Hostels వసతిగృహాలను సందర్శించాలి
ABN , Publish Date - Jul 22 , 2025 | 11:29 PM
Hostels Should Be Inspected జిల్లాలోని ప్రభుత్వ వైద్యాధికారులందరూ తమ పరిధిలోని వసతి గృహాలను విధిగా సందర్శించాలని, విద్యార్థుల బాగోగులను తెలుసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో సమీక్షించారు.
పార్వతీపురం, జూలై 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ వైద్యాధికారులందరూ తమ పరిధిలోని వసతి గృహాలను విధిగా సందర్శించాలని, విద్యార్థుల బాగోగులను తెలుసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ గతనెలతో పోలిస్తే జిల్లాలో మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాయి. రానున్న మూడు మాసాల్లో పూర్తిగా కేసులు తగ్గాలి. మారుమూల గ్రామాల్లోని ప్రజలు ఆర్‌ఎంపీ, నాటు వైద్యులను ఆశ్రయించకుండా చూడాలి. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకొనేలా అవగాహన కల్పించాలి. మలేరియా, డెంగ్యూ, ఇతర వ్యాధులకు సంబంధించిన మందులు, కిట్స్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండాలి. ఈ నెల 16 నుంచి పారిశుధ్య పక్షోత్సవాలు కార్య క్రమం జరుగుతుంది. ఇందులో వైద్యాధికారులు, సిబ్బంది భాగస్వాములై.. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రం చేయించుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలయ్యే వారికి జననీ ఆరోగ్య రక్ష పథకం వర్తింపజేయాలి.’ అని తెలిపారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు, జిల్లా మలేరియా అధికారి వై.మణి, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు పాల్గొన్నారు.