How to move forward? ఎలా ముందుకెళ్లాలి?
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:06 AM
How to move forward?
ఎలా ముందుకెళ్లాలి?
జిందాల్ భూములపై ఫిర్యాదుల వెల్లువ
పరిష్కారంపై మల్లగుల్లాలు పడుతున్న అధికారులు
అప్పటికప్పుడు నివేదికలకు ఆదేశం
పదిహేనేళ్ల క్రితం జిందాల్‌కు అప్పగించిన భూములు
పరిశ్రమల స్థాపన లేక నేడు వివాదం
శృంగవరపుకోట, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి):
జిందాల్ భూముల వ్యవహారానికి సంబంధించి కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు రెండు నెలల కాలంలో ఒకట్రెండు రోజులు తప్ప ప్రతి సోమవారం ఏదో ఒక సమస్యతో జిందాల్ భూ నిర్వాసితులు కలెక్టరేట్‌కు వస్తున్నారు. మరో పక్క స్థానిక రెవెన్యూ కార్యాలయంలోనూ ఆ భూముల సమస్యలపై ఫిర్యాదులు అందుతున్నాయి. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు కూడా వెళ్తున్నారు. దీంతో రెవెన్యూ శాఖపై రోజురోజుకూ పని భారం పెరుగుతోంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఇప్పుడు ఆ భూముల వ్యవహరంపై దృష్టిసారించాల్సి వస్తోంది.
గ్రీవెన్స్(ప్రస్తుత పీజీఆర్‌ఎస్)లో వచ్చిన ప్రతి సమస్యకూ అధికారులు పరిష్కారం చూపాలి. భూ సమస్యలు కావడంలో గ్రీవెన్స్‌కు వెళ్లిన ప్రతి సమస్యపైనా ఆయా రెవెన్యూ గ్రామాల రికార్డుల ప్రకారం క్షేత్ర స్థాయిలో భూమి స్థితిని పరిశీలించాల్సి వస్తోంది. ఇందుకు గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ సర్వేయర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ఉప తహసీల్దార్, మండల సర్వేయర్‌లు సుదీర్ఘ కసరత్తు చేయాల్సి వస్తోంది. అనంతరం తహసీల్దార్ అక్కడ నుంచి ఆర్డీవో, జేసీ, కలెక్టర్ వరకు నివేదికల తయారీ పనిపడుతోంది. ఎప్పుడో జరిగిన భూ సేకరణకు ఇప్పుడు రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పుకోవాల్సి రావడం ఈ శాఖకు ఇబ్బందిగా మారింది. ఎస్.కోట మండల పరిధిలోని మిగిలిన రెవెన్యూ సమస్యలను ఒక్కోసారి పక్కన పెట్టాల్సి వస్తోంది. మానవ వనరులతో పాటు ఆర్థిక వనరులను దీని కోసం ఖర్చు చేయాల్సి రావడంతో రెవెన్యూ శాఖకు తలకుమించిన భారంగా మారింది.
2007లో భూముల అప్పగింత
జెఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్ (జిందాల్)కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం, మూలబొడ్డవర, చినఖండేపల్లి, చీడిపాలెం, ముషిడిపల్లి గ్రామాల్లో భూములు సేకరించారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007 జూన్ 28న ఆ యాజమాన్యానికి 834.66 ఎకరాల అసైన్డ్ భూములు, 151.04 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. వీటితో పాటు జిందాల్ యాజమాన్యం 180.73 ఎకరాల జిరాయితీ భూమిని రైతుల నుంచి తీసుకుంది. మొత్తం 1166.43 ఎకరాలను ఈ పరిశ్రమ యాజమాన్యం పొందింది. 382 రైతు కుటుంబాలు నిర్వాసితులుగా మారారు. ఇందులో అత్యధిక శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు. వీరు పూర్తిగా జీవనాధారం కోల్పోయారు.
హామీలు అమలు చేయక..
ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమిలో ఇంతవరకు ఎటువంటి పరిశ్రమను నిర్మించలేదు. భూములన్నింటినీ ఖాళీగా ఉంచారు. భూములను తీసుకున్న సమయంలో నష్టపరిహారం, ఉద్యోగాలు, షేర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన వంటి అనేక హామీలను జిందాల్ యాజమాన్యం ఇచ్చింది. అవేవీ నెరవేర్చకపోవడంతో నిర్వాసిత రైతులు అప్పడప్పుడు భూముల్లోకి రావడం, వివిధ రూపాల్లో రోడ్డెక్కడం చేసేవారు. స్థానిక నాయకులు వారిలో కోపం చల్లారేలా మాట్లాడి మమ అనిపించేవారు.
- గత వైసీపీ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల నిర్మాణానికి జిందాల్ యాజమాన్యం భూములు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఒప్పందం కొనసాగించేందుకు సిద్ధపడింది. ఆ క్రమంలో జిందాల్ యాజమాన్యం ఆ భూముల్లోని చెట్లు, పొదలు తొలగించేపనికి పూనుకుంది. ఇదే సమయంలో సాగులో వున్న పంట, ఇళ్ల తొలగింపుకు సిద్ధపడుతుండడంతో తమకు తెలియకుండా ఆ భూములను జిందాల్ యాజమాన్యం రిజిస్ట్రేషన్ చేసేసుకుందని ఇళ్ల యజమానులు, సాగుదారులు గగ్గోలు పెడుతున్నారు. గ్రీవెన్స్‌లో వినతులు అందిస్తున్నారు.
- ఇప్పటికే జిందాల్‌కు ఇచ్చిన భూములు భూ సేకరణ చట్టం కింద జరగలేదని, 2013 భూ సేకరణ చట్ట ప్రకారం తిరిగి రైతులకు భూములు దక్కుతాయని వారంతా భావిస్తున్నారు. నాలుగు సంవత్సరాల కాల పరిమితిలో పరిశ్రమను నిర్మించడంతో పాటు ఉద్యోగాలు, షేర్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పిన యాజమాన్యం మాట తప్పడంతో తమ భూములను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నష్టపరిహారంలో అన్యాయం జరిగిందని కలెక్టరేట్ గుమ్మం తొక్కుతున్నారు. విచారణ ప్రత్యేక అధికారిగా కెఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్ మురళీను నియమించారు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం అప్పగించిన జిందాల్ భూముల సమస్యలకు పరిష్కారం చూపేందుకు ఇప్పుడు అధికారులు కష్టించాల్సి వస్తోంది.