Share News

ఎలా ఉన్నారో?.. ఏం చేస్తున్నారో?

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:17 AM

జిల్లాకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు బంగ్లాదేశ్‌ కోస్టుగార్డ్స్‌కు చిక్కి ఆరు వారాలు అవుతుంది.

ఎలా ఉన్నారో?.. ఏం చేస్తున్నారో?
బంగ్లాదేశ్‌ కోస్ట్‌గార్డ్స్‌ అదుపులో ఉన్న మత్స్యకారులు(ఫైల్‌)

- బంగ్లాదేశ్‌ జైలులో తొమ్మిదిమంది జిల్లా మత్స్యకారులు

- వారిని స్వగ్రామాలకు తీసుకొచ్చేదెప్పుడో?

- ఆరు వారాలవుతున్నా స్పందనలేదని కుటుంబ సభ్యుల ఆవేదన

- వారి బాగోగులపై ఆందోళన

భోగాపురం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు బంగ్లాదేశ్‌ కోస్టుగార్డ్స్‌కు చిక్కి ఆరు వారాలు అవుతుంది. అక్కడి జైలులో వారు మగ్గుతున్నారు. అయితే, వారి యోగ క్షేమాలపై కుటుంబ సభ్యుల్లో బెంగ నెలకొంది. తమ వారు ఎలా ఉన్నారో?.. ఏం చేస్తున్నారో అని ఆందోళన చెందుతున్నారు. వారి రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. భోగాపురం మండలం కొండ్రాజుపాలెంకు చెందిన మరుపల్లి చిన్నఅప్పన్న, మరుపల్లి రమేష్‌, సూరాడ అప్పలకొండ, మరుపల్లి ప్రవీణ్‌, సురపతి రాము, అప్పలకొండ, పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన నక్కా రమణ, వాసపల్లి సీతయ్య, మైలపల్లి అప్పన్న విశాఖపట్నంలోని జాలరుపేటలో నివాసముంటున్నారు. ఈ తొమ్మిది మంది మత్స్యకారులు ఈ ఏడాది అక్టోబరు 13న ఐఎన్‌డీ-ఏపీ- వీ5- ఎంఎం-735 నెంబరు గల పడవపై విశాఖ హార్బర్‌ నుంచి చేపల వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్లారు. వేట సాగిస్తూ సిగ్నల్స్‌ అందక, వాతావరణం అనుకూలించక తదితర కారణాలతో అదే నెల 22వ తేదీ వేకువ జామున సుమారు 2గంటల సమయంలో సరిహద్దులు దాటి బంగ్లాదేశ్‌ జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో వారిని ఆ దేశ కోస్టుగార్డ్స్‌ అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అప్పట్లో పలువురు నాయకులు, అఽధికారులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. బంగ్లాలో చిక్కుకున్న మత్స్యకారులను సురక్షితంగా స్వగ్రామాలకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ తరువాత ఆ ఊసే మరిచిపోయారు. ఆరు వారాలు కావస్తున్నా కనీసం స్పందన లేకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వారి రాక కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి బంగ్లాదేశ్‌లో బందీలైన తమవారిని విడిపించాలని వేడుకుంటున్నారు.

Updated Date - Dec 06 , 2025 | 12:17 AM