ఇంకా ఎన్నాళ్లు?
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:15 AM
కురుపాం మండల కేంద్రానికి సమీపంలోని టేకరఖండి వద్ద చేపడుతున్న జేఎన్‌టీయూ గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం నత్తనడకన సాగుతోంది.
- పూర్తికాని గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం
- ఐదేళ్లుగా కొనసాగుతున్న పనులు
- వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యం
- రూ.16.5 కోట్ల బిల్లులు పెండింగ్
- రూ.7.5 కోట్లు విడుదల చేసిన ప్రస్తుత ప్రభుత్వం
- పనుల పూర్తిపై ఆశలు
జియ్యమ్మవలస, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): కురుపాం మండల కేంద్రానికి సమీపంలోని టేకరఖండి వద్ద చేపడుతున్న జేఎన్‌టీయూ గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. పనులు ప్రారంభించి ఐదేళ్లు అవుతున్నా ఇంకా 58 శాతమే జరిగాయి. భవనాల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతాయో, తరగతులు ఎప్పుడు ప్రారంభిస్తారోనని గిరిజన విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గిరిజన విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తామని చెప్పి టేకరఖండి గ్రామ సమీపంలో సర్వే నెంబరు 50లోని 105.32 ఎకరాల్లో జేఎన్‌టీయూ గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి 2020 అక్టోబరు 2న అప్పటి వైసీపీ పెద్దలు శంకుస్థాపన చేశారు. రూ.153.853 కోట్లు అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు అప్పటి ప్రభుత్వం అప్పగించింది. నిర్మాణాలను రెండు దశల్లో చేపట్టాలని ఆదేశించింది. మొదటి విడతగా రూ.122.50 కోట్లుతో అకడమిక్ బ్లాక్ (మెయిన్ బ్లాక్), బాలుర వసతి గృహం, బాలికల వసతి గృహం, రక్షిత మంచినీటి పథకం ట్యాంకు, విద్యుత్ సబ్‌స్టేసన్, ప్రవేశ ద్వారం నిర్మించాల్సి ఉంది. ఈ పనులు 2021 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది అక్టోబరు నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అంటే మరో ఆరు నెలల్లో మొదటి విడత పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ, వైసీపీ ప్రభుత్వంలో సకాలంలో నిధులు అందక నాలుగేళ్లుగా నిర్మాణాలు నత్తనడకన సాగాయి. రూ.45 కోట్లు విలువైన పనులు ఇంతవరకు జరగగా, వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో కేవలం రూ. 28.5 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇంకా రూ.16.5 కోట్లు బిల్లులు పెండింగ్ ఉండిపోయాయి. ఇటీవల రూ.7.5 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఇంకా రూ.9కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అంతేకాకుండా మొదట నిర్మించాల్సిన డిజైన్‌ను మళ్లీ మార్పుచేసి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
నిలిచిన మెయిన్ బ్లాక్ పనులు
నిధుల లేమి
నిధుల లేమితో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ప్రస్తుతం 58 శాతం పనులు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి రూ.9 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నిర్మాణానికి కావల్సిన రూ.80 కోట్లు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కళాశాల నిర్మాణం పూర్తయితే సివిల్, ఈఈఈ, సీఎస్‌ఈ, ఈసీసీ బ్రాంచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 1,800 మంది విద్యార్థులు చదువుకోవచ్చు. 600 మందికి హాస్టల్ సౌకర్యం కూడా ఉంటుంది. కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని 2026-27 విద్యా సంవత్సరం నాటికైనా గిరిజన విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలని గిరిజన సంఘాలన్నీ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.
న్యాయం చేయాలి
ఈ ప్రాంతంలో గిరిజన విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య లభించడం ఒక వరమే. కానీ, గత ప్రభుత్వం మాత్రం న్యాయం చేయలేకపోయింది. కూటమి ప్రభుత్వమైనా కళాశాల నిర్మాణం పూర్తిచేసి గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలి.
-కూరంగి సీతారాం, సీసీఎం నాయకుడు, జియ్యమ్మవలస
నిధులు విడుదల చేయాలి
ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం చకచకా జరగాలంటే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. పనులపై కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వ నిర్ణయానికి ఎదురు చూస్తున్నాం.
-రామకృష్ణ, డీఈఈ, ఏపీఈడబ్ల్యూఐడీసీ, పార్వతీపురం మన్యం జిల్లా
ప్రభుత్వం ఆదేశిస్తే..
జేఎన్‌టీయూ కురుపాంలో అడ్మిషన్లు ప్రారంభించి కళాశాల నిర్వహణ చేయాలంటే ప్రభుత్వ ఆదేశాలు అత్యంత ముఖ్యమైనది. ప్రభుత్వ ఆదేశాలకు ఎదురు చూస్తున్నాం.
-జయసుమ, రిజిస్ట్రార్, జేఎన్‌టీయూకే