i came to my sister. హమ్మయ్యా అక్క వద్దకు వచ్చేశాను
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:37 AM
i came to my sister. అక్క వద్దకు చేరిన ఆ తమ్ముడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. పట్టలేని ఆనందపరవశుడయ్యాడు. ఇంటికి చేరిన తమ్ముడిని చూసిన అక్క రాఖీ పండుగకు తమ్ముడిని ఆ దేవుడే ఇంటికి పంపాడని సంతోష పడింది. సహకారం అందించిన ‘ఆంధ్రజ్యోతి’కి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకు కృతజ్ఞతలు తెలిపింది. నెల్లిమర్ల బృందావన కాలనీలో బుధవారం ఉదయం 7.30 గంటల సమయంలో చోటుచేసుకున్న దృశ్యాలివి.
హమ్మయ్యా అక్క వద్దకు వచ్చేశాను
కన్నీటి పర్యంతమైన తమ్ముడు
భావోద్వేగానికి గురైన అక్క
రాఖీ పండుగకు తమ్ముడిని నా చెంతకు చేర్చిన దేవుడు
వెంకటరావుకు వైద్య పరీక్షలు
చేతులు జోడించి ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు తెలుపుకున్న వెంకటరావు
ఉదయం 7.30 గంటలకు ప్రత్యేక వాహనంలో ఇంటికి చేరిక
నెలిమర్ల, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): అక్క వద్దకు చేరిన ఆ తమ్ముడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. పట్టలేని ఆనందపరవశుడయ్యాడు. ఇంటికి చేరిన తమ్ముడిని చూసిన అక్క రాఖీ పండుగకు తమ్ముడిని ఆ దేవుడే ఇంటికి పంపాడని సంతోష పడింది. సహకారం అందించిన ‘ఆంధ్రజ్యోతి’కి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకు కృతజ్ఞతలు తెలిపింది. నెల్లిమర్ల బృందావన కాలనీలో బుధవారం ఉదయం 7.30 గంటల సమయంలో చోటుచేసుకున్న దృశ్యాలివి. తిరుపతి నుంచి కోరుమల్లి వెంకటరావు నెలిమర్ల చేరుకున్నారు. అక్క అరుణాపాథిక్‌ను చూడగానే ఆనందాశ్రువులతో పలకరించాడు. అక్కా తమ్ముళ్లు ఇద్దరూ భావోద్వేగానికి గురై మాటలు రాని ఆనందానుభూతి చెందారు. అనంతరం వెంకటరావును అక్క, బావ ఇంటి లోపలకు తీసుకెళ్లి సపర్యలు చేసి అల్పాహారం అందించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఏర్పాటుచేసిన ప్రత్యేక వాహనంలో వెంకటరావును తిరుపతి నుంచి నెలిమర్లకు తరలించారు. వెంకటరావు ఇంటికి చేరుకున్నాక నగర పంచాయతీ కమిషనరు జయరాం, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వెంకటరావును పరీక్షించి ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. నెల్లిమర్ల సీఐ రామకృష్ణతో పాటు ఎస్‌ఐ గణేష్ వెంకటరావును పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్పారు. టీడీపీ నాయకులు సువ్వాడ రవిశేఖర్, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి, టీడీపీ మండల అధ్యక్షుడు కడగల ఆనందకుమార్, నాయకులు గేదెల రాజారావు, లెంక అప్పలనాయుడు, బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ పతివాడ రాజేష్, ఉపాధ్యక్షుడు కామేశ్వరి, పార్టీ నాయకులు రాజేశ్, ఆల్తి మల్లిబాబు పరామర్శించారు. వెంకటరావుకు ధైర్యం చెప్పారు.
అక్కను నాకు ‘ఆంధ్రజ్యోతి’ చేరువ చేసింది: వెంకటరావు
ఓ పక్క దుఃఖం, మరోపక్క ఆనందం కలగలిపిన భావోద్వేగ హృదయంతో వెంకటరావు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆంధ్రజ్యోతి కారణంగానే తాను అక్క వద్దకు చేరగలిగానని, పునర్జన్మను ప్రసాదించిందంటూ ఆనందభాష్పాలతో పదేపదే కృతజ్ఞతలు తెలిపారు.
నెలన్నర కిందట తిరుపతికి వెళ్లి..
నెలన్నర కిందట దేవదేవుని దర్శించుకునేందుకు కోరుమల్లి వెంకటరావు తిరుమల కొండకు బయలుదేరాడు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని ఇంటికి తిరుగుముఖం పట్టే క్రమంలో కొండ మెట్లు పైనుంచి జారిపడిపోయాడు. తలకు, ముక్కు దగ్గర గాయాలు కావడంతో స్పృహ కోల్పోయాడు. ఆ తరువాత ఏమి జరిగిందో తనకు తెలియలేదు. ఫుట్‌పాత్ మీద అపస్మారకంగా పడి ఉన్న అతన్ని సుజాత అనే సామాజిక కార్యకర్త అక్కున చేర్చుకుంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అతనికి వైద్యం అందించి బతికించింది. ఈ విషయం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితం కావడంతో పాటు వెంకట్రావు అక్కకు ఆంధ్రజ్యోతి బృందం సమాచారం అందించింది. ఎంపీ కలిశెట్టికి ఆంధ్రజ్యోతి బృందం చెప్పగానే ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి వెంకటరావును నెలిమర్లకు రప్పించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. తిరుపతికి చెందిన ఆంధ్రజ్యోతి బృందం, సామాజిక కార్యకర్త సుజాతలతో మాట్లాడి బుధవారం వెంకటరావును ఇంటికి తీసుకొచ్చారు. ఆంధ్రజ్యోతి సిబ్బంది, ఎంపీ మానవతతో అందించిన సహకారాన్ని తాను జన్మలో మరువలేను అంటూ ఆయన చేతులు జోడించి, కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు.