జిల్లాకు భారీ వర్ష సూచన
ABN , Publish Date - Jul 25 , 2025 | 11:47 PM
జిల్లాలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
-మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు
- వాతావరణ శాఖ హెచ్చరికలు
విజయనగరం కలెక్టరేట్/భోగాపురం, జూలై 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఇన్‌చార్జి కలెక్టర్ సేతు మాధవన్ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఉండి పరిస్థితులను అంచనా వేయాలని, ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అన్నారు.
భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని తీర ప్రాంత గ్రామాల్లో శుక్రవారం తహసీల్దార్ ఎం.రమణమ్మ తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు. ముక్కాం, కొండ్రాజుపాలెం, ఎర్రముసలయ్యపాలెం, చేపలకంచేరు, కొత్తూరు, చింతపల్లి, పులిగెడ్డ, కోనాడ, తమ్మయ్యపేట, బొడ్డుగురయ్యపేట గ్రామాల్లో వీఆర్వోలు పర్యటించారు. చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. అలాగే రెవెన్యూ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. తుఫాన్ హెచ్చరికలతో మత్స్యకారులు పడవలు, వేట సామాగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించి భద్ర పరచుకుంటున్నారు.