Share News

హమ్మయ్య వచ్చేశారు

ABN , Publish Date - Sep 11 , 2025 | 11:38 PM

నేపాల్‌లో చిక్కుకున్న జిల్లా యాత్రికులు గురువారం రాత్రి క్షేమంగా స్వస్థలాలకు తిరిగొచ్చారు.

హమ్మయ్య వచ్చేశారు
విశాఖ ఎయిర్‌పోర్టులో బాధితులకు స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే విజయచంద్ర

నేపాల్‌ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన జిల్లా వాసులు

కఠ్మాండూ ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో విశాఖకు రాక

గుమ్మలక్ష్మీపురం/పార్వతీపురంటౌన్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): నేపాల్‌లో చిక్కుకున్న జిల్లా యాత్రికులు గురువారం రాత్రి క్షేమంగా స్వస్థలాలకు తిరిగొచ్చారు. పార్వతీపురం, విజయనగరం జిల్లాలకు చెందిన సుమారు 60 మంది యాత్రికులు నేపాల్‌ పోలీసుల బందోబస్తు మధ్య గురు వారం ఉదయం కఠ్మాండూ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో తమకు ఆహారాన్ని సమకూర్చారని గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన యాత్రికుడు నెమలిపురి వెంకట్‌ తెలిపారు. ఇండియా నుంచి విమానం వచ్చిన వెంటనే తమను అందులో ఇండియన్‌ ఎంబసీ అధికారులు ఎక్కించిన ట్లు చెప్పారు. గురువారం రాత్రి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వారికి పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర స్వాగతం పలికారు. బాధితులతో మాట్లాడి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి జిల్లాకు వచ్చేందుకు బాధితులకు వాహనాలు సమకూర్చారు. అలాగే, భోజన సౌకర్యం కూడా కల్పించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు కష్ట, సుఖాల్లో తోడు ఉంటుందని అన్నారు. తాము క్షేమంగా వచ్చేందుకు కృషి చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌, కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌కు కృతజ్ఞతలు అని బాధితులు అన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 11:39 PM