Share News

Poor Response వారంలో రెండు రోజులు నిర్వహిస్తున్నా.. స్పందన కరువు

ABN , Publish Date - Dec 14 , 2025 | 11:12 PM

Held Twice a Week, But Poor Response సీతంపేట ఐటీడీఏ వేదికగా ఎన్నో ఏళ్లుగా సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌లో మార్పులు తీసుకురావడంతో గిరిజనులు అసహనం వ్యక్తం చేస్తు న్నారు. పీవో ఎప్పుడు అందుబాటులో ఉంటారో? ఎప్పుడు ఉండరో అర్థం కాని పరిస్థితుల నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు వారి నుంచి స్పందన కరవ వుతోంది.

 Poor Response వారంలో రెండు రోజులు నిర్వహిస్తున్నా..   స్పందన కరువు
సీతంపేట ఐటీడీఏ కార్యాలయం

  • గ్రీవెన్స్‌లో మార్పులు.. సోమ, శుక్రవారాల్లో నిర్వహణ

  • ఇన్‌చార్జి పీవో ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియని వైనం

  • వినతులు ఇచ్చేందుకు ముందుకురాని గిరిపుత్రులు

  • అధికారుల తీరుపై మండిపడుతున్న గిరిజన సంఘాలు

  • పీవో ఆధ్వర్యంలో వారంలో ఒక్కరోజే నిర్వహించాలని డిమాండ్‌

సీతంపేట రూరల్‌, డిసెంబరు14(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ వేదికగా ఎన్నో ఏళ్లుగా సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌లో మార్పులు తీసుకురావడంతో గిరిజనులు అసహనం వ్యక్తం చేస్తు న్నారు. పీవో ఎప్పుడు అందుబాటులో ఉంటారో? ఎప్పుడు ఉండరో అర్థం కాని పరిస్థితుల నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు వారి నుంచి స్పందన కరవ వుతోంది. దీంతో వారంలో (సోమ, శుక్రవారాల్లో) రెండు రోజుల పాటు ఐటీడీఏలో గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నప్పటికీ పెద్దగా వినతులు రావడం లేదు.

ఇదీ పరిస్థితి..

- గిరిజనాభివృద్ధే లక్ష్యంగా 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ సీతంపేట ఐటీడీఏను ఏర్పాటు చేశారు. నాటి నుంచి ఐటీడీఏ కేంద్రంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నారు. 20 సబ్‌ప్లాన్‌ మండలాల్లో నివసిస్తున్న గిరిజనులు ఆ రోజు ఐటీడీఏకు చేరుకుని వినతులు ఇవ్వడం పరిపాటిగా మారింది. అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా సీతంపేటలో సోమవారం జరిగే వారపు సంతకు సుదూర ప్రాంతాల నుంచి గిరిపుత్రులు వస్తుంటారు. అటవీ ఉత్పత్తుల విక్రయం, నిత్యవసర సరుకుల కొనుగోలు చేసిన తర్వాత ఐటీడీఏకు చేరుకుంటారు. కాగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌కు వచ్చే గిరిజనులకు ఐటీడీఏ ఆధ్వర్యంలో రూ.10కే భోజన సౌకర్యం కల్పించేవారు. చిన్నారులకు పాలప్యాకెట్ల్లు సరఫరా చేసేవారు.

- గతంలో పాలకొండ సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన యశ్వంత్‌కుమార్‌రెడ్డి సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోగా ఏడాదికి పైగా పనిచేశారు. ఆయన హయాంలో ఐటీడీఏలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు ఇన్‌చార్జి పీవో హోదాలో అందుబాటులో ఉండేవారు. దీంతో 20సబ్‌ప్లాన్‌ మండలాల పరిధిలో ఉన్న గిరిపుత్రులు వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐటీడీఏ గ్రీవెన్స్‌ను వచ్చేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది.

- ఇటీవల కాలంలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ సోమవారం సీతంపేట ఐటీడీఏలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు అందుబాటులో ఉండడం లేదు. కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రత్యేక రెవెన్యూ క్లినిక్‌కు సబ్‌ కలెక్టర్‌ హోదాలో హాజరవడంతో ఇక్కడ ఏపీవో స్థాయి అధికారితో మొక్కుబడిగా పీజీఆర్‌ఎస్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌కు గిరిపుత్రులు పెద్దగా రావడం లేదు. ఈ పరిస్థితి గమనించిన అధికారులు వారంలో సోమవారంతో పాటు శుక్రవారం కూడా పీజీఆర్‌ఎస్‌ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. గత శుక్రవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ ఉన్నప్పటికీ 15 అర్జీలు మాత్రమే వచ్చాయి. అర్జీదారులు లేక ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోతో పాటు పలు శాఖల అధికారులు, సిబ్బందికి ఎదురుచూపులే మిగిలాయి. చేసేది లేక పీజీఆర్‌ఎస్‌ను గంటల వ్యవధిలోనే ముగించేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. గతంలో మాదిరిగానే ఐటీడీఏలో సోమవారం ఒక్కరోజే పీవో ఆధ్వర్యంలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహించాలని గిరిజనులు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.

ఇన్‌చార్జి పీవో ఏమన్నారంటే..

‘పార్వతీపురం కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించే రెవెన్యూ క్లినిక్‌కు హాజరవుతున్నా. దీంతో ఐటీడీఏలో సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు అందుబాటులో ఉండడం లేదు. ఈ కారణంగా ప్రత్యామ్నాయంగా శుక్రవారం ఐటీడీఏలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్నాం.’ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ తెలిపారు.

Updated Date - Dec 14 , 2025 | 11:12 PM