ఎన్నాళ్లీ నరకం?
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:40 PM
జిల్లా కేంద్రంలోని రాయగడ అంతర్రాష్ట్ర రోడ్డు శివారులో ఉన్న డంపింగ్ యార్డుతో పార్వతీపురం పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- కానరాని డంపింగ్ యార్డు తరలింపు
- ఇప్పటికి రెండుసార్లు ప్రయత్నించి వదిలేసిన వైనం
- దుర్వాసనతో పార్వతీపురం పట్టణ ప్రజల ఇబ్బందులు
- గొప్పలకే పరిమితమైనవైసీపీ ప్రభుత్వం
- కూటమి సర్కారుపైనే ఆశలు
పార్వతీపురంటౌన్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని రాయగడ అంతర్రాష్ట్ర రోడ్డు శివారులో ఉన్న డంపింగ్ యార్డుతో పార్వతీపురం పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్ యార్డు నుంచి వస్తోన్న తీవ్ర దుర్వాసన వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అంతరాష్ట్రపై రాకపోకలు సాగించే పాదచారులు, వాహనచోదకులు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డంపింగ్ యార్డుకు ఆనించి ఉన్న గోపసాగరం కలుషితం అవుతుంది. తరచూ చెత్త, వ్యర్థాలు రహదారికి పైకి వస్తుండడంతో స్థానికులు నరకం చూస్తున్నారు. డంపింగ్ యార్డు తరలింపునకు 15 ఏళ్ల కిందట అప్పటి మున్సిపల్ పాలకవర్గ సభ్యులు తీర్మానం చేసినా అది కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత మరోసారి అధికారులు ప్రణాళికలు తయారు చేసినా మళ్లీ అదే పరిస్థితి. దీనిపై జిల్లా కేంద్రవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
పార్వతీపురం మునిసిపాలిటీగా ఏర్పడినప్పుడు రాయగడ రోడ్డు శివారులో ఐదు ఎకరాల్లో డంపింగ్ యార్డును అప్పటి అధికారులు ఏర్పాటు చేశారు. అప్పటి జనాభాకు తగ్గట్టుగా, పట్టణానికి దూరంగా డంపింగ్ యార్డు ఉండడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. అయితే, ప్రస్తుతం పార్వతీపురం పట్టణం విస్తరించింది. జిల్లా కేంద్రంగా మారింది. డంపింగ్ యార్డుకు సమీపంలో వివేకానంద కాలనీ తదితర కాలనీలు ఏర్పడ్డాయి. దీంతో యార్డు నుంచి వస్తున్న దుర్వాసనతో ఈ కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కంపు కారణంగా ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నామని వాపోతున్నారు. భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. బోర్ల నుంచి వచ్చే నీరు దుర్వాసన వెదజల్లుతుందని, ఆ నీటిని తాగి డయేరియా లాంటి వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డుతో గోపసాగరం సైతం కలుషితమవుతుంది. గోపసాగరం కింద సుమారు 150 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే, నీరు కలుషితం అవుతుండడంతో వరి దిగుబడులు తగ్గుతున్నాయని రైతులు అంటున్నారు. 2023లో కలుషిత నీటితో గోపసాగరంలో సుమారు రూ.2 లక్షల విలువ చేసే చేపలు చనిపోయాయని మత్స్యకారులు చెబుతున్నారు. అంతే కాకుండా కలుషితమైన నీటిలో బట్టలు ఉతకలేకపోతున్నామని రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా డంపింగ్ యార్డును తరలించాలని కోరుతున్నారు.
రెండుసార్లు ఆగిన తరలింపు..
డంపింగ్‌యార్డు తరలింపునకు 2008లో అప్పటి పాలకవర్గ సభ్యులు తీర్మానం చేశారు. దీనికోసం పార్వతీపురం మండలం సంగంవలస పంచాయతీ పిట్టలవలస వద్ద 5 ఎకరాలను రెవెన్యూ అధికారులు కేటాయించారు. అలాగే, అప్రోచ్ రోడ్డు కోసం రూ.20 లక్షలు కేటాయించారు. ఈ మేరకు 2009లో మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు యార్డు తరలింపు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే డంపింగ్ యార్డుతో తాము రోగాల బారిన పడతామని, సంగంవలస పంచాయతీలోని గ్రామాల ప్రజలు నిరసనలు, ధర్నాలు చేపట్టారు. దీంతో డంపింగ్ యార్డు తరలింపును అధికారులు నిలుపుదల చేశారు. మళ్లీ 2014లో డంపింగ్ యార్డు తరలింపుపై మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పార్వతీపురం మండలం సంగం వలస పంచాయతీ పరిధిలోని రావికో, బట్టివలస గ్రామాల సమీపంలో 5 ఎకరాల్లో డంపింగ్ యార్డుతోపాటు చెత్తశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి స్థలాన్ని సేకరించారు. భూమి పూజ చేస్తారనే సమయానికి ప్రజా, గిరిజన సంఘాలు, వామపక్షాలు అడ్డుకోవడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది.
ఫ వైసీపీ ప్రభుత్వంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు డంపింగ్ యార్డు తరలిస్తామని గొప్పలు చెప్పారు. రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి గరుగుబిల్లి మండలం సుంకి, సంతోషపురం, తదితర గ్రామాల వద్ద స్థలాలను పరిశీలించారు. అయితే, ఆయా గ్రామాల నుంచి వ్యతిరేకత రావడంతో వారు చేతులు ఎత్తేశారు. కూటమి ప్రభుత్వమైనా డంపింగ్ యార్డును తరలిస్తుందనే ఆశతో ప్రజలు ఉన్నారు.
యార్డు తరలించాలి
డంపింగ్ యార్డుతో రైతులు, మత్స్యకారులు, రజకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గోపసాగరం కాలుష్యం బారిన పడుతుంది. యార్డును ఇక్కడి నుంచి తరలించాలని పాలకులు, అధికారులకు విన్నవించుకున్నా ఫలితం శూన్యం. కలెక్టర్ స్థాయి వరకు ఈ సమస్యను తీసుకువెళ్లినా పరిష్కారం చూపలేదు. ఇప్పటికైనా డంపింగ్ యార్డును తరలించాలి.
-చుక్క చంద్రరావు, గోపసాగరం ఆయకట్టు రైతు, పార్వతీపురం
భూగర్భ జలాలు కలుషితం
డంపింగ్ యార్డుతో మా కాలనీలో భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. బోర్ల నుంచి వస్తున్న నీరు దుర్వాసన వెదజల్లుతుంది. వారం రోజులకొకసారి మున్సిపల్ కొళాయి నుంచి నీరు వస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బోరు నీటిని తాగుతున్నాం. దీనివల్ల కొన్నిసార్లు డయేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నాం.
-జి.రవికుమార్, వివేకానందకాలనీ, పార్వతీపురం
ప్రత్యేక దృష్టి సారించాం
డంపింగ్ యార్డు తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా చెత్త నుంచి సంపద సృష్టించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇప్పటికే విశాఖపట్నానికి చెందిన ఓ ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థతో చర్చించాం. గోపసాగరం కలుషితం కాకుండా ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తాం.
-శ్రీనివాసరాజు, కమిషనర్, పార్వతీపురం మునిసిపాలిటీ