elephants ఇక్కడ బోడికొండ .. అక్కడ ఇసుకగూడ!
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:25 PM
Here Bodikonda… There Isukaguda! పార్వతీపురం-భామిని మండలాల్లోని బోడికొండ, ఇసుకగూడ ప్రాంతాల్లో ఆదివారం గజరాజులు హల్‌చల్ చేశాయి. దీంతో ఆయా ప్రాంతవాసులు హడలెత్తిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీశారు.
పార్వతీపురం రూరల్ /భామిని, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం-భామిని మండలాల్లోని బోడికొండ, ఇసుకగూడ ప్రాంతాల్లో ఆదివారం గజరాజులు హల్‌చల్ చేశాయి. దీంతో ఆయా ప్రాంతవాసులు హడలెత్తిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. బండిదొరవలస, చిన్నమరికి గ్రామాల నుంచి బోడికొండ వైపు తొమ్మిది ఏనుగులు వెళ్తుండడంతో అక్కడున్న గిరిజనులు బెంబేలెత్తిపోయారు. వాటివల్ల ఎటు వంటి నష్టం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇక ఇసుకగూడలో గత ఐదురోజులుగా సంచరిస్తున్న నాలుగు ఏనుగులు ఆదివారం సాయంత్రం ఆ ప్రాంతంలో మొక్కజొన్న పంటను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు లదోదిబోమంటున్నారు. ఇసుకగూడ, సన్నాయిగూడ, డోకుల గూడ గ్రామస్థులు రాత్రి వేళల్లో బయటకు వచ్చేందుకు సాహసించ లేకపోతున్నారు. పొలాలకు కూడా వెళ్లలేకపోతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖాధికారులు స్పందించి తక్షణమే ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.