Share News

జిల్లాకు భారీ వర్ష సూచన

ABN , Publish Date - Aug 14 , 2025 | 11:42 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు.

జిల్లాకు భారీ వర్ష సూచన
పార్వతీపురం ప్రధాన రహదారిపై నిలిచిన వరద నీరు.

- అధికారులు అప్రమత్తంగా ఉండాలి

- ఐదు రోజులు సెలవులు రద్దు

- లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి

- కలెక్టర్‌ ఆదేశం

పార్వతీపురం/టౌన్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. గురువారం తన కార్యాలయం నుంచి జిల్లా, మండల అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అధికారులు ఐదు రోజుల పాటు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు చేపట్టాలి. జిల్లాలో ఎక్కడ ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఈ ఐదు రోజులు అధికారులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయబడవు. విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటాం. కొండవాలు, నది పరివాహక, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను, పాడైన గృహాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. గర్భిణులు, వయసు మీరిన వారిని సమీప ఆసుపత్రి లేదా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉంచాలి. పిడుగులు పడడంతో పాటు ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్‌, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల దగ్గర ఎవరూ నిలబడరాదు. దీనిపై గ్రామాల్లో దండోరా వేయడంతో పాటు మైక్‌ ద్వారా ప్రచారం చేయాలి.’ అని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఎస్‌.శోభిక, సబ్‌ కలెక్టర్లు ఆర్‌.వైశాలి, స్వప్నిల్‌ జగన్నాథ్‌, డీఆర్వో కె.హేమలత, ఎస్‌డీసీ ఎస్‌.దిలీప్‌ చక్రవర్తి, డీఎఫ్‌వో పి.సింహాచలం ఇతర అధికారులు పాల్గొన్నారు.

పార్వతీపురంలో జోరు వాన

జిల్లా కేంద్రం పార్వతీపురంలో గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఏకధాటిగా వాన పడింది. దీంతో పార్వతీపురం ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరింది. దీనివల్ల పాదచారులు, వాహనచోదకులు ఇబ్బందులుపడ్డారు. మేదరి వీధి కూడలి నుంచి దేవాంగుల వీధి వరకు ప్రధాన రహదారిపై వరద నిలిచిపోవడంతో స్థానికులు అవస్థలుపడ్డారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో వరదనీటితో ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

నాగావళికి వరద ప్రవాహం

గరుగుబిల్లి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదికి వరద ప్రవాహం నెలకొంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పైప్రాంతం నుంచి వరద ప్రవాహం నదిలోకి చేరుతుంది. గురువారం ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి సుమారు 5 వేల క్యూసెక్కుల నీరు చేరగా, స్పిల్‌వే గేట్ల నుంచి 6,500 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. ప్రాజెక్టులో 105 మీటర్ల నీటి సామర్థ్యానికి గాను 104.05 మీటర్ల సామర్థ్యం ఉంది. అలాగే 2.534 టీఎంసీలకు గాను 1.932 టీఎంసీ నిల్వ ఉంది. ఖరీఫ్‌కు సంబంధించి ప్రధాన కాలువల నుంచి 1,304 క్యూసెక్కుల సాగునీటిని సరఫరా చేస్తున్నట్లు ప్రాజెక్టు ఈఈ హెచ్‌.మన్మథ రావు, డీఈఈ టి.రఘునాథనాయుడు తెలిపారు.

Updated Date - Aug 14 , 2025 | 11:42 PM