Share News

How Long With In-Charges? ఇన్‌చార్జిలతో ఇంకెన్నాళ్లు?

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:49 PM

How Long With In-Charges? జిల్లాలో గృహ నిర్మాణ శాఖకు అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొన్నేళ్లుగా ఇన్‌చార్జిల పాలనతోనే నెట్టుకొస్తున్నారు. జిల్లా ఏర్పడి నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. గత వైసీపీ సర్కారు పోస్టుల భర్తీకి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది లేక పర్యవేక్షణ కొరవడుతోంది.

How Long With In-Charges? ఇన్‌చార్జిలతో ఇంకెన్నాళ్లు?
పార్వతీపురంలో జిల్లా గృహ నిర్మాణశాఖ కార్యాలయం

  • కొరవడిన పర్యవేక్షణ

  • గృహ నిర్మాణాలపై ప్రభావం

  • లక్ష్యాలు నెరవేరేనా?

పార్వతీపురం, నవంబరు25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గృహ నిర్మాణ శాఖకు అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొన్నేళ్లుగా ఇన్‌చార్జిల పాలనతోనే నెట్టుకొస్తున్నారు. జిల్లా ఏర్పడి నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. గత వైసీపీ సర్కారు పోస్టుల భర్తీకి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది లేక పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో గృహ నిర్మాణాల్లో పురోగతి కనిపించడం లేదు. ఆశించినస్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించాల్సి ఉంది.

సిబ్బంది ఇలా..

- జిల్లాలో హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ పోస్టు కొన్నేళ్లుగా ఖాళీగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో పీడీగా రఘురాం పనిచేసేవారు. 2023, మే 5న ఆయన్ని బదిలీ చేశారు. అప్పటి నుంచి ఆ పోస్టును భర్తీ చేయలేదు. ఇతర శాఖలకు చెందిన అధికారులే ఇన్‌చార్జి పీడీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ధర్మచంద్రారెడ్డి ఇన్‌చార్జి పీడీగా కొనసాగుతున్నారు.

- జిల్లాలో రెండు డివిజన్లకు పూర్తిస్థాయి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు లేరు. పార్వతీపురం ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా ఆ శాఖకు చెందిన పార్వతీపురం డీఈ సోమేశ్వరరావుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్ప గించారు. పాలకొండ ఇన్‌చార్జి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పంచాయతీరాజ్‌ డీఈ రవి కొన సాగుతున్నారు. పీఆర్‌ ఇన్‌చార్జి ఈఈ, హౌసింగ్‌లో డీఈగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. మొత్తంగా నాలుగు పోస్టుల బాధ్యతలు చూస్తున్నారు.

- కురుపాం గృహ నిర్మాణ శాఖ డీఈగా పంచాయతీరాజ్‌ డీఈ నంద వెంకటరావు అదనపు బాధ్యతలు అప్పగించారు. పీఆర్‌ డీఈ చిన్నంనాయుడు గృహ నిర్మాణశాఖ సాలూరు ఇన్‌చార్జి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా ఉన్నారు.

- వీరఘట్టం ఏఈ వినోద్‌కుమార్‌ భామిని మండలానికి ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పార్వతీపురం, కురుపాం, కొమరాడ మండలాలకు మాత్రమే పూర్తిస్థాయి రెగ్యులర్‌ ఏఈలు ఉన్నారు. మిగిలి మండలాలకు ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఏఈలు పనిచేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

కేంద్ర ప్రభుత్వం 2.0 స్కీంలో భాగంగా పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాల్లో కొత్తగా 634 ఇళ్లు మంజూరు చేశారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో పీఏఎంవై 2.0 స్కీమ్‌లో భాగంగా సర్వే కొనసాగుతుంది. ఈ నెల 30తో ఇది ముగుస్తుంది. జిల్లాలో సుమారు 2,33,44 మందికి ఇళ్లు మంజూరయ్యే పరిస్థితి ఉంది. పీఎం జన్‌మన్‌ స్కీమ్‌లో భాగంగా సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, కురుపాం తదితర మండలాల్లోని షెడ్యూల్డ్‌ గ్రామాల్లో పీవీటీజీలకు 5,169 ఇళ్లు మంజూరు చేశారు. వాటిల్లో 683 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. అయితే వీటి పర్యవేక్షణ, బిల్లుల మంజూరు, గృహ నిర్మాణాలపై లబ్ధిదారులకు సహకారం అందించేందుకు అవసరమైన హౌసింగ్‌ సిబ్బంది జిల్లాలో లేరు. ఏ శాఖకైనా పూర్తిస్థాయి అధికారులు, పర్యవేక్షణ ఉంటేనే పనుల్లో ప్రగతి కనిపిస్తుంది. కానీ గృహ నిర్మాణ శాఖలో భిన్న పరిస్థితి నెలకొంది. వాస్తవంగా ఒక శాఖ అధికారి మరొక శాఖ విఽధులు నిర్వహించాలంటే కష్టం. మరోవైపు వీడియో, టెలీకాన్ఫరెన్స్‌లు, సమీక్షలకే టైం సరిపోతుంది. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జి అధికారుల పాలనలో గృహ నిర్మాణ లక్ష్యాలు ఏ విధంగా నెరవేరుతాయో ఉన్నతాధికారులకే తెలియాలి

అదనపు సాయం పొందినా..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగనన్న కాలనీ లబ్ధిదారులకు బిల్లులు చెల్లించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయలేని వారికి అదనపు సహాయాన్ని అందించింది. పీవీటీజీలకు రూ.లక్ష , ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ. 75 వేల చొప్పున సాయం అందించారు. మొత్తంగా జిల్లాలో 3,618 మంది గృహ నిర్మాణ లబ్ధిదారులకు రూ.8.32 కోట్లు అందించారు. అయితే వారిలో కేవలం 88 మంది మాత్రమే శ్లాబ్‌ లెవెల్‌ వరకు గృహ నిర్మాణాలు చేపట్టారు. అదనపు సహాయం పొందినా చాలా మంది పనులు పూర్తి చేయలేకపోయారు. హౌసింగ్‌ శాఖలో అధికారుల కొరత, పర్యవేక్షణ లోపం ఇందుకు కారణమనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిసిస్తున్నాయి.

వారికి న్యాయం జరిగేదెప్పుడు?

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 4,030 మందికి ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరు చేశారు. వివిధ దశల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి రూ.36.37 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. అప్పట్లో 24.20 కోట్ల వరకూ చెల్లించారు. ఇంతలోనే ఎన్నికలు జరగడం.. వైసీపీ అధికారంలోకి రావడంతో సీన్‌ మారింది. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ లబ్ధిదారులకు వైసీపీ సర్కారు బిల్లులు చెల్లించలేదు. దీంతో ఇళ్ల నిర్మాణాలు కూడా ముందుకు సాగని పరిస్థితి. ప్రస్తుతం ఈ లబ్ధిదారులంతా కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు.

Updated Date - Nov 25 , 2025 | 11:49 PM