Share News

విపత్తుల సమాచారం తెలుసుకునేదెలా?

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:50 AM

విపత్తుల సమాచారాన్ని ముందస్తుగా తెలుసుకునేందుకు ప్రభుత్వం అందించిన పరికరాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి.

విపత్తుల సమాచారం తెలుసుకునేదెలా?
మూలకు చేరిన పరికరాలు

- నిరుపయోగంగా పరికరాలు

- వినియోగంలోకి తేవాలని ప్రజల విన్నపం

భోగాపురం, అక్టోబరు5(ఆంధ్రజ్యోతి): విపత్తుల సమాచారాన్ని ముందస్తుగా తెలుసుకునేందుకు ప్రభుత్వం అందించిన పరికరాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. లక్షల రూపాయల విలువైన ఆ పరికరాలను ఓ మూలను పడేయడంతో దుమ్ముపట్టి వృథాగా మారాయి. జిల్లాలో బంగాళాఖాతం తీర ప్రాంతం సుమారు 29 కిలో మీటర్లు ఉంది. తీరం వెంబడి భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో సుమారు 16 గ్రామాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో పదేపదే అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు ఏర్పడుతుంటాయి. పదేళ్ల కిందట హుద్‌హుద్‌ తుఫాన్‌ ఎంత విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రాణ నష్టంతో పాటు ఆస్తినష్టం భారీగా జరిగింది. తుఫాన్లు, వాతావరణంలో మార్పులు తదితర విషయాలను సాంకేతికంగా ముందస్తుగానే తెలుసుకునేందుకు విపత్తుల శాఖ 2018-2019లో భోగాపురం తహసీల్దార్‌ కార్యాలయంలోని ఓ గదిలో కంట్రోల్‌ రూమ్‌ను సిద్ధం చేసింది. ఇందుకు అవసరమైన పరికరాలు, జనరేటర్‌, టవర్‌ను రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. అప్పట్లో కంట్రోల్‌ రూమ్‌ను సిద్ధం చేశారేగానీ నిర్వహణను గాలికి వదిలేశారు. దీంతో విలువైన పరికరాలు మూలకు చేరాయి. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ సొమ్ము వృథా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్‌ ఎం.రమణమ్మను వివరణ కోరగా.. విపత్తుల పరికరాలకు సంబంధించి తమవద్ద ఎటువంటి సమాచారం లేదని తెలిపారు.

Updated Date - Oct 06 , 2025 | 12:50 AM