Heavy rain for two more days మరో రెండు రోజులు భారీ వర్షం
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:14 AM
Heavy rain for two more days జిల్లాలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం మండల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మరో రెండు రోజులు భారీ వర్షం
కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరం కలెక్టరేట్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం మండల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్.కోట, నెల్లిమర్ల, బొబ్బిలి నియోజకవర్గాల్లో రెండు రోజుల పాటు అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, అధికారులంతా అత్యంత అప్రమత్తంగా ఉండి నష్ట నివారణ చర్యలు చేపట్టాలన్నారు. నదులు, చెరువులు, రిజర్వాయర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. వంగర, రేగిడి, సంతకవిటి మండలాల్లో కాలువలు, చెరువుల గట్లను పరిశీలించి బలహీనంగా ఉన్న చోట్ల యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలన్నారు. నిధులకు కొరత లేదని, వెంటనే ప్రతిపాదనలు పంపించాలన్నారు. అవసరమైన చోట్ల గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు. తాగునీరు, పారిశుధ్యం, ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలని, ఎక్కడా నీరు నిలిచిపోకుండా చూడాలని అన్నారు. అవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. రోడ్లపై గుంతలు పడితే పూడ్చేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీపీవో బాలాజీ ఉన్నారు.
అధికారుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం
జిల్లా ఐసీడీఎస్ పీడీ, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పనితీరుపై కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అసహనం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా సోమవారం అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లలకు సెలవు ఇవ్వాలని ఆదివారం రాత్రి 9 గంటలకు తాను మెసేజ్ పెడితే సోమవారం ఉదయం వరకూ సమాధానం లేదంటూ ఐసీడీఎస్ పీడీపై అసహనం వ్యక్తం చేశారు. తనకు ఆరోగ్యం బాగా లేక ట్లాబెట్ వేసుకుని నిద్రలోకి వెళ్లడంతో మెసేజ్ చూడలేదని పీడీ విమలారాణి వివరించారు. సమాచారం ఇవ్వకుండా సమావేశాలకు ఎలా వెళ్లారని సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అన్నపూర్ణను కూడా ప్రశ్నించారు. ఇక నుంచి ఇలా చేయొద్దని కలెక్టర్ ఆదేశించారు. ఈ ఘటన పీజీఆర్‌ఎస్ జరుగుతున్న సమయంలో చోటుచేసుకుంది.