Share News

Services సేవలు ఎలా అందుతున్నాయ్‌!

ABN , Publish Date - Oct 31 , 2025 | 11:45 PM

How Are the Services Being Delivered!? జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ హడలెత్తిస్తున్నాయి. అర్జీదారులకు ప్రభుత్వం నేరుగా ఫోన్‌ చేసి సమస్యలు, ఉద్యోగుల పని తీరుపై ఆరా తీస్తుండడంతో ఎవరు ఏం చెబుతారోనని ఆందోళన చెందుతున్నారు. అయితే కొంతమంది ఉద్యోగులు మాత్రం ముందస్తుగా అప్రమత్తమవుతున్నారు.

  Services   సేవలు ఎలా అందుతున్నాయ్‌!

  • ప్రభుత్వ ఉద్యోగుల హడల్‌

పాలకొండ, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ హడలెత్తిస్తున్నాయి. అర్జీదారులకు ప్రభుత్వం నేరుగా ఫోన్‌ చేసి సమస్యలు, ఉద్యోగుల పని తీరుపై ఆరా తీస్తుండడంతో ఎవరు ఏం చెబుతారోనని ఆందోళన చెందుతున్నారు. అయితే కొంతమంది ఉద్యోగులు మాత్రం ముందస్తుగా అప్రమత్తమవుతున్నారు. వివిధ పనులపై తమ వద్దకు వచ్చే అర్జీదారులతో అసలు విషయం చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి నేరుగా ఫోన్‌ వస్తే తమ పనితీరుపై సానుకూలంగా సమాధానం చెప్పాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. మరి కొందరైతే అర్జీదారులకు వారి సమస్యలపై సమాచారం అందిస్తూ.. పనిలో పనిగా తమ పనితీరుపై మంచిగా చెప్పాలని ప్రాధేయపడుతున్నట్టు సమాచారం.

ఇదీ పరిస్థితి..

పాలనలో పారదర్శకత, ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచి అవినీతిని నిరోధించేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా నేరుగా అర్జీదారులతో మాట్లాడి ఉద్యోగుల పనితీరు, వివిధ శాఖల ద్వారా ఎలా సేవలు అందుతున్న విషయాన్ని తెలుసుకుంటోంది. ఈ నేపథ్యంలో వివిధ సమస్యలపై గ్రీవెన్స్‌కు వచ్చేఅర్జీదారులు సంతృప్తికరంగా ఉన్నారా? లేరో అని కాల్స్‌ ద్వారా తెలుసుకుం టున్నారు. అర్జీ పెట్టుకున్న సమయంలో ఉద్యోగులు నుంచి ఎదుర్కొనే ఇబ్బందులపై ఆరా తీస్తున్నారు. అంతేకుండా ఎవరైనా లంచం అడుగుతున్నారా? అని నేరుగా అర్జీదారుడినే అడుగు తున్నారు. దీనిలో భాగంగానే ఈ ఏడాది జూన్‌ నుంచి అర్జీదారులకు ఏమేరకు సమస్యలు పరిష్కారమయ్యాయనే వివరాలు సేకరిస్తున్నారు. ఒకవేళ అర్జీ పెండింగ్‌లో ఉంటే ఎందువల్ల పరిష్కారం కాలేదో తెలుసుకుని.. ఆ సమాచారాన్ని తిరిగి ఆయా జిల్లా డివిజన్‌ , మండల గ్రామస్థాయిలో ఉద్యోగులకు చేరవేస్తున్నారు. సంబంధిత శాఖ నుంచి వివరణ కోరుతూ కచ్చితమైన సమాధానం చెప్పాలని ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లాలో వివిధ శాఖల ఉద్యోగుల పనితీరుపై ప్రతి మూడు నెలలకొకసారి ఉన్నతాధికారులకు సమాచారం అందుతుండడంతో క్షేత్రస్థాయి సిబ్బంది మరింత అప్రమత్తమవుతున్నారు. కాగా ప్రభుత్వ తాజా నిర్ణయంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 31 , 2025 | 11:46 PM