Heavy Rain in Agency Area ఏజెన్సీలో జోరువాన
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:20 AM
Heavy Rain in Agency Area వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో బుధవారం సాలూరు ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. దక్షిణ ఒడిశా పొట్టంగి బ్లాక్, కొఠియా కొండల్లోనూ జోరువాన పడింది. దీంతో ఒడిశా నుంచి ఏపీకి ప్రవహిస్తున్న వేగావతి, వట్టిగెడ్డ, సువర్ణముఖి, గోముఖి నదులు ఉప్పొంగి ప్రవహించాయి.
ఉప్పొంగుతున్న వాగులు, గెడ్డలు
పలుచోట్ల రాకపోకలకు ఇబ్బందులు
నేడూ వర్షం కురిసే అవకాశం
సాలూరు రూరల్/కొమరాడ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో బుధవారం సాలూరు ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. దక్షిణ ఒడిశా పొట్టంగి బ్లాక్, కొఠియా కొండల్లోనూ జోరువాన పడింది. దీంతో ఒడిశా నుంచి ఏపీకి ప్రవహిస్తున్న వేగావతి, వట్టిగెడ్డ, సువర్ణముఖి, గోముఖి నదులు ఉప్పొంగి ప్రవహించాయి. గిరిజన ప్రాంతాల్లో వాగులకు వరద పోటెత్తుతోంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో రైతులు వరి ఉబాలు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా కొమరాడ మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామమైన కుంతేసులో గెడ్డపై అధికంగా వరద నీరు ప్రవహించింది. దీంతో సుమారు ఎనిమిది గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుంతేసు, గొర్రెలమ్మ, జొప్పంగి, వానబడి, దర్శింగి తదితర గ్రామాల ప్రజలతో పాటు ఒడిశా రాష్ట్రం కొమ్ముగండ గిరిజనులు పార్వతీపురం మీదుగా ఈ గెడ్డ దాటి కొమరాడ రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా అల్పపీడన ప్రభావంతో గురువారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. జిల్లాకు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ఉధృతి నేపథ్యంలో ఎవరూ నదులు, చెరువులు, వాగుల్లో దిగరాదని సూచించారు. వీఆర్వోలు, వీఆర్‌ఏలు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు సమాచారమందించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు.