Problems.. సమస్యలు ఇవిగో..
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:09 AM
Here Are the Problems.. గత వైసీపీ ప్రభుత్వం ఎంతో హడావుడిగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. మౌలిక వసతులపై మాత్రం దృష్టి సారించలేదు. ఫలితంగా నేటికీ ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటైన మన్యం జిల్లా అయితే అనేక సమస్యలతో సతమతమవుతోంది.
నేడు బాధ్యతల స్వీకరణ
చొరవ చూపాలి.. పురోగతి సాధించాలి
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని మన్యం వాసుల విన్నపం
పార్వతీపురం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం ఎంతో హడావుడిగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. మౌలిక వసతులపై మాత్రం దృష్టి సారించలేదు. ఫలితంగా నేటికీ ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటైన మన్యం జిల్లా అయితే అనేక సమస్యలతో సతమతమవుతోంది. ప్రధానంగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. అన్ని శాఖలకు పూర్తిస్థాయిలో అధికారులు లేరు. ఇతర జిల్లాలకు చెందిన వారు ఇన్‌చార్జిలుగా కొనసాగుతున్నారు. దీంతో పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజ లకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. కాగా నేడు విధుల్లో చేరనున్న కొత్త కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి వాటిపై దృష్టి సారించాల్సి ఉంది. సమస్యల పరిష్కారానికి తనవంతు ప్రయత్నం చేయాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. జిల్లాకు మూడో కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్న ఆయన అందరి సహకారంతో మన్యాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని జిల్లావాసులు ఆశిస్తున్నారు.
ఇదీ పరిస్థితి
జపాన్ నిధులతో జిల్లాలో వీఆర్‌ఎస్, పెద్దగెడ్డ రిజర్వాయర్, పెదంకలం సాగునీటి ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాల్సి ఉంది. పార్వతీపురం-మక్కువ మండలాల్లో మధ్యలో నిలిచిపోయిన అడారుగెడ్డ తదితర రిజర్వాయర్ల నిర్మాణాలు, చెరువల అభివృద్ధిపైనా శ్రద్ధ వహించాల్సి ఉంది. జంఝావతి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశాతో ఉన్న వివాదం కొలిక్కి తెచ్చి.. శివారు ప్రాంత రైతులకు సాగునీటి కష్టాలు తీర్చేలా చర్యలు తీసుకోవాలి. జిల్లా కేంద్రం పార్వతీపురంలో తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు సాలూరు పురపాలక సంఘంలో అభివృద్ధి పనులు జరిగేలా చూడాలి. కొమరాడ మండలంలో పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణానికి మోక్షం కల్పించాలి. సీతంపేట, పార్వతీపురంలో మల్టీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు, సాలూరు, కురుపాం తదితర ఆసుపత్రుల పనులు వేగవంతంగా పూర్తి చేస్తే ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందే అవకాశం ఉంది. జిల్లా కేంద్రాసుపత్రితో పాటు పాలకొండ, సీతంపేట, సాలూరు ఏరియా ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య నిపుణులు, సిబ్బందిని నియమించాలి. ఐటీడీఏల పరిధిలో ఉన్న గిరిజన గ్రామాలకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. మూడు గర్భిణుల వసతిగృహాల ద్వారా పూర్తిస్థాయిలో సేవలు అందించాలి. రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి.. 12 గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు లేకుండా చూడాలి. ఏజెన్సీలో విద్యాభివృద్ధికి పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు స్థానికంగా ఉపాధి కల్పించాలి. గిరిజనుల గోడును పరిగణనలోకి తీసుకుని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్న బడిదేవరకొండపై గ్రానైట్ తవ్వకాల అనుమతులు రద్దు చేయాల్సి ఉంది. పార్వతీపురం మండలం హెచ్.కారాడవలస, పెద్ద బండపల్లి ప్రాంతాల మధ్య కూడా గ్రానైట్ తవ్వకాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రధానంగా జిల్లావాసులను వేధిస్తున్న ఏనుగుల సమస్యపై దృష్టిసారించాలి. సీతానగరం మండలంలో ఎలిఫెంట్ జోన్ పనులు త్వరగా పూర్తి చేయాల్సి ఉంది. కుంకిని జిల్లాకు రప్పించి మన్యం వాసులకు ఏనుగుల బెడద తప్పించాలి. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం, వైద్య కళాశాలకు స్థల సేకరణ పూర్తి చేయాలి. కలెక్టర్ కార్యాలయ నిర్మాణానికి గత వైసీపీ ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలం అనుకూలంగా లేదని ఇంజనీరింగ్ శాఖాధికారులు స్పష్టం చేసినందున.. దీనిపై కూడా నూతన కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించాల్సి ఉంది.
బదిలీపై వెళ్తున్న కలెక్టర్‌కు సత్కారం
బదిలీపై సత్యసాయి జిల్లాకు వెళ్తున్న కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌ను శుక్రవారం రాత్రి జిల్లా అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడ్కోలు సభలో ఆయన మాట్లాడుతూ.. పార్వతీపురం మన్యం జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేశానన్నారు. తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ, ఉపాధ్యాయ , ఏపీ ఎన్‌జీవో , వీఆర్‌వో, గిరిజన సంఘం ప్రతినిధులు తదితరులు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సేవలను కొనియాడారు. ఈ కార్య క్రమంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్ కలెక్టర్ వైశాలి, ఏఎస్పీ అంకితా సురాన, పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవర్ జగన్నాథ్, డీఆర్వో హేమలత తదితరులు పాల్గొన్నారు.