House అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ ఇల్లు
ABN , Publish Date - Jul 29 , 2025 | 11:56 PM
House for Every Eligible Family జిల్లాలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ రానున్న రెండేళ్లలో ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్వే, భూ నమోదు విభాగం అదనపు సంచాలకులు ఆర్.గోవిందరావు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.
పార్వతీపురం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ రానున్న రెండేళ్లలో ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్వే, భూ నమోదు విభాగం అదనపు సంచాలకులు ఆర్.గోవిందరావు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘ పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలాన్ని కేటాయించాలి. 2019 కన్నా ముందే అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూముల్లో గృహాలు నిర్మించుకున్న వారికి రెగ్యులరైజేషన్ పూర్తి చేయాలి. ఈ ప్రక్రియను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి. ఎస్సీ హేబిటేషన్లలో శ్మశాన వాటికలకు వెళ్లేందుకు వీలుగా ఉపాధి హామీ పథకం నిధులతో రహదారులు నిర్మించాలి. ఆక్రమణకు గురైన శ్మశాన వాటికల స్థలాలను గుర్తించి ప్రభుత్వ భూమిని తిరిగిపొందాలి. పీజీఆర్‌ఎస్‌లో ఎండార్స్‌మెంట్ పక్కాగా ఉండాలి. అర్జీల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలి. జిల్లాలో చేపడుతున్న భూముల రీసర్వే డిసెంబరు-27 నాటికి పూర్తి కావాలి.’ అని తెలిపారు.ఈ సమావేశంలో జేసీ శోభిక, సబ్ కలెక్టర్లు అశుతోష్ శ్రీవాత్సవ, యశ్వంత్ కుమార్‌రెడ్డి, డీఆర్వో హేమలత, ప్రత్యేక ఉపకలెక్టర్లు ధర్మచంద్రారెడ్డి, దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
రీసర్వేతోనే సమస్యలు పరిష్కారం
సీతానగరం: రీసర్వేతోనే భూ సమస్యలు పరిష్కారమవుతాయని ఏడీ గోవిందరావు తెలిపారు. లచ్చయ్యపేటలో నిర్వహించిన గ్రామసభలో రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.