I am the AE... No, I am! నేనే ఈఈ.. కాదు నేనే..
ABN , Publish Date - Jul 05 , 2025 | 12:01 AM
I am the AE... No, I am! సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్‌శాఖలో కుర్చీలాట తేలడం లేదు. ఈఈ సీటు కోసం ఇద్దరు అధికారుల మద్య కీచులాట నెలకొంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తానే ఈఈ అని ఒకరు.. కాదు కోర్టు అనుమతులు తనకే ఉన్నాయని మరొకరు చెప్పుకోవడంతో ఆ శాఖ కార్యాలయ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.
తగ్గేదెలే అంటున్న పాత ఈఈ
సర్దుకుపోదాం అంటున్న కొత్త ఈఈ
తలలు పట్టుకుంటున్న కార్యాలయ సిబ్బంది
తప్పని పాలనాపరమైన ఇబ్బందులు
సీతంపేట రూరల్, జూలై 4(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్‌శాఖలో కుర్చీలాట తేలడం లేదు. ఈఈ సీటు కోసం ఇద్దరు అధికారుల మద్య కీచులాట నెలకొంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తానే ఈఈ అని ఒకరు.. కాదు కోర్టు అనుమతులు తనకే ఉన్నాయని మరొకరు చెప్పుకోవడంతో ఆ శాఖ కార్యాలయ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఎవరితో ఎలా ఉండాలో, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియక మిన్నకుండిపోతున్నారు. దీనిపై ఇటీవలే ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి స్పష్టత ఇచ్చినప్పటికీ ఆశాఖలో ఉన్నతాధికారులు వెనక్కి తగ్గడం లేదు. దీంతో కార్యాలయంలో పాలనా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్ శాఖ పనితీరుపై బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆశాఖలో కీలకమైన కుర్చీ కోసం ఇద్దరు అధికారుల మధ్య నెలకొన్న వివాదం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
ఇదీ పరిస్థితి..
గత నెల 9న సీతంపేట గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్ ఈఈగా కేవీఎస్‌ఎన్ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆ జీవోలోనే ఇక్కడ ఈఈగా విధులు నిర్వహిస్తున్న పి.రమాదేవిని నెల్లూరు ఐటీడీఏకు బదిలీ చేస్తు ఆదేశాలు వచ్చాయి. అయితే ఇక్కడ పనిచేస్తున్న ఈఈ రమాదేవి తన బదిలీని సవాల్ చేస్తు కోర్టును ఆశ్రయించారు. ఆమె బదిలీని ఆరువారాల పాటు నిలుపుదల చేస్తు న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇక్కడ రెగ్యులర్ ఈఈగా విధులు నిర్వహిస్తున్న కేవీఎస్‌ఎన్ కుమార్ కూడా కోర్టును ఆశ్రయించి నట్లు తెలిసింది. వీరి పంచాయతీ కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం ప్రభుత్వ ఆదేశాల మేరకు రెగ్యులర్ ఈఈగా కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. కాగా గురు, శుక్రవారాల్లో పాత ఈఈ రమాదేవి కార్యాలయంలోని ఈఈ గదిలోని సీటులోనే కూర్చొన్నారు. దీంతో రెగ్యులర్ ఈఈ కుమార్ చేసేది లేక ఆ గదికి ఎదురుగా ఉన్న డీఈ రూంలోని సీట్లో కూర్చోని విధులు నిర్వహించారు. దీంతో కార్యాలయ సిబ్బంది ఎవరి వద్దకు వెళ్లే ఎవరూ ఏమనుకుంటారోనని లోలోపల మథనపడుతన్నారు. ఇటువంటి సమస్య తమకెప్పుడూ ఎదురుకాలేదని వారు ఊసులాడుకోవడం కనిపించింది. ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చూడాల్సిన ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. ఇప్పటికే ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర గిరిజనసంక్షేమశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ వివాదానికి తెరదించారు. అయినప్పటికీ మళ్లీ ఈఈ పోస్టుకోసం కుర్చీలాట మొదలైంది. ఇద్దరు ఈఈలు వేర్వేరు గదుల్లో ఉండడంతో వివాదం కాస్త ముదిరింది.
అందుకే రిలీవ్ కావట్లే..
‘సీతంపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా నాకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అందుకనే ఈఈ సీట్లో కూర్చుంటున్నా. ఇందులో వివాదం ఏముంది. నా బదిలీకి సంబంధించిన జీవోను కోర్టు కొట్టివేసింది. అందుకే నేనుఇక్కడ నుంచి రిలీవ్ కావడం లేదు. ’ అని పాత ఈఈ రమాదేవి సమాధానమిచ్చారు.
=======================
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే..
‘సీతంపేట గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్‌శాఖ ఈఈగా ప్రభుత్వం నాకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు రెగ్యులర్ ఈఈగా విధులు నిర్వహిస్తున్నా. దీనిలో వివాదం ఏముంది. చిన్నపాటి సమస్యలే.. సర్దుకుపోతాం. అని ఈఈ కేవీఎస్‌ఎన్ కుమార్ తెలిపారు.