Share News

మంటలు ఆర్పేదెలా?

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:01 AM

జిల్లా అగ్నిమాపక శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. మరోపక్క తగినన్ని అగ్నిమాపక వాహనాలు లేవు.

మంటలు ఆర్పేదెలా?

అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత

27 మండలాలకు 8 వాహనాలే దిక్కు

పొరుగు జిల్లాలపై ఆధారపడుతున్న వైనం

- ఈ ఏడాది మే 9న విజయనగరంలోని ఫోర్టుసిటీలో అగ్నిప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రం కావడంతో వెంటనే రెండు అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. అగ్నిమాపక కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే పర్వాలేదు. కానీ, ఆ కేంద్రాలు లేని చోట ప్రమాదాలు సంభవిస్తే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న తలెత్తుతుంది.

విజయనగరం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లా అగ్నిమాపక శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. మరోపక్క తగినన్ని అగ్నిమాపక వాహనాలు లేవు. దీంతో పెద్దపెద్ద షాపింగ్‌ మాల్స్‌, పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే నియంత్రించడం సిబ్బందికి కత్తిమీద సాములా మారుతోంది. కొన్నిసార్లు మంటలు ఆర్పేందుకు పొరుగు జిల్లాల సిబ్బందిపై ఆధారపడాల్సి వస్తుంది.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో 27 మండలాలు ఉండగా విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, బాడంగి, రాజాం, చీపురుపల్లి, కొత్తవలస, ఎస్‌.కోటలో అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ఈ ఎనిమిది వాహనాలే జిల్లా వ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. ఈ వాహనాలు దశాబ్దాల కిందట నాటివి కావడంతో తరచూ మొరాయిస్తున్నాయి. 26 మంది డ్రైవర్లు అవసరం కాగా 18 మంది మాత్రమే ఉన్నారు. 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 80 మంది ఫైర్‌మెన్లకు గాను 49 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 31 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. పదవీ విరమణ చెందుతున్న వారి స్థానంలో కొత్త వారి నియామకం జరగడం లేదు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీసం కాంట్రాక్ట్‌ సిబ్బందిని కూడా నియమించిన దాఖలాలు లేవు. దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పడుతోంది. ఒక వైపు అగ్నిమాపక శాఖ విధులు, మరోవైపు ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి విధులతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గజపతినగరం, చీపురుపల్లి కేంద్రాలకు కొత్త వాహనాలు కావాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. బొబ్బిలి, గజపతినగరంలో కొత్తస్టేషన్ల ఏర్పాటుకు సైతం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాస్తవానికి మండలానికి ఒక అగ్నిమాపక కేంద్రం విధిగా ఉండాలి. కానీ, ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అగ్నిమాపక కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు సిబ్బంది నియామకం చేపట్టాల్సిన అవసరం ఉంది.

మెరుగుపరుస్తున్నాం..

అగ్నిమాపక శాఖ పనితీరును మరింత మెరుగుపరుస్తున్నాం. సిబ్బంది కొరత వాస్తవమే. ఫైర్‌మెన్లతో పాటు డ్రైవర్ల కొరత ఉంది. అయినా సరే ఎక్కడా ఇబ్బందులు లేకుండా ముందడుగు వేస్తున్నాం. కొత్త ఫైరింజన్లతో పాటు కొత్త భవనాలకు ప్రతిపాదనలు పంపాం. త్వరలో నిధుల విడుదలకు అవకాశం ఉంది.

- బీవీఎస్‌ రాంప్రకాష్‌, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, విజయనగరం

Updated Date - Sep 13 , 2025 | 12:01 AM