Share News

డీజే సౌండ్‌కు కదిలిన తేనెపట్టు

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:13 AM

పెళ్లి కుమార్తె ఊరేగింపులో భాగంగా ఏర్పాటు చేసిన డీజే సౌండ్‌కు తేనేపట్టు కదిలింది. దీంతో తేనెటీగలు ఒక్కసారిగా పెళ్లి బృందంపై దాడి చేయడంతో సుమారు 48 మందికి గాయాలయ్యాయి.

డీజే సౌండ్‌కు కదిలిన తేనెపట్టు
బస్సు క్లీనర్‌ నాగేశ్వరరావు, చిన్నారులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది

- పెళ్లి కుమార్తె ఊరేగింపు బృందంపై తేనెటీగల దాడి

- 48 మందికి గాయాలు

- ఒకరి పరిస్థితి ఆందోళనకరం

కురుపాం, ఏప్రిల్‌25(ఆంధ్రజ్యోతి): పెళ్లి కుమార్తె ఊరేగింపులో భాగంగా ఏర్పాటు చేసిన డీజే సౌండ్‌కు తేనేపట్టు కదిలింది. దీంతో తేనెటీగలు ఒక్కసారిగా పెళ్లి బృందంపై దాడి చేయడంతో సుమారు 48 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటన శుక్రవారం కురుపాంలో చోటుచేసుకుంది. స్థానిక శివ్వన్నపేటకు చెందిన నీలకంఠేశ్వరస్వామి ఆలయ పూజారి పాత్రుని నల్లబాబు కుమార్తె వివాహం సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం కురుపాం నుంచి శివ్వన్నపేట వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని బంగ్లాతోట వద్దకు చేరుకుంది. అయితే, డీజే సౌండ్‌ బేస్‌ ఎక్కువగా ఉండడంతో అక్కడ మర్రిచెట్టుపై ఉన్న తేనెపట్ట్టు కదిలింది. తేనెటీగలు ఒక్కసారిగా దాడిచేయడంతో పెళ్లి బృందంలోని వారంతా పరుగులు తీశారు. ఈ దాడిలో పెళ్లికి వచ్చిన వివిధ ప్రాంతాలకు చెందిన 48 మంది గాయపడ్డారు. వీరిలో మహిళలు, వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారు. ఘటనా స్థలానికి సమీపంలోనే ఆసుపత్రి ఉండడంతో బాధితులంతా అక్కడకు వెళ్లి వైద్యం చేయించుకున్నారు. ఆసుపత్రిలోని రోగులకు తేనెటీగలు ఎక్కడ కుడతాయో అని తలుపులు మూసి వైద్యులు సునీల్‌, సందీప్‌ తదితరులు చికిత్స అందించారు. చిన్నారుల ఏడుపులతో ఆసుపత్రి దద్దరిల్లింది. బస్సు క్లీనర్‌ పల్లి నాగేశ్వరరావుకు తేనెటీగ కుట్టడంతో పాటు చెవిలోకి వెళ్లడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆయన్ను పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో కురుపాం నుంచి శివ్వన్నపేట వెళ్లడానికి రెండు గంటల పాటు ఎవరూ సాహసించలేదు. ఈ సందర్భంగా డాక్టర్‌ సునీల్‌ మాట్లాడుతూ.. ఈ నెలలోనే తేనెటీగల దాడి ఘటనలు మూడుసార్లు చోటుచేసుకున్నాయని, తమ ఆసుపత్రికి వచ్చి బాధితులు చికిత్స చేయించుకున్నారని అన్నారు. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి తోటలోని తేనెపట్టులను తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Apr 26 , 2025 | 12:13 AM