హమ్మయ్య.. ఊపిరి పీల్చుకోవచ్చు
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:26 AM
: జిల్లా కేంద్రం పార్వతీపురంలో డంపింగ్ యార్డు సమస్య త్వరలో పరిష్కారం కానుంది.
- పార్వతీపురం పట్టణ ప్రజలకు తప్పనున్న కంపు బాధ
- డంపింగ్ యార్డులో చెత్త రీసైక్లింగ్‌కు చర్యలు
- నాలుగైదు రోజుల్లో ప్రారంభంకానున్న ప్రక్రియ
పార్వతీపురంటౌన్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పార్వతీపురంలో డంపింగ్ యార్డు సమస్య త్వరలో పరిష్కారం కానుంది. ఈమేరకు స్వచ్ఛాంధ్ర సహకారంతో తరుణ్ అసోసియేట్స్ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డులోని పొడి, చెత్తను వేరు చేసే ప్రక్రియ మరో నాలుగైదు రోజుల్లో ప్రారంభంకానుంది. ఇప్పటికే డంపింగ్ యార్డు వద్ద రీసైక్లింగ్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తప్పనున్న ఇబ్బందులు
జిల్లా కేంద్రంలోని రాయగడ అంతర్రాష్ట్ర రోడ్డు శివారులో ఉన్న డంపింగ్ యార్డుతో పార్వతీపురం పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్ యార్డు నుంచి వస్తోన్న తీవ్ర దుర్వాసనతో పాదచారులు, వాహనచోదకులు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డంపింగ్ యార్డుకు ఆనించి ఉన్న గోపసాగరం కూడా కలుషితం అవుతుంది. తరచూ చెత్త, వ్యర్థాలు రహదారికి పైకి వస్తుండడంతో స్థానికులు నరకం చూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డంపింగ్ యార్డు తరలింపు కాగితాలకే పరిమితమయ్యింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ సమస్యను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సమస్యను పరిష్కరించేందుకు అడుగులు పడుతున్నాయి. స్వచ్ఛాంధ్ర సహకారంతో తరుణ్ అసోసియేట్స్ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డులో ఉన్న ప్లాస్టిక్ సంచులతో పాటు ఇతర వ్యర్థాలను వేరు చేసేందుకు రీసైక్లింగ్ మిషన్‌ను సిద్ధం చేశారు. ప్లాస్టిక్‌ను వేరు చేసి మునిసిపాలిటీకి ఆదాయ మార్గాన్ని సృష్టించనున్నారు. మిగతా వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా తయారు చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రీ సైక్లింగ్‌లో భాగంగా డంపింగ్ యార్డులో ఉన్న 12 వేల టన్నుల చెత్త, వ్యర్థాలను వేరు చేసి పర్యావరణానికి మేలు చేసే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు.