Heavy Rains మన్యంలో జోరు వాన
ABN , Publish Date - Jul 23 , 2025 | 11:42 PM
Heavy Rains in Manyam అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా బుధవారం జోరువాన కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు, కూడళ్లలో నీరు నిలిచింది. పాదచారులు, వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు.
పార్వతీపురం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా బుధవారం జోరువాన కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు, కూడళ్లలో నీరు నిలిచింది. పాదచారులు, వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు. జిల్లాలో పాలకొండ, భామిని, సీతంపేట తదితర చోట్ల సుమారు గంటన్నర పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. మిగిలిన చోట్ల ఓ మోస్తరుగా వాన పడింది. పంట పొలాల్లో నీరు చేరగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా రానున్న 48 గంటల్లో పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
వర్షాలపై అప్రమత్తం:కలెక్టర్
అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. బుధవారం క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఈ నెల 24, 25 తేదీల్లో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో లోతట్టు, నదీపరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలి. మైక్ ద్వారా ప్రచారం చేయాలి. ఒడిశాలోనూ వర్షాలు కురుస్తుండడంతో తోటపల్లి, నాగావళి నదులకు వరద పోటెత్తనుంది. ఈ మేరకు ముందస్తు చర్యలు తీసుకోవాలి. పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారి, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి.. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు జరగకూడదు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం (08963-293046) ఏర్పాటు చేశాం. పార్వతీపురం, పాలకొండ రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలి. శిథిలావస్థ భవనాల్లో ఎవరూ ఉండకుండా చూడాలి. వాగులు, వంకలు దాటకుండా చర్యలు తీసుకోవాలి. గిరి శిఖర గ్రామాల్లో పరిస్థితిని గమనించాలి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రసవ సమయం దగ్గరలో ఉన్న గర్భిణులను వసతిగృహాలు, ఆసుపత్రులకు తరలించాలి. చెరువులు, ఆనకట్టలు తనిఖీలు చేయాలి.’ అని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో కె.హేమలత, సబ్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.