Hostages in Bangladesh.. బంగ్లాలో బందీలుగా..
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:56 PM
Hostages in Bangladesh.. ఈనెల 22న బంగ్లాదేశ్ కోస్టుగార్డుకు చిక్కిన మత్స్యకారులు తొమ్మిది మంది అక్కడి జైలులో బందీలుగా ఉన్న విషయం తెలిసిందే. అక్కడి అధికారులు తాజాగా విడుదల చేసిన ఫొటోలో మత్స్యకారులంతా సంకెళ్లతో ఉన్నారు. వీరిని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
బంగ్లాలో బందీలుగా..
కోస్టుగార్డు అదుపులో ఉన్న జిల్లా మత్స్యకారులు
స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వాలు
భోగాపురం, అక్టోబరు25(ఆంధ్రజ్యోతి): ఈనెల 22న బంగ్లాదేశ్ కోస్టుగార్డుకు చిక్కిన మత్స్యకారులు తొమ్మిది మంది అక్కడి జైలులో బందీలుగా ఉన్న విషయం తెలిసిందే. అక్కడి అధికారులు తాజాగా విడుదల చేసిన ఫొటోలో మత్స్యకారులంతా సంకెళ్లతో ఉన్నారు. వీరిని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
భోగాపురం మండలం కొండ్రాజుపాలెంకు చెందిన మారుపల్లి చిన్నప్పన్న, మారుపల్లి రమేష్, సూరాడ అప్పలకొడ, మారుపల్లి ప్రవీణ్, సురపతిరాము, సూరాడ అప్పలకొండ, పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన నక్క రమణ, వాసపల్లి సీతయ్య, బర్రిపేట చింతపల్లికి చెందిన మైలపల్లి అప్పన్న కలిసి విశాఖ హార్బర్ నుంచి ఈ నెల 13న సముద్రంలో వేటకు బయలుదేరారు. వేటసాగిస్తూ ఈ నెల 22న పొరపాటున సముద్ర జలాల్లో భారత్ సరిహద్దు దాటేశారు. బంగ్లాదేశ్ జలాల్లోకి రావడాన్ని అక్కడి కోస్టుగార్డు అధికారులు గమనించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారంతా అక్కడి ఓ జైలులో బంధీలుగా ఉన్నారు. వీరిని స్వగ్రామం తీసుకురావడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్ని చర్యలు చేపడుతున్నారు. మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు కూడా మత్స్యకారులను స్వగ్రామాలకు తీసుకురావడానికి నిరంతరం అధికారులు, మంత్రులతో మాట్లాడుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు.