In-Charges..? ఇన్‌చార్జిలతో ఇంకెన్నాళ్లు..?
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:06 AM
How Long with In-Charges..? గిరిజనుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏలకు రెగ్యులర్ పీవోలు లేకపోవడంతో పాలన గాడి తప్పుతోంది. ఇన్‌చార్జి పీవోలు సొంత నిర్ణయాలు తీసుకోలేక పోవడంతో ఏజెన్సీలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగడం లేదు. గిరిజనులకు సక్రమంగా పథకాలు అందడం లేదు. గిరిజన సంక్షేమాభివృద్థికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐటీడీఏలకు నిధులు కేటాయిస్తున్నా.. ఫలితం ఉండడం లేదు.
సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్న ఇన్‌చార్జిలు
గిరిజనులకు సక్రమంగా అందని సంక్షేమ పథకాలు
నిధులు మంజూరవుతున్నా.. వెచ్చించలేని పరిస్థితి
సీతంపేట రూరల్, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): గిరిజనుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏలకు రెగ్యులర్ పీవోలు లేకపోవడంతో పాలన గాడి తప్పుతోంది. ఇన్‌చార్జి పీవోలు సొంత నిర్ణయాలు తీసుకోలేక పోవడంతో ఏజెన్సీలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగడం లేదు. గిరిజనులకు సక్రమంగా పథకాలు అందడం లేదు. గిరిజన సంక్షేమాభివృద్థికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐటీడీఏలకు నిధులు కేటాయిస్తున్నా.. ఫలితం ఉండడం లేదు. రెగ్యులర్ పీవోలు లేక వాటిని గిరిజ నులకు అందించడంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. జిల్లాలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలను గడిచిన 14 నెలలుగా ఇన్‌చార్జి పీవోలతోనే నెట్టుకొస్తున్నారు. కాగా జిల్లాల విభజన తరువాత సీతంపేట ఐటీడీఏకు చైర్మన్ ఎవరనేది ఇంకా తేలలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు సీతంపేట ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు కూడా నిర్వహించలేదు. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, పాలకొండ సబ్‌కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ప్రస్తుతం పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలకు ఇన్‌చార్జి పీవోలుగా కొనసాగుతున్నారు. అయితే రెగ్యులర్ పీవోలను నియమించకపోవడంపై గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకెన్నాళ్లు ఇలా ఇన్‌చార్జిలతో కాలయాపన చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
గాడితప్పుతున్న పాలన
ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోలుగా నియమితులైన ఐఏఎస్‌లకు గిరిజనాభి వృద్థి, పథకాలపై అవగాహన పెంచుకునే లోపే వారిని బదిలీ చేస్తు న్నారు. దీంతో ఇన్‌చార్జి పీవోలు కింది స్థాయి అధికారులపై ఆధారపడి పాలన సాగించాల్సి వస్తోంది. దీనిని అలుసుగా తీసుకొని ఐటీడీఏలోని కొందరు అధికారులు వారి స్వలాభం కోసం ఇన్‌చార్జి పీవోలను పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఇన్‌చార్జి పీవో పాలనలో సీతంపేట ఐటీడీఏలో ఓ కీలక అధికారి చక్రం తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి వారం నిర్వహించే ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు ఉపాధి, ఉద్యోగ, వ్యక్తిగత రుణాలు, హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, ఉద్యోగ అవకాశాల కోసం గిరిజనుల నుంచి పెద్దఎత్తున వినతులు వస్తున్నా.. వాటిపై ఇన్‌చార్జి పీవోలు సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. దీంతో గిరిజన సమస్యలు పరిష్కారం కావడం లేదు.
అందని పథకాలు
- సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజన రైతులకు ట్రైకార్ పథకం ద్వారా హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్‌ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020-21లో ఎస్‌సీఏ టు టీఎస్‌ఎస్ కింద సుమారు 6.5కోట్లు మంజూరు చేసింది. అయితే ఈ నిధులను ఇంతవరకు ఖర్చు చేయలేదు. పవర్‌టిల్లర్లు, ఆయిల్ ఇంజన్, టార్పాలిన్, మినీ ట్రాక్టర్‌లు, పసుపు బాయిలర్‌లు వంటి సుమారు 24 రకాల యంత్ర పరికరాలను కూడా గిరిజన రైతులకు సబ్సిడీతో అందించలేకపోతున్నారు.
- 20సబ్‌ప్లాన్ మండలాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో పసుపు సాగును విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం ఇటీవల రూ.7.93కోట్లు కేటాయించింది. పసుపు విత్తనాల సరఫరాకు సంబంధించి ఇటీవలే ఐటీడీఏ అధికారులు ఆన్‌లైన్ టెండర్ నిర్వహించారు. అయితే ఇద్దరు మాత్రమే ఆన్‌లైన్‌లో బిడ్‌లు దాఖలు చేశారు. అయినప్పటికీ గత ఇన్‌చార్జి పీవో సొంత నిర్ణయం తీసుకోలేక టెండర్‌నే పూర్తిగా రద్దుచేశారు. దీంతో గిరిజన రైతులకు ఈ ఏడాది పసుపు విత్తనాల పంపిణీ ప్రక్రియ ప్రారంభ దశలోనే నిలిచిపోయింది.
- గతంలో ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీ పథకం కింద గిరిజన యువతకు వాహ నాలు అందించారు. గత ఏడాది కాలంగా ఆ వాహనాల రుణాల రికవరీకి కింద వచ్చిన రూ.25 లక్షలను బ్యాంకులో ఎఫ్‌డీఆర్ చేశారు. అయితే తద్వారా వచ్చే వడ్డీని అధికారుల సొంత అవసరాలకు వాడుకున్నట్లు ఆరోపణలున్నాయి.
ఐఏఎస్‌ను నియమించాలి
సీతంపేట ఐటీడీఏకు రెగ్యులర్ ఐఏఎస్‌ను పీవోగా నియమించాలి. ఖాళీగా ఉన్న పోస్టుల్లో గిరిజనులకు అవకాశం కల్పించాలి.’
- బి.శ్రీనివాసరావు, గిరిజన ఏజేఏసీ అధ్యక్షుడు, సీతంపేట
==========================
అభివృద్ధి ఎలా సాధ్యం ?
ఐటీడీఏలకు రెగ్యులర్ పీవోలు లేకుంటే గిరిజనాభివృద్థి ఏవిధంగా సాధ్యపడుతుంది. రాష్ట్రంలో మిగతా ఐటీడీఏలకు రెగ్యులర్ పీవోలను నియమించారు. సీతంపేటలో మాత్రం ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. గిరిజనులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. వెంటనే ఐటీడీఏకు రెగ్యులర్ పీవోను నియమించాలి.
- లక్ష్మణరావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు, సీతంపేట
==========================
చర్యలు తీసుకుంటాం..
ఐటీడీఏలో గిరిజనేతరులకు ఉద్యోగవకాశాలు కల్పించడం, ప్రోటోకాల్ ఖర్చుల బిల్లులు, జీతభత్యాల పెంపు వంటి అంశాలన్నింటినీ పరిశీలిస్తాం. గిరిజనులకు అందించాల్సిన పథకాలపై చర్యలు తీసుకుంటాం.
- పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, సీతంపేట