పరిధిలో అత్యం మైనింగ్ క్వారీకి 2006లో దరఖాస్తు చేసుకోగా 2007లో అనుమతులు మంజూరయ్యాయి. అయితే సమీప గ్రామాల ప్రజల ఇబ్బందులను గనులశాఖ అధికారులు, రెవెన్యూశాఖ అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్వారీ నుంచి ప్రతిరోజూ లారీల్లో కంకరను భారీ వాహనాల్లో పరిసర గ్రామాల మీదుగా తరలిస్తున్నారు. దీనివల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ బుధ, గురువారాల్లో పెదగుడబ గ్రామస్థులు అడ్డుకున్నారు. రాకపోకలకు అంతరాయం కలిగించారు. గ్రామానికి ఆనుకుని ఉన్న క్వారీ నుంచి శబ్ద కాలుష్యంతో పాటు దుమ్ము, దూళి రేగడంతో పలు సమస్యలతో సతమతమవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. క్వారీ నుంచి సామగ్రిని నిత్యం భారీ వాహనాలతో తరలించడంతో పెదగుడబ, వల్లరిగుడబ, చినగుడబ, గదబవలస, సన్యాసిరాజుపేట, బాలగుడబ, కొంకడివరం, దళాయివలస, శివరాంపురం గ్రామస్థులకు తీవ్ర అసౌకర్యం నెలకొందన్నారు. ఈ సమస్యను సంబంధిత అధికారులకు తెలియపర్చినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాత్రి పూట నిద్ర పట్టని పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. రాత్రే కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గురువారం రోడ్డుకు అడ్డుగా ఉన్న వారిని పక్కకు తోసేశారు.
క్వారీ యాజమాన్యం ఫిర్యాదు
తమ లారీలను ప్రజలు అడ్డుకోవడంతో క్వారీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్వారీ సామగ్రి తరలించేందుకు యాజమాన్యానికి అవసరమైన అనుమతులు ఉన్నాయని, అడ్డుకోవడం తగదని హెచ్చరించారు. యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు 15 మందిపై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. అయితే న్యాయబద్ధమైన సమస్యపై పోరాటం చేస్తున్న తమపై అక్రమ కేసులు బనాయించారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా ప్రాణాలు కాపాడండి సారూ
‘మా ప్రాణాలు కాపాడండి, అరెస్టులను ఆపండి’ అంటూ గ్రామస్థులు గురువారం పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. సమావేశం ముగించుకుని వచ్చిన సబ్ కలెక్టర్ శ్రీవాస్తవ కాళ్లపై పడ్డారు. తమ వారిని అరెస్టు చేశారని, వారిని విడుదల చేయాలని వేడుకున్నారు. దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి న్యాయం చేస్తామని హామీనిచ్చారు.
రాజకీయ కక్షతోనే అడ్డుకుంటున్నారు
చినగుడబ ప్రాంతంలో గత 16 ఏళ్లుగా క్వారీ నిర్వహిస్తున్నామని క్వారీ ప్రతినిధి ఎ.నాగేశ్వరరావు తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. అయినా వాహనాలను బయటకు వెళ్లకుండా తీవ్ర ఆటంకాలు కలిగిస్తున్నారన్నారు. క్వారీని ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్వారీ నిర్వహణపై పలు ఫిర్యాదు చేశారని, అవసరమైన పత్రాలను ఉన్నతాధికారులకు తాము అందించామని చెప్పారు. రాజకీయ కక్షతోనే వాహనాలను అడ్డుకుంటున్నారన్నారు.
నిబంధనల మేరకే తవ్వకాలు: శ్రీనివాస్, జిల్లా గనులశాఖ అధికారి
అత్యం మైనింగ్ క్వారీలో తవ్వకాలకు సంంధించి అన్ని అనుమతులు ఉన్నాయి. నిబంధన ప్రకారం తవ్వకాలు జరుగుతున్నాయి. బ్లాస్టింగ్‌కు సంబంధించి మా శాఖ పరిధిలో లేదు. పోలీస్‌శాఖ పరిధిలో ఉంటుంది. ఇటీవల వివిధ శాఖల ద్వారా జాయింట్ దర్యాప్తు పూర్తి చేసి నివేదిక అందించాం.
41 నోటీసులు అందించాం: తిరుపతిరావు, చినమేరంగి ఎస్‌ఐ
రోడ్డుకు అడ్డంగా ఉండి రవాణాకు ఆటంకం కలిగిస్తున్న వారిపై కేసు నమోదు చేశాము. వారికి 41 నోటీసులు అందించాము. ఎవరినీ అరెస్టు చేయలేదు. ప్రజా రవాణాకు ఆటంకం కలిగించడంతో చట్ట ప్రకారం కొంతమందిని అదుపులోకి తీసుకున్నా.. తిరిగి వారిని విడిచిపెట్టాము.