Girl Students? విద్యార్థినులు ఎలా ఉన్నారు?
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:31 AM
How Are the Girl Students? కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు. ఈ మేరకు ఆదివారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ఫోన్ చేశారు. విద్యార్థినులు ఎలా ఉన్నారని అడిగారు. అధికారులు తీసుకున్న చర్యలపై నివేదికలు అందించాలని సూచించారు.
తీసుకున్న చర్యలను వివరించిన మంత్రి సంధ్యారాణి
కేజీహెచ్‌లో 42 , జిల్లా కేంద్రాసుపత్రిలో 88 మందికి వైద్య సేవలు
పార్వతీపురం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు. ఈ మేరకు ఆదివారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ఫోన్ చేశారు. విద్యార్థినులు ఎలా ఉన్నారని అడిగారు. అధికారులు తీసుకున్న చర్యలపై నివేదికలు అందించాలని సూచించారు. ప్రస్తుతం విశాఖ కేజీహెచ్‌లో 42 మంది , పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రిలో 88 మంది విద్యార్థినులు వైద్యసేవలు పొందుతున్నట్లు మంత్రి సంధ్యారాణి సీఎంకు వివరించారు. వారి ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించామని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్యులు సేవలు అందిస్తున్నారని తెలిపారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా కురుపాం విద్యార్థినుల అస్వస్థతపై కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, వైద్యాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై నివేదిక అందించాలన్నారు. త్వరలో కురుపాంలో పర్యటిస్తానని డిప్యూటీ సీఎం వెల్లడించారు.
కేజీహెచ్‌కు మంత్రి
సీఎం ఆదేశాలతో మంత్రి సంధ్యారాణి ఆదివారం విశాఖ కేజీహెచ్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు. వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడి ధైర్యం చెప్పారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, కంటికి రెప్పలా చూసుకోవాలని అక్కడి వైద్యసిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా మంత్రి సంధ్యారాణి సోమవారం పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి రానున్నారు. విద్యార్థినుల ఆరోగ్యం, తదితర విషయాలపై కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, వైద్యాధికారులతో సమీక్షించనున్నారు.
మరో 14 మంది తరలింపు
పార్వతీపురం ఆంధ్రజ్యోతి/బెలగాం,అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రి నుంచి ఆదివారం మరో 14 మంది కురుపాం విద్యార్థినులను మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. శుక్రవారం ముగ్గురు, శనివారం 25 మందితో కలుపుకుని మొత్తంగా అక్కడ 42 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పార్వతీపురంలో 88 మందికి వైద్యసేవలు అందిస్తున్నారు.
12 వరకు గురుకులానికి సెలవులు
పార్వతీపురం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలకు ఈ నెల 12 వరకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు గురుకులంలో యుద్ధ ప్రాతిపదికన ఆర్‌వో ప్లాంట్ పనులు , క్లోరినేషన్ చేపడుతున్నారు. రాష్ట్ర వైద్య బృందం నివేదికలు అందించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఇక జిల్లాలోని అన్ని వసతి గృహాలు, గ్రామీణ ,పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా గురుకులంలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా రక్త పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాలను బట్టి అవసరమైన వైద్య సేవలు అందించనున్నారు.
అందరూ క్షేమంగా ఉన్నారు: కలెక్టర్
విద్యార్థినులందరూ క్షేమంగానే ఉన్నారని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఎస్.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. విశాఖ కేజీహెచ్, పార్వతీపురం జిల్లా ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నానని వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాత్రమే విద్యార్థినులను కేజీహెచ్‌కు తరలించామన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కేజీహెచ్ సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ప్రతి రెండు గంటలకొకసారి వారి ఆరోగ్య స్థితిపై బులిటెన్ తెప్పించుకొని, సూచనలు అందజేస్తున్నట్టు కలెక్టర్ వివరించారు.
మెరుగైన వైద్యం అందించాలి: గురుకుల కార్యదర్శి గౌతమి
బెలగాం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి) : జాండీస్ లక్షణాలతో బాధపడుతున్న కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని గిరిజన సంక్షేమ గురుకుల కార్యదర్శి గౌతమి ఆదేశించారు. ఆదివారం పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రిని సందర్శించారు. చికిత్స పొందుతున్న విద్యార్థినులతో మాట్లాడారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆమె తెలిపారు. సుమారు 600 మంది విద్యార్థినులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ముందస్తుగా వైద్యసేవలు అందించినట్లు వెల్లడించారు. కొన్ని రోజులుగా 120 మంది జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందినట్లు తెలిపారు. పచ్చకామెర్లు అధిక మోతాదులో ఉన్న వారికి విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తున్నామని, ఎవరు ఎటువంటి ఆందోళన చెందొద్దని సూచించారు. విద్యార్థినుల ఆరోగ్యాన్ని నిరంతర పర్యవేక్షిస్తున్నా మన్నారు. ఈ ఘటనపై ప్రత్యేక బృందాన్ని నియమించామని, వారు సమగ్ర విచారణ జరిపి నివేదికలు అందించిన తర్వాత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆమె వెంట జేసీ యశ్వంత్ కుమార్‌రెడ్డి, పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగశివజ్యోతి తదితరులు ఉన్నారు.