malaria: మలేరియాకు చికిత్స ఎలా అందుతోంది?
ABN , Publish Date - May 24 , 2025 | 12:13 AM
malaria: మలేరియా డిప్యూటీ డైరెక్టర్ రామనాథరావు శుక్రవారం జిల్లాలో పర్యటించారు. పలు పీహెచ్‌సీలను తనిఖీ చేశారు.
- బాధితులతో మాట్లాడిన డిప్యూటీ డైరెక్టర్ రామనాథరావు
- ప్రతి కేసుకూ చికిత్స అందించాలని అధికారులకు ఆదేశం
- జిల్లాలో వివిధ పీహెచ్‌సీల తనిఖీ
గుమ్మలక్ష్మీపురం/కురుపాం, మే 23 (ఆంధ్రజ్యోతి): మలేరియా డిప్యూటీ డైరెక్టర్ రామనాథరావు శుక్రవారం జిల్లాలో పర్యటించారు. పలు పీహెచ్‌సీలను తనిఖీ చేశారు. మలేరియా బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. చికిత్స ఎలా అందుతుంది, సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని అడిగితెలుసుకున్నారు. తొలుత గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుఖల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జర్న గ్రామంలో పర్యటించారు. మలేరియా బాధితులను కలిసి వారికి క్షేత్రస్థాయిలో అందిస్తున్న చికిత్స గురించి ఆరా తీశారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దుడ్డుఖల్లు పీహెచ్‌సీ ల్యాబ్‌ను తనిఖీ చేశారు. జ్వరాల అదుపు కోసం తీసుకుంటున్న చర్యల గురించి వైద్యాధికారి ప్రవీణ్‌తో చర్చించారు. తరువాత రేగిడి పీహెచ్‌సీ పరిధిలోని పెంగువ గ్రామాన్ని సందర్శించారు. అక్కడ దోమల లార్వా ప్రదేశాలను గమనించారు. సిబ్బందికి ఫ్రైడే డ్రైడే ప్రాధాన్యతను వివరించారు. అలాగే కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మలేరియా కేసులకు అందుతున్న సేవలు గురించి డాక్టర్ మౌనిక అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు ఇచ్చారు. జిల్లాలో ప్రతి మలేరియా కేసుకూ చికిత్స జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి వై.మణి, సహాయ అధికారి సూర్యనారాయణ, సబ్ యూనిట్ అధికారి కె.రాధాకృష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.