Share News

Dole ఎన్నాళ్లీ డోలీ మోత!

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:19 AM

How Long Will the Dole Beat Continue! రోడ్డు సదుపాయం లేక గిరిశిఖర గ్రామస్థులకు డోలీ మోతలు తప్పడం లేదు. అష్టకష్టాలు పడి ఆసుపత్రులకు చేరుతున్నా.. ఒక్కోసారి రోగుల ప్రాణాలు నిలవడం లేదు. తాజాగా కొమరాడ మండలంలో చోటుచేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  Dole   ఎన్నాళ్లీ డోలీ మోత!
డోలీని మోసుకుంటూ నదిదాటుతున్న గిరిజనులు

  • ఆసుపత్రికి చేరినా దక్కని ఫలితం

  • రెబ్బలో ఓ వృద్ధురాలి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..

కొమరాడ, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): రోడ్డు సదుపాయం లేక గిరిశిఖర గ్రామస్థులకు డోలీ మోతలు తప్పడం లేదు. అష్టకష్టాలు పడి ఆసుపత్రులకు చేరుతున్నా.. ఒక్కోసారి రోగుల ప్రాణాలు నిలవడం లేదు. తాజాగా కొమరాడ మండలంలో చోటుచేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రెబ్బ కొండ శిఖర గ్రామానికి చెందిన తాడంగి నరసమ్మ (83) కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతోంది. సోమవారం వృద్ధురాలి పరిస్థితి బాగోలేక పోవడంతో కుటుంబ సభ్యులు డోలీ కట్టారు. సుమారు రెండు కిలోమీటర్లు రాళ్లు రప్పలు దాటి .. కొండ దిగి నాగావళి తీరానికి చేరుకున్నారు. డోలీ మోసుకుంటూనే నదిని దాటి ఒడిశా రాష్ట్రం వత్తాడ గ్రామానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆటో ద్వారా కూనేరు రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. అప్పటికే గిరిజన వృద్ధురాలికి బీపీ పెరగడంతో వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. ఆరోగ్యం మెరుగవకపోడంతో అక్కడి నుంచి విజయనగరం ఘోష ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం వృద్ధురాలు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా జ్వరం, బీపీ వల్లే నరసమ్మ చనిపోయినట్లు కూనేరు రామభద్రపురం పీహెచ్‌సీ వైద్యాధికారి శామ్యూల్‌ జోహ తెలిపారు.

రోడ్డు నిర్మించండి..

ఒడిశా సరిహద్దు.. మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెబ్బ కొండ శిఖర గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. నాగావళి నది దాటి గ్రామానికి చేరుకోవాల్సిన పరిస్థితి . దీంతో గ్రామస్థులే సొంతంగా నిధులు ఏర్పాటు చేసుకుని నాటు పడవను ఏర్పాటు చేసు కున్నారు. అయితే రోడ్డు లేని కారణంగా తరచూ డోలీ మోతలు తప్పడం లేదని, సకాలంలో వైద్య సేవలు పొందలేకపోతున్నామని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Nov 13 , 2025 | 12:19 AM