Share News

Hopes are on freehold ఫ్రీహోల్డ్‌పైనే ఆశలు

ABN , Publish Date - Nov 03 , 2025 | 11:39 PM

Hopes are on freehold ఫ్రీహోల్డ్‌ భూముల విషయంలో రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆనందపడిన చిన్న రైతులు అమలులో జరుగుతున్న నాన్చుడు ధోరణిపై నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం 22ఏ నిషేధిత భూములపై ప్రత్యేకంగా దృష్టిసారించి ఫ్రీహోల్డ్‌ ఆచరణపై అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.

Hopes are on freehold ఫ్రీహోల్డ్‌పైనే ఆశలు

ఫ్రీహోల్డ్‌పైనే ఆశలు

వేలాది మంది చిన్న రైతుల నిరీక్షణ

నిషేధిత భూములపై నిర్ణయాన్ని నాన్చుతున్న సర్కారు

ఎప్పటికప్పుడు వాయిదాలు

అబద్ధపు ప్రచారం మొదలుపెట్టిన వైసీపీ గ్యాంగ్‌

మెంటాడ, నవంబరు 3(ఆంధ్రజ్యోతి):

ఫ్రీహోల్డ్‌ భూముల విషయంలో రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆనందపడిన చిన్న రైతులు అమలులో జరుగుతున్న నాన్చుడు ధోరణిపై నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం 22ఏ నిషేధిత భూములపై ప్రత్యేకంగా దృష్టిసారించి ఫ్రీహోల్డ్‌ ఆచరణపై అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి జగన్‌ ప్రభుత్వం రాజకీయ లబ్ధికోసం, సెటిల్మెంట్‌ కోసం, అస్మదీయులకు లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా అసైన్మెంట్‌ భూములను ఫ్రీహోల్డ్‌ చేసింది. వాటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరుపుకోవచ్చునని ప్రకటించింది. 20 సంవత్సరాలు పూర్తయిన భూములకు ఇది వర్తిస్తుందని ఉత్తర్వులు జారీచేసింది. దీనికోసమే ఎదురుచూస్తున్న వైసీపీ పెద్దలు పెద్దఎత్తున అసైన్మెంట్‌ భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఉత్తర్వులు జారీ ఆయిన కొద్దిరోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాలకు సంబంధించిన లావాదేవీలు జరిగిపోయాయి. అసైన్మెంట్‌ భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తప్పించడంతో భారీ అక్రమాలు జరిగినట్టు నిర్ధారించుకున్న కూటమి ప్రభుత్వం వాటి రిజిస్ట్రేషన్లకు బ్రేక్‌ వేసింది. గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్ది మళ్లీ ఫ్రీహోల్డ్‌ చేసే విషయంలో త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు.

- ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్రీహోల్డ్‌ విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని జూలై 5న రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హత ఉన్న అసైన్డ్‌ భూములను నిషేధిత భూముల జాబితానుంచి విముక్తి కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాకు సంబంధించిన వరకూ ఇలాంటి అర్హతగల భూములు వేల ఎకరాల్లో ఉన్నట్లు అంచనా.

- అసైన్మెంట్‌ రికార్డులు లేని భూములు, కలెక్టర్‌ ఉత్తర్వులు లేనివి, జీవో 596కి విరుద్ధంగా ఉన్నవి, అధిక విస్తీర్ణం క్లయిమ్‌ చేసేవి, అభ్యంతరాలున్న పోరంబోకు భూములు, ఇతరులు క్లయిమ్‌ చేసే భూములు, నీటి వనరులున్న పోరంబోకు భూములు, 20 ఏళ్ల గడువు దాటిన భూములు మినహా అసైన్మెంట్‌ భూమి పొజిషన్‌లో ఉన్నవీ, పక్కా అసైన్మెంట్‌ రికార్డులు కలిగి ఉండీ 20 ఏళ్లు గడుపు పూర్తయిన వాటిని ఫ్రీహోల్డ్‌ చేయాలన్న చంద్రబాబు ఆదేశాలతో సంతోషించిన అర్హులైన రైతులు నెలలు గడుస్తున్నా నిర్ణయం అమలుకు నోచకపోవడంపై పెదవి విరుస్తున్నారు.

- ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించి విజయదశమి నాటికల్లా నిషేధిత భూముల జాబితా నుంచి అసైన్మెంట్‌ భూములకు విముక్తి లభిస్తుందని అర్హులైన రైతులు ఆశించారు. అయితే సెప్టెంబరు 10న రెవెన్యూ శాఖ నిషేధాన్ని మరో రెండునెలలు పొడిగిస్తున్నట్టు ప్రకటించడంతో సమస్యను మరింత సాగదీసినట్టయింది. ఆ లెక్కన నవంబరు 11 వరకూ నిషేధం అమల్లో ఉంటుంది. ఇదే అదనుగా వైసీపీ బ్యాచ్‌ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే అబద్ధపు ప్రచారాన్ని మొదలుపెట్టింది. జగన్‌ సర్కారు మేలు చేయాలని చూస్తే కూటమి ప్రభుత్వం అడ్డుకొని రైతులకు అన్యాయం చేస్తోందని చెప్పుకొస్తోంది. అంతేకాకుండా ఫ్రీహోల్డ్‌ ఎప్పటికీ జరిగేదికాదని ప్రచారం చేస్తూ అర్హులైన రైతులనుంచి భూములను కారుచౌకగా కొట్టేసే కుట్రలకు తెరలేపిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

----------------

Updated Date - Nov 03 , 2025 | 11:39 PM