Bhamini భామినిలో కుండపోత
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:28 PM
Heavy rain in Bhamini భామిని మండలంలో శని వారం సాయంత్రం సుమారు గంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
భామిని, ఆగస్టు16(ఆంధ్రజ్యోతి): భామిని మండలంలో శని వారం సాయంత్రం సుమారు గంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరి నాట్లు వేసేందుకు ఈ వర్షం ఎంతగానో ఉపయోగపడుతుందని భామిని, సింగిడి, గురండి, లివిరి, దిమ్మిడిజోల, బాలేరు తదితర గ్రామాల్లో అన్నదాతలు తెలిపారు. కాగా మరికొన్ని ప్రాంతాల్లో పత్తి, మొక్కజొన్న పొలాల్లో చేరిన నీటిని తొలగించేందుకు రైతులు తంటాలు పడుతున్నారు.
వానలకు దెబ్బతిన్న ఇళ్లు
గుమ్మలక్ష్మీపురం: అధిక వర్షాల కారణంగా డుమ్మంగి, జొల్లడి గూడ గ్రామాల్లో రెండు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నానిపోయిన మట్టి గోడలు కూలిపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శేఖరం, ఆర్‌ఐ శివరామకృష్ణ శనివారం ఆ ఇళ్లను పరిశీలించారు. ఈ సమాచారాన్ని కలెక్టర్‌కు తెలియజేస్తామన్నారు.
నాగావళికి వరద
గరుగుబిల్లి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదికి వరద పోటెత్తుతోంది. ఒడిశా రాష్ట్రంతో పాటు జిల్లాలోనూ వర్షాలు కురుస్తుండడంతో పార్వతీపురం పరిధిలోని వరహాల గెడ్డతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భారీగా వరద నదిలోకి చేరుతుంది. శనివారం 6,500 క్యూసెక్కులకు పైగా చేరగా.. అధికారులు అప్రమత్తమై స్పిల్‌వే గేట్లు నుంచి దిగువ ప్రాంతాలకు 7 వేల క్యూసెక్కులను విడుదల చేశారు. ప్రాజెక్టు పరిధిలో 105 మీటర్లకు గాను 104.29 మీటర్ల మేర నీటి నిల్వ ఉంది. ఇదిలా ఉండగా సాగునీటి అవసరాలకు ప్రధాన కాలువల నుంచి 1300 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు.
వర్షాలపై అప్రమత్తం: కలెక్టర్
పార్వతీపురం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. శనివారం సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు జరగరా దన్నారు. ముందుగా గ్రామాల్లో దండోరా వేయించాలన్నారు. లోతట్టు, నదీపరి వాహక ప్రాంతాల్లో ఉండే వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచిం చారు. చెరువులు, వాగులు, వంకల్లో ఎవరూ దిగకుండా చూసుకోవాలని ఆదేశించారు.