రోడ్లకు నిధులెలా?
ABN , Publish Date - Dec 17 , 2025 | 11:23 PM
: గత కొన్నేళ్లుగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన నిధులతో జిల్లాలో ఎన్నో బీటీ రహదారుల నిర్మాణం జరిగింది.
- ఉపాధి హామీ పథకంలో మార్పులు
-ఈ నిధుల్లో భారీ కోత
- 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిందే
- బీటీ రహదారుల నిర్మాణంపై ప్రభావం
పార్వతీపురం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): గత కొన్నేళ్లుగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన నిధులతో జిల్లాలో ఎన్నో బీటీ రహదారుల నిర్మాణం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అధికంగా నిధులివ్వడంతో రోడ్లు పనులు విరివిగా జరిగాయి. అయితే, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరుని కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)గా మార్చేసింది. రాష్ట్రాలకు కేటాయించే నిధుల్లో భారీ కోత విధించింది. 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించుకోవాలని చెప్పింది. ఈ ప్రభావం జిల్లాలోని రహదారుల నిర్మాణంపై పడింది. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో 368 రహదారులను బీటీగా మార్చాల్సి ఉంది. ఇప్పుడు నిధుల్లో కోత విధించడంతో ఆ పనుల పూర్తిపై సందేహాలు నెలకొన్నాయి.
జిల్లాలో పరిస్థితి..
పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని 510 రహదారుల్లో 200 రోడ్లను బీటీగా మార్చేందుకు అవసరమైన నిధుల మంజూరుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. మరో 310 రోడ్లకు సంబంధించి ఎటువంటి నిధులు మంజూరు కాని పరిస్థితి ఉంది. ఏ గ్రాంట్ కింద కూడా వాటిని బీటీ రహదారులుగా మార్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు నేటి వరకు సిద్ధం కాలేదు. 310 రోడ్లకు రూ.400 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ నిధులు మంజూరైతే ఈ రోడ్లకు మోక్షం కలగనుంది. అదే విధంగా సీతంపేట ఐటీడీఏ పరిధిలో 58 రోడ్లను బీటీ రహదారులుగా మార్చాల్సి ఉంది. వీటికోసం రూ.70కోట్ల నుంచి రూ.80 కోట్ల అవసరం ఉంటుంది. సుమారు రూ.475 కోట్లు మంజూరైతే గాని ఈ రెండు ఐటీడీఏ పరిధిలో ఉన్న ఏజెన్సీ గ్రామాల రోడ్లు బీటీ రహదారులుగా మారే పరిస్థితి లేదు.
కొత్త నిబంధనలతో ఇబ్బందులు..
ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో గాని, మైదాన ప్రాంతాల్లో గాని బీటీ రహదారులు లేదా నూతన రోడ్ల నిర్మాణానికి అత్యధికంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులను వినియోగిస్తున్నారు. ఈ నిధులే కీలకంగా మారుతున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ పథకం పేరుమార్చి కొత్త బిల్లును తెచ్చి పలు నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు రహదారుల నిర్మాణానికి పెద్ద ఆటంకంగా మారాయి. ఇప్పటికే జిల్లాలో అనేక రహదారులను ఉపాధి పథకం నిధులను నిర్మించారు. కొత్త నిబంధనల ప్రకారం రూ.50లక్షల లోపు బిల్లులు ఉంటేనే చెల్లింపులు చేస్తారు. రూ.50 లక్షలు దాటితే బిల్లులు చెల్లించేందుకు కొత్త నిబంధనలు అంగీకరించవు. దీనివల్ల అనేక మంది కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. గతంలో గామసభల్లో ఆమోదించిన ప్రతి పనినీ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు నిధులు మంజూరు చేసేవారు. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నిధులు చెల్లించేవి. దీనివల్ల నిధులకు కొరత ఉండకపోవడంతో పనులు వేగవంతంగా జరిగేవి. కొత్త నిబంధనల ప్రకారం కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసే నిధుల్లో భారీ కోత విధించింది. తాజాగా కేంద్రం తన వాటాను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించుకుంది. మిగిలిన 30 శాతం వాటాను రాష్ట్రం ప్రభుత్వంపై పెట్టింది. మొత్తం 40 శాతం వాటాను రాష్ట్రమే భరించాలని కొత్త నిబంధన తీసుకువచ్చింది. దీనివల్ల ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మాణం కావాల్సిన బీటీ రహదారుల భవిష్యత్తు ఏమిటో అర్థం కానిపరిస్థితి నెలకొంది.
నిధులు అవసరం
మా ఐటీడీఏ పరిధిలో 510 రహదారులు ఉన్నాయి. ఇందులో 200 రోడ్లలో కొన్ని బీటీ రహదారులుగా మారాయి. మరికొన్నింటికి సంబంధించి నిధుల మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలు వెళ్లాయి. ఇంకా 310 రోడ్లను బీటీ రహదారులుగా మార్చేందుకు నిధులు అవసరం.
-మణి రాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, గిరిజన ఇంజనీరింగ్‌శాఖ, పార్వతీపురం ఐటీడీఏ