Helping Hands రోగులకు అండగా హెల్పింగ్ హ్యాండ్స్
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:12 AM
Helping Hands Standing by Patient ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల కోసం హెల్పింగ్ హ్యాండ్స్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.
మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
పార్వతీపురం, నవంబరు22(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల కోసం హెల్పింగ్ హ్యాండ్స్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో జిల్లాలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో వలంటీర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో రోగికి ఒక్కో వలంటీర్‌ను అప్పగిస్తామని తెలిపారు. వారు రోగికి ఓపీ తీసుకొని.. తిరిగి ఇంటికి పంపించే వరకు పూర్తి బాధ్యత వహిస్తారన్నారు. ‘ఆయుష్మాన్ భారత్’ రిజిస్ర్టేషన్ కూడా చేయిస్తారని వెల్లడించారు. జిల్లాలోని మారుమూల గ్రామాల నుంచి వచ్చే గిరిజనులు, నిరక్షరాస్యులు, పేద ప్రజలకు ఆసుపత్రుల్లో ఇబ్బందులు కలగకుండా చూడడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. రోగులు ఆసుపత్రి లోపలకు వచ్చిన దగ్గర నుంచి వైద్యం చేయించుకొని తిరి ఇంటికి వెళ్లేంతవరకు వారికి వలంటీర్లు తోడుగా ఉంటూ మార్గనిర్దేశం చేస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు తమ పేర్లును నమోదు చేసుకుని ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం ఆభా కార్డులను పంపిణీ చేశారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో కె.హేమలత, డీఎంహెచ్‌వో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.