house for poor people పేదలకు గృహయోగం
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:22 PM
house for poor people నిరుపేదలకు మరింతగా ఇళ్లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముందుగా సొంత ఇంటి స్థలాలు ఉన్నవారికి పక్కా ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంది.
పేదలకు గృహయోగం
ఇంటి స్థలాలు ఉన్నవారికి గృహాలు మంజూరు
దరఖాస్తుల స్వీకరణ
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ 4200 దరఖాస్తులు రాక
నెలాఖరు వరకు గడువు
విజయనగరం కలెక్టరేట్, నవంబరు 16(ఆంధ్రజ్యోతి):
నిరుపేదలకు మరింతగా ఇళ్లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముందుగా సొంత ఇంటి స్థలాలు ఉన్నవారికి పక్కా ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంది. ఆవాస్ యోజన పథకం కింద గ్రామాల్లో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. గృహ నిర్మాణశాఖ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకుంటు న్నారు. సెంటునర్న స్థలం ఉన్న పేదలు భార్య, భర్తల ఆధార్ కార్డు నెంబర్లు, రేషన్‌కార్డు జిరాక్స్, ఆదాయ, నివాస, కుల ధ్రువపత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. అధికారులు సర్వే చేసి ప్రత్యేక యూప్‌లో వివరాలను అప్‌లోడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 4,200 దరఖాస్తులు వచ్చాయి. ఇంకా ఎవరైనా సొంత స్థలం కలిగి ఉంటే నెలాఖరులో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇంకా యూనిట్ ధర నిర్ధారించలేదు.
పట్టణాల్లో చురుగ్గా నిర్మాణం
పట్టణ ప్రాంతాల నుంచి 2.0 కింద సొంత స్థలాలు ఉన్నవారు 1887 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిల్లో రాజాం మునిసిపాల్టీలో 50, నెల్లిమర్లలో 90, విజయనగరం 714, బొబ్బిలిలో 150 ఇళ్లు మంజూరు చేశారు. వాటి నిర్మాణం కూడా పారంభించారు. ఈ యూనిట్ ధర రూ 2.5 లక్షలుగా ప్రభుత్వం నిర్ధారించింది.
స్థలాల మంజూరుకూ చర్యలు
సొంత స్థలాలు లేని వారికి స్థలాలు ఇచ్చేందుకు కూడా చర్యలు తీసుకుంది. ఇంటి స్థలాలు మంజూరు చేయాలంటూ జిల్లా వ్యాప్తంగా 5700 దరఖాస్తులు రాగా వీటిల్లో 2300 దరఖాస్తులను రెవెన్యూ అధికారులు ఆమోదించారు. వీరికి రానున్న రోజుల్లో ప్రభుత్వం ఇంటి స్థలాలను మంజూరు చేయనుంది. గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణం ప్రాంతాల్లో రెండు సెంట్లు చొప్పున స్థలం కేటాయించనుంది.
- వైసీపీ హయాంలో జిల్లాలో 71854 ఇళ్లు మంజూరు చేశారు. వీటిల్లో 49,412 ఇళ్లను పూర్తి చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అప్పట్లో కేటాయించిన లేఅవుట్‌లలో స్థలాలు మంజూరు చేసినా చాలా మందికి అనుకూలంగా లేకపోవడంతో ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాలేదు. చాలా లేఅవుట్లు ఖాళీగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఇళ్ల నిర్మాణాలకు అనువైన స్థలాన్ని మంజూరు చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
30లోగా దరఖాస్తు చేసుకోవాలి
గ్రామాల్లో సొంత స్థలాలు ఉండి ఇల్లు లేకపోతే పీఎంఏవై అవాస్ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణం కోసం ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 4200 దరఖాస్తులు వచ్చాయి. వీరికి ఇళ్లు మంజూరు చేస్తాం. అర్బన్‌లో 1009 ఇళ్లు మంజూరు చేశాం. వీటి నిర్మాణం ప్రారంభించాం.
- మురళీమోహన్, పీడీ, జిల్లా గృహ నిర్మాణ సంస్థ