Share News

నిమ్మగడ్డి సాగు ఎలాఉంది?

ABN , Publish Date - May 22 , 2025 | 11:40 PM

ప్రభుత్వ పథకాలు, రాయితీలు, రుణాలు పొందేందుకు రైతులు సంఘాలుగా ఏర్పడాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ పిలుపునిచ్చారు.

 నిమ్మగడ్డి సాగు ఎలాఉంది?
రైతులు, మహిళలతో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

- సమస్యలు ఏమైనా ఉన్నాయా?

- రైతులు సంఘాలుగా ఏర్పడాలి

- ముఖాముఖి కార్యక్రమంలో కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

పార్వతీపురం రూరల్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాలు, రాయితీలు, రుణాలు పొందేందుకు రైతులు సంఘాలుగా ఏర్పడాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ పిలుపునిచ్చారు. మండలంలోని వెలగవలస గ్రామంలో గురువారం రైతులతో కలెక్టర్‌ ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. నిమ్మగడ్డి సాగు, దిగుబడి, ఆదాయం, సాగులో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని రైతులను కలెక్టర్‌ అడిగారు. నిమ్మగడ్డి సాగు లాభదాయకంగా ఉందని, వేసవిలో అధిక దిగుబడి వస్తుందని వారు చెప్పారు. అయితే, సాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. రైతులు సంఘాలుగా ఏర్పడాలని, రైతులు, ప్రభుత్వం చెరిసగం సహకారంతో నీటి బావులు తవ్వించి సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. సూక్ష్మ నీటి సేద్యం కోసం స్ర్పింక్లర్లను ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం కింద నిమ్మగడ్డిని సాగు చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఆయిల్‌ ఉత్పత్తికి అవసరమైన బాయిలర్ల ఏర్పాటుకు రైతుల భాగస్వామ్యం అవసరమని అన్నారు. గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు ఎవరైనా వలసలు వెళ్తున్నారా?, వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు అందుతున్నాయా? వంటి విషయాలను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. నూజివీడు సీడ్స్‌ సంపద రకం వరి విత్తనాలను సరఫరా చేయాలని రైతులు కోరారు. అదే రకమైన 1318 విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్‌ తెలిపారు. ఇటువంటి విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవన సహాయకులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ దాలమ్మ, జిల్లా ఉద్యానవన అధికారి బి.శ్యామల, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి

జిల్లాలో వివిధ దశల్లో ఉన్న పీఎం జన్‌మన్‌ గృహ నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మండలం చెప్పవానివలసలో గురువారం ఆయన పర్యటించారు. పీఎం జన్‌మన్‌ గృహ నిర్మాణాలను పరిశీలించారు. పనుల జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండో విడత బిల్లులు మరికొద్ది రోజుల్లో మంజూరు కానున్నాయని, గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గృహ నిర్మాణ సామగ్రిని ముందుగానే అందుబాటులో ఉంచకోవాలని హితవు పలికారు. ఈ పర్యటన కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్‌ అధికారి సోమేశ్యరరావు,చిరంజీవి,ఎంపీడీఓ జి.రమేష్‌ తదితర్లు పాల్గొన్నారు. వచ్చే వారానికి గృహ నిర్మాణాల్లో ప్రగతి లేకుంటే ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి వారం వందల సంఖ్యలో గృహాలు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఈవారం 70 గృహాలు మాత్రమే పూర్తి కావడంపై ఆయన మండిపడ్డారు. సిమెంట్‌, ఇసుక, స్టీల్‌ అన్ని అందుబాటులో ఉన్నప్పటికీ గృహ నిర్మాణాలు వెనుకంజలో ఉండడం సరికాదన్నారు. కేం ద్ర రా ష్ట్ర ప్రభుత్వాలు గృహ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయని, అందుకు తగిన విధంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

Updated Date - May 22 , 2025 | 11:40 PM