‘upadhi’ ‘ఉపాధి’లో ఉద్యాన పంటలు
ABN , Publish Date - Jul 12 , 2025 | 11:19 PM
Horticultural Crops in ‘upadhi’ జిల్లాలో ఉపాధి హామీ పథకంలో ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 15 మండలాల పరిధిలోని చెరువులు, ప్రాజెక్టులు, పాఠశాలలు, ప్రభుత్వ స్థలాల్లో ఇలా సుమారు 5 వేల ఎకరాల్లో కొబ్బరి మొక్కలు నాటేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.
గరుగుబిల్లి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉపాధి హామీ పథకంలో ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 15 మండలాల పరిధిలోని చెరువులు, ప్రాజెక్టులు, పాఠశాలలు, ప్రభుత్వ స్థలాల్లో ఇలా సుమారు 5 వేల ఎకరాల్లో కొబ్బరి మొక్కలు నాటేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా బారువ మండలంలో ఉద్యాన నర్సరీల నుంచి మొక్కలు తెప్పిస్తున్నారు. ప్రతి మండలంలో 5 వేల మొక్కలు నాటేందుకు ప్రతిపాదనలు చేశారు. ఈ మేరకు ఉపాధి హామీ క్షేత్ర సహాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చెరువు గట్లు చదును చేయించారు. మండలాల వారీగా కేటాయించిన మొక్కలను ప్రత్యేక వాహనాలపై తరలిస్తున్నారు. నాటిన మొక్కలు సంరక్షణ భద్రతను వెలుగు గ్రామైక్య సంఘాలకు అప్పగించారు. ఆయా గ్రామ పరిధిలో కొబ్బరి చెట్లు నుంచి వచ్చిన ఫలసాయాన్ని సంఘాలకు అప్పగించనున్నారు. కొబ్బరితో పాటు మునగ, తదితర పలు రకాల మొక్కలను సరఫరా సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురవడంతో మండలాలకు త్వరితగతిన మొక్కలు సరఫరా చేస్తున్నారు.
చర్యలు తప్పవు
మండలాల పరిధిలో గుర్తించిన ప్రాంతాల్లో కొబ్బరి మొక్కలను నిబంధనల మేర నాటించాలి. లేకుంటే ఉపాధి సిబ్బందిపై చర్యలు తప్పవు. గ్రామాల్లో నాటిన మొక్కలు వివరాలను వెలుగు సంఘాలకు అందించాలి. విధిగా పర్యవేక్షణ బాధ్యత చేపట్టాలి. మొక్కలు చుట్టూ కంచెలు ఏర్పాటు చేయించాలి. ప్రత్యేక వాహనాల్లో మొక్కలు తరలింపు వేగవంతం చేస్తున్నాం. నిర్దేశించిన సమయానికి వాటిని నాటించాలి.
- కె.రామచంద్రరావు, పీడీ, డ్వామా, పార్వతీపురం మన్యం