Share News

Hostels... వసతి గృహాలు.. సమస్యల లోగిళ్లు!

ABN , Publish Date - Jul 20 , 2025 | 11:58 PM

Hostels... Hubs of Problems! జిల్లాలో వివిధ ప్రాంతాల్లోని వసతిగృహాలు సమస్యలకు కేరాఫ్‌గా నిలిచాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దయనీయ స్థితికి చేరుకున్నాయి. ఇరుకు గదులు.. అధ్వానంగా మరుగుదొడ్లు.. తలుపులు, రక్షణ గోడలేని భవనాలు.. దోమల బెడద.. తాగునీటి కొరత వంటి సమస్యలు విద్యార్థులను వేధిస్తున్నాయి.

 Hostels...  వసతి గృహాలు.. సమస్యల లోగిళ్లు!
సీతంపేట ఏపీఆర్‌ గురుకుల పాఠశాలలో నేలపై పడుకున్న గిరిబిడ్డలు

  • మౌలిక వసతులకు నోచని వైనం

  • ఇరుకు గదులు.. పనిచేయని మరుగుదొడ్లు

  • చదువుకున్న చోటే నేలపై పడక..

  • తాగునీటి సౌకర్యం అంతంతమాత్రమే..

  • వీడని దోమల బెడద

  • విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

  • రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని విన్నపం

జిల్లాలో వివిధ ప్రాంతాల్లోని వసతిగృహాలు సమస్యలకు కేరాఫ్‌గా నిలిచాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దయనీయ స్థితికి చేరుకున్నాయి. ఇరుకు గదులు.. అధ్వానంగా మరుగుదొడ్లు.. తలుపులు, రక్షణ గోడలేని భవనాలు.. దోమల బెడద.. తాగునీటి కొరత వంటి సమస్యలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ప్రధానంగా చదువుకున్న చోటే పడుకోవాల్సిన దుస్థితి. భోజన శాలలు లేక ఆరుబయటే తినాల్సి వస్తోంది. పూర్తిస్థాయిలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. గత వైసీపీ సర్కారు ఎస్టీ, ఎస్సీ, బీసీ వసతిగృహాల అభివృద్ధికి , మరమ్మతు పనులకు కాసులు విదల్చలేదు. దీంతో కొన్నాళ్లుగా ఇబ్బందుల నడుమ విద్యార్థులు చదువులు కొనసాగించాల్సి వస్తోంది. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని జిలావాససులు కోరుతున్నారు.

జిల్లాకేంద్రంలో..

పార్వతీపురం టౌన్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం బైపాస్‌ కాలనీలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం(2)లో 40 మంది విద్యార్థులు ఉన్నారు. ఇటీవల రూ.30లక్షలతో హాస్టల్‌లో వివిధ పనులు చేపట్టారు. అయితే తాగునీటి సౌకర్యాన్ని మాత్రం కల్పించలేదు. వసతి గృహం చుట్టూ రక్షణ గోడ కూడా నిర్మించలేదు. దీంతో రాత్రి వేళల్లో విషసర్పాల సంచారం వల్ల విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. వసతి గృహ నిర్వహణ అధికారి నూకరాజును వివరణ కోరగా విద్యార్థులకు సురక్షిత నీటిని అందించేందుకు చర్యలు చేపడతామన్నారు.

జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలుర వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహంలోనూ సమస్యలు తిష్ఠ వేశాయి. గత కొన్నేళ్లుగా దీనిని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. జూనియర్‌, డిగ్రీ కళాశాలలతో పాటు పాలిటెక్నిక్‌ చదువుతున్న 58 మంది విద్యార్థులకు వసతి, తాగునీటి సమస్యలు వేధిస్తున్నాయి. దీనిపై వసతి గృహ అధికారి హరికను వివరణ కోరగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

తీరని వసతి సమస్య..

జియ్యమ్మవలస, జూలై 20 (ఆంధ్రజ్యోతి): జియ్యమ్మవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 81 మంది విద్యార్థులు ఉన్నారు. 3 నుంచి 10 తరగతుల వారికి కేవలం 5 గదులే ఉన్నాయి. దీంతో వారు చదువుకున్న చోటే పడుకోవాల్సి వస్తోంది. ఇరుకు గదులతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.

చినమేరంగి బీసీ పోస్ట్‌మెట్రిక్‌, ప్రీమెట్రిక్‌ హాస్టళ్లు ఒకే దగ్గర నడుస్తున్నాయి. ఇక్కడ తాగునీరు, టాయిలెట్ల సౌకర్యం లేదు. పెచ్చులూడిన గచ్చులు, పనిచేయని ఫ్యాన్లతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక చినమేరంగి బీసీ బాలికల వసతి గృహం విషయానికొస్తే.. ఇది ఒక అద్దె గృహంలో నడుస్తోంది. ఇక్కడ సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆరుబయటకు వెళ్లాల్సిందే..

కురుపాం,జూలై20(ఆంధ్రజ్యోతి): కురుపాం బీసీ బాలుర వసతి గృహం మరుగుదొడ్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. మూడేళ్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఇక్కడున్న 59 మంది విద్యార్థులు ఆరు బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఇకపోతే వసతిగృహంలో ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ పనిచేయడం లేదు. కొన్ని రూములుకు డోర్లు కూడా లేవు. దీనిపై వార్డెన్‌ శ్రీనివాసరావును వివరణ కోరగా.. మరుగుదొడ్లు, వసతి గృహం మరమ్మతులకు ప్రభుత్వం రూ. 2 లక్షలు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు.

కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలకు ప్రహరీ లేవు. దీంతో విద్యార్థులకు రక్షణ కొరవడింది. గతంలో నిధులు మంజూరైనా వివిధ కారణాలతో ప్రహరీ పనులు చేపట్టలేదు.

నేలపైనే నిద్ర

సాలూరు/సాలూరు రూరల్‌/పాచిపెంట, జూలై 20 (ఆంధ్రజ్యోతి): సాలూరు పట్టణంలోని బీసీ బాలుర వసతిగృహంలో డార్మెటరీ లేకపోవడంతో విద్యార్థులు నేలపైనే పడుకుంటున్నారు. బంగారమ్మ పేటలో ఉన్న గిరిజన సంక్షేమశాఖ పోస్ట్‌మెట్రిక్‌ బాలుర వసతి గృహంలో ఎనిమిది గదులుండగా.. అందులో రెండు వినియోగంలో లేవు. ఈ హాస్టల్‌లో మరుగుదొడ్లుకు తలుపులు పూర్తిగా పాడయ్యాయి. దీంతో విద్యార్థులకు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. 2019 డైనింగ్‌ హాల్‌ నిర్మాణం కొనసాగుతూనే ఉంది. బంగారమ్మ కాలనీలో గిరిజన బాలికల వసతి గృహంలో మేట్రిన్‌, వాచ్‌మన్‌ మినహా ఉద్యోగులెవరూ లేరు. దీంతో కుక్‌, కమాటీలను ప్రైవేట్‌గా నియమించుకున్నారు.

- సాలూరు మండలం మామిడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు చదువుకున్న చోటే పడుకోవాల్సి వస్తోంది. నూతన భవన నిర్మా ణానికి అప్పట్లో రూ. 4 కోట్లు మంజూరయ్యాయి. అయితే పునాదులు స్థాయి వరకు వచ్చి నిర్మాణం నిలిచిపోయింది. దీంతో విద్యార్థినులకు వసతి సమస్య వేధిస్తోంది. కొత్తవలసలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కిచెన్‌, డైనింగ్‌ హాల్‌ నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఇప్పటికి విద్యార్థునులు భోజనం ఆరుబయటే చేయాల్సి వస్తుంది. అంటివలస, తోణాం, మావుడి తదితర ఆశ్రమ పాఠశాలల్లో కిచెన్‌, డైనింగ్‌ హాల్‌ల సమస్యలున్నాయి.

- పాచిపెంట కేజీబీవీలో ఆరు నుంచి ఇంటర్మీడియట్‌ వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. మొత్తంగా 265 మంది విద్యార్థినులు ఉన్నారు. అయితే కేవలం 20 బాత్‌రూంలు, 10 మరుగుదొడ్లు ఉండడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. పద్మాపురం గిరిజన బాలుర సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కిచెన్‌, డార్మెటరీ, డైనింగ్‌ హాల్‌ లేవు.

పాలకొండలో..

పాలకొండ, జూలై 20(ఆంధ్రజ్యోతి): పాలకొండ బీసీ పోస్టుమెట్రిక్‌ బాలుర వసతిగృహంలో 80 మంది విద్యార్థులుండగా.. వారికి సరిపడా మరుగుదొడ్లు లేవు. ఉన్న మరుగు దొడ్లకు తలుపులు, రన్నింగ్‌ వాటర్‌ లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. ఇక గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో ఉన్న 260 మంది విద్యార్థులకు వసతి సమస్య వేధిస్తోంది. పట్టణంలోని ఎస్టీ పోస్టుమెట్రిక్‌ బాలికల వసతిగృహంలో పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థిను లకు అవస్థలు తప్పడం లేదు. కొన్నిచోట్ల నేలపైనే పడుకోవాల్సి వస్తోంది.

సీతంపేటలో...

సీతంపేటలో ఉన్న 21 గిరిజన సంక్షేమ ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సరిపడా భోజనశాలలు, టేబుల్స్‌ లేవు. దీంతో వారు నేలపైనే తినాల్సి వస్తోంది. విద్యార్థుల ఆరోగ్య సమస్యలను పట్టించుకొనేవారు లేరు. ఈ సీజన్‌లో చాలామంది జ్వరాల బారిన పడి సిక్‌ రూమ్‌లకు పరిమితమవుతున్నారు. ఐదేళ్లు గడిచినా.. ఇంకా గిరిజన పాఠశాలలకు దోమతెరలు పంపిణీ జరగలేదు. దీంతో విద్యార్థులు దోమ కాట్లకు గురై విషజ్వరాల బారిన పడు తున్నారు. ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సరిపడా బెడ్లు లేవు. దీంతో వారు నేలపై నిద్రించాల్సి వస్తుంది. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు అధ్వానంగా మారాయి. పాఠశాలల పరిసరాలు పిచ్చిమొక్కలతో నిండాయి.

Updated Date - Jul 20 , 2025 | 11:58 PM