house for all అందరికీ ఇళ్లు.. చకచకా అడుగులు
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:08 AM
house for all కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శృంగవరపుకోట మండలంలో 62 కుటుంబాలను ఇళ్ల స్థలాలకు అర్హులుగా గుర్తించారు. వీరికి పట్టాలు అందించేందుకు మూడు ఎకరాల స్థలం వరకు అవసరమని ఉన్నతాధికారులకు నివేదించారు.
అందరికీ ఇళ్లు.. చకచకా అడుగులు
గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు
చాలా చోట్ల భూ సేకరణ కొలిక్కి
త్వరలోనే కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం
- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శృంగవరపుకోట మండలంలో 62 కుటుంబాలను ఇళ్ల స్థలాలకు అర్హులుగా గుర్తించారు. వీరికి పట్టాలు అందించేందుకు మూడు ఎకరాల స్థలం వరకు అవసరమని ఉన్నతాధికారులకు నివేదించారు. డి.పట్టాదారుల నుంచి కొనుగోలు చేయనున్నారు. అనంతరం లేఅవుట్‌గా తీర్చిదిద్ది ప్లాట్లుగా విభజించనున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్.కోటలో వేసిన లేఅవుట్‌లో 70 వరకు ప్లాట్లు మిగిలాయి. దాంట్లో కూడా పేదలకు మూడు సెంట్లు చొప్పున మ్యాపింగ్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
శృంగవరపుకోట, నవంబరు6 (ఆంధ్రజ్యోతి):
కూటమి ప్రభుత్వం జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ దిశగా అడుగులు వేస్తోంది. భూ సేకరణకు చర్యలు చేపట్టింది. అనేక చోట్ల పరిశీలన పూర్తి చేసి కొనుగోలుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి వారం రోజుల క్రితం భూపరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్‌లకు ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్‌లు ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రతి పదిహేను రోజులకు మండలాల వారీ పురోగతిని సమీక్షించాలని సూచించారు.
అందరికీ ఇళ్లు కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఇదే పేరుతో ఈ పథకాన్ని రూపొందించింది. గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు కేటాయించనుంది. తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, గ్రామ రెవెన్యూ అధికారి, సర్వేయర్ బృందంగా ఏర్పడి అర్హుల జాబితాను గుర్తించాల్సి ఉంది. ఇప్పటికే మండలాల వారీగా అర్హుల జాబితాను తయారు చేశారు. భార్య,భర్తలు ఇద్దరు పిల్లలతో పాటు తల్లిదండ్రులు నివశించేందుకు అనువుగా ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఇవ్వనున్నారు. అర్హుల సంఖ్యకు అనుగుణంగా స్థలాలను సేకరించనున్నారు. పేదలందరికీ ఇళ్లు పేరుతో గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. ఊర్లుకు ఊర్లు కడుతున్నామని గొప్పలు చెప్పింది. గ్రామాలకు దూరంగా ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు అనుకూలంగా లేని ప్రదేశాల్లోనూ, చెరువుల సమీపంలోను స్థలాలు చూపించింది. పైగా గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు చొప్పున పంపిణీ చేసింది. ఆ స్థలాల్లో నిర్మించిన ఇళ్లు ఇరుకుగా ఉన్నాయి. నివాసానికి యోగ్యంగా లేకపోవడంతో చాలా మంది నిర్మాణాలు చేపట్టలేదు. కొన్ని గ్రామాల్లో తీర్చిదిద్దిన లేఅవుట్‌లు లెక్కకు మిక్కిలిగా ఖాళీగా ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ లేఅవుట్‌లలో ఇళ్ల నిర్మాణం చేపట్టని స్థలాలను స్వాధీనం చేసుకుంటుందనుకున్నారు. అయితే ఈ ఆలోచనలో చిన్న మార్పు చేసుకుంది. వీటిల్లో ఎవరైనా నివాసాలు కట్టుకొనేందుకు ముందుకు వస్తే ప్రోత్సహించాలని ఆలోచిస్తోంది. గతంతో పట్టా తీసుకున్నవారు ఇళ్లు నిర్మించిన, నిర్మించుకోకపోయినా కూటమి ప్రభుత్వం వారికి మళ్లీ స్థలం ఇవ్వదు. పూర్తిగా అర్హులకే కేటాయించాలనుకుంటోంది. అందించిన ప్రతి ఇళ్ల స్థల పట్టా నివాస యోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఈ కాలనీల్లో అన్నిరకాల సదుపాయాలు కల్పించనుంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలను మంజూరు చేయడంతో పాటు పీఎంజీవై, ఎన్‌టీఆర్ గృహా నిర్మాణాల ద్వారా ప్రతి ఒక్కరికీ గూడు కల్పించాలని ప్రయత్నం చేస్తోంది.