Hopeful..! ఆశాజనకంగా..!
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:26 AM
Hopeful..! మత్స్య సంపద ఉత్పత్తికి మన్యం జిల్లా ఎంతో అనుకూలం. అందుకే గతంతో పోలిస్తే సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల్లో చేపల పెంపకం పెరిగింది. ఉత్పత్తి ఆశాజనకంగా ఉంది.
గతంతో పోలిస్తే మెరుగ్గా ఉత్పత్తి
మరింత ప్రోత్సహిస్తే ఎంతో మేలు
నేడు ప్రపంచ మత్స్య దినోత్సవం
పార్వతీపురం/గరుగుబిల్లి, నవంబరు20(ఆంధ్రజ్యోతి): మత్స్య సంపద ఉత్పత్తికి మన్యం జిల్లా ఎంతో అనుకూలం. అందుకే గతంతో పోలిస్తే సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల్లో చేపల పెంపకం పెరిగింది. ఉత్పత్తి ఆశాజనకంగా ఉంది. మత్స్యకారులకు కూడా ఉపాధి లభిస్తోంది. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన సహకారం అందిస్తున్నాయి. అనేక పథకాలు, సబ్సిడీలు అమలు చేస్తున్నాయి. నేడు ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం
ఇదీ పరిస్థితి..
- జిల్లాలో ఏటా తోటపల్లి, వెంగళరాయసాగర్, పెద్దగెడ్డ జలాశయాల్లో మత్స్యశాఖ అధికారులు చేప పిల్లలను విడిచిపెడుతున్నారు. వాటి పెంపకం, విక్రయాల బాధ్యతను స్థానిక గిరిజన మత్స్యకారులకు అప్పగిస్తున్నారు. ఈ ఏడాదిలో తోటపల్లి, వెంగళరాయసాగర్ ప్రాజెక్టుల్లో 14 లక్షల చేప పిల్లలు విడుదల చేశారు. ఏడాదికి మత్స్య సంపద 19 వేల మెట్రిక్ టన్నులుగా నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మన్యంలో 800 వరకు చెరువులు ఉండగా.. ఐటీడీఏల ద్వారా చేప పిల్లల పెంపకం చేపడుతూ గిరిజన మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇవి కాకుండా మరో 110 చెరువులు ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో 285 ఎకరాల్లోని 85 చెరువుల్లో చేపల పెంపకం సాగుతుంది. ఈ ప్రాంతంలో బొచ్చు, రాగండి, పెదమయిలు, ఎర్రమయిలు, రూప్‌చంద్, కొర్ర మయలు, రొయ్యలతో పాటు నలుపు రకం చేపలు లభిస్తున్నాయి. సుమారు 20 వేల మంది మత్స్యకారులు ఉండగా.. రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 186 మత్స్యకార గ్రామాలున్నాయి. 47 మత్స్యకార సంఘాల ద్వారా ప్రాజెక్టులు, చెరువుల్లో లభ్యమయ్యే చేపలను వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఒడిశాకు కూడా ఎగుమతి చేస్తున్నారు. కాగా జిల్లాలో లభ్యమయ్యే మత్స్య సంపదను ఈ ప్రాంతంలోనే ఎక్కువగా విక్రయిస్తుంటారు.
- తోటపల్లి ప్రాజెక్టుతో పాటు పార్వతీపురం చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో, పాలకొండ చెరువుల్లో లభ్యమయ్యే చేపలకు మంచి డిమాండ్ ఉంది. విజయనగరం జిల్లా మడ్డువలస రిజర్వాయర్ నుంచి తెచ్చే చేపలు, విశాఖ నుంచి వచ్చే సముద్రపు చేపలు జిల్లా కేంద్రంతో పాటు సాలూరు తదితర ప్రాంతాల్లోనూ భారీగా అమ్ముడవుతుంటాయి.
తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో..
తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టులో ఏటా మత్స్యశాఖ సుమారు 2 లక్షలకు పైగా పలు రకాల చేప పిల్లలను విడిచిపెడుతుంది. అయితే పెంపకంపై మాత్రం శ్రద్ధ చూపడం లేదు. వరద ప్రవాహం ఎక్కువైన సమయంలో దిగువ ప్రాంతానికి, నీటి నిల్వలు తక్కువగా ఉంటే ఎగువ ప్రాంతానికి చేప పిల్లలు వెళ్లిపోతుంటాయి. ప్రాజెక్టులో పేరుకుపోయే గుర్రపు డెక్క, పిట్ట తామర కారణంగా అధికంగా చేపలు మృతి చెందుతున్నాయి. దీంతో మత్స్యకారులకు అంతంతమాత్రంగానే మత్స్య సంపద లభ్యమవుతుంది.
- గతంలో శ్రీవెంకటేశ్వర తోటపల్లి (ఆర్‌అండ్‌ఆర్) గిరిజన ఇన్‌లాండ్ మత్స్యకార సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో ముంపునకు గురైన గిరిజన మత్స్యకార కుటుంబాలు ఈ సంఘం పరిధిలో చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తుంటాయి. సొసైటీ పరిధిలో సుమారు 10 గ్రామాలకు సంబంధించి 200లకు పైగా మత్స్యకార కుటుంబాలున్నాయి. కోటవానివలసలో సుమారు 120 కుటుంబాలకు చేపల వేటే ఆధారం. ప్రాజెక్టులో బొచ్చులు, రాగండి, ఎర్రమైలు, కొర్రమీన, గొరసలు, మోసులు వంటి చేపలతో పాటు సీజన్ వారీగా రొయ్యలు కూడా లభ్యమ వుతాయి.
- ప్రాజెక్టులో లభ్యమయ్యే చేపలను పార్వతీపురం, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, పాలకొండ మండలాలతో పాటు పరిసర గ్రామాలకు రోజువారీ 1500 కిలోలకు పైగా వివిధ రకాల చేపలను రవాణా చేస్తుంటారు. బొచ్చులు కిలో రూ.100, గొరసలు రూ.60, కొరమీనలు రూ. 200, రొయ్యలు కిలో రూ.350 చొప్పున విక్రయిస్తుంటారు. మొత్తంగా ఈ ప్రాంతంలో నెలవారీ లక్ష కిలోలకు పైగా వ్యాపారం జరుగుతుంది.
సహకారం అంతంతమాత్రమే..
తోటపల్లి ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నా మత్స్య సంపద మాత్రం తక్కువగానే లభ్యమ వుతుంది. అధికారుల సహకారం అంతంతమాత్రమే. దీంతో చిన్నపాటి కాలువలు, చెరువుల్లో చేపలు పట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. గిరిజన మత్స్యకారుల అభివృద్ధికి ఉన్నతాధికారులు చొరవ చూపాలి.
- ఈదల తిరుతిరావు, మత్స్య సంఘం అధ్యక్షుడు, కోటవానివలస
==============================
గుర్రపు డెక్కను తొలగించాలి
తోటపల్లి ప్రాజెక్టులో ఎప్పటికప్పుడు పేరుకుపోతున్న గుర్రపు డెక్క, పిట్ట తామరను తొలగించాలి. ఇక్కడ మత్స్య సంపదను పెంచేందుకు మత్స్యశాఖ, ఐటీడీఏ అధికారులు చొరవ చూపాల్సి ఉంది.
- ఈదల నాగరాజు, మత్స్యకారుడు, కోటవానివలస
============================
సద్వినియోగం చేసుకోవాలి
డీఏజేజేయూఏ పథకం ద్వారా సబ్సిడీతో ఐస్‌బాక్సులు, బోట్ సెట్స్, ఐస్‌బాక్సులతో కూడిన బైక్‌లు అందిస్తున్నాం. ఆక్వా భరోసా ద్వారా చేపల ఉత్పత్తికి సంబంధించి విద్యుత్ వినియోగంపై సబ్సిడీ వర్తిస్తుంది. ఎఫ్‌ఎస్‌పీవో ఆర్థిక సహకారంతో మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ.9 లక్షలను మంజూరు చేసింది. మత్స్య సంపదను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. వాటిని జిల్లా మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలి.
- సంతోష్, జిల్లా మత్స్యశాఖాధికారి