Share News

అప్రమత్తతతోనే గుండె భద్రం

ABN , Publish Date - Sep 29 , 2025 | 12:03 AM

జిల్లాలో గుండెపోటు మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

అప్రమత్తతతోనే గుండె భద్రం

- జిల్లాలో పెరుగుతున్న గుండెపోటు మరణాలు

- చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోతున్న వైనం

-హృద్రోగ సమస్యలపై అవగాహన అవసరం

- ముందస్తు జాగ్రత్తలే శ్రీరామ రక్ష

- నేడు ప్రపంచ హృదయ దినోత్సవం

- ఈ నెల 25న విజయనగరంలోని దాసన్నపేటకు చెందిన వి.వెంకటసాయి మణికంఠ అనే యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. 2024 బీఈడీ స్టేట్‌ టాపర్‌గా నిలిచిన మణికంఠ ప్రస్తుతం విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో బీఎడ్‌ చదువుతున్నాడు. బాత్‌రూమ్‌కు వెళ్లే క్రమంలో కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు ఆస్పత్రికి తీసుకెళ్లగా గుండెపోటుతో మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మణికంఠ వయసు 23 ఏళ్లు మాత్రమే.

- ఈ నెల 18న విజయనగరంలో పాలవలస సాయికిరణ్‌ అనే 19 ఏళ్ల యువకుడు మృతిచెందాడు. ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్న సాయికిరణ్‌ కాలేజీలో ఎన్‌సీసీ ఎంపికల్లో భాగంగా పరుగుపందెం పోటీల్లో కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

- ఈ ఏడాది ఆగస్టు 14న ఎస్‌.కోట మండలం కిల్తంపాలెం నవోదయ విద్యాలయంలో పీఈటీ ప్రదీప్‌ భారతి గుండెపోటుతో మృతిచెందారు. తెలంగాణలోని నవోదయ విద్యాలయంలో పనిచేస్తున్న ఆయన వాలీబాల్‌ క్రీడల్లో విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు వచ్చారు. వాలీబాల్‌ శిక్షణ పూర్తవ్వగా అస్వస్థతకు గురయ్యారు. అక్కడే కుప్పకూలిపోయాడు. ఆయన వయసు 32 ఏళ్లు మాత్రమే.

విజయనగరం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గుండెపోటు మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా గతంలో పెద్ద వారికి ఎక్కువగా గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడు అన్ని వయసుల వారూ దానిబారిన పడుతున్నారు. కరోనా వైరస్‌, వ్యాక్సినేషన్‌ తరువాత గుండెపోట్లు పెరిగినట్లు ప్రజలు అంటున్నారు. ఆహార అలవాట్లు, మద్యం, పొగ తాగడం వంటి కారణాలతో హృద్రోగ సమస్యలు ఎక్కువయ్యాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనిషిపై పెరుగుతున్న భారం, ఒత్తిడి కూడా ప్రధాన కారణాలుగా ఉన్నాయి. మారుతున్న పోటీ ప్రపంచంలో మనిషి తీవ్రంగా ఆలోచించడం, శరీరంపై భారం పెట్టడం కూడా రుగ్మతలకు ప్రధాన కారణం. గుండెపోటు అనేది తీవ్ర సమస్యగా, మహమ్మారిగా మారుతోంది. అయితే మిగతా రుగ్మతలు కొంత సమయమిస్తాయి. కానీ గుండెపోటు అలాకాదు. వచ్చిన కొద్దిసేపటికే వైద్యసేవలు అందాలి. అన్నింటికీ మించి గుండెపోటు సంకేతాలు అందిన వెంటనే మనమే మేలుకోవాలి. సంబంధిత నిపుణులకు చూపించుకోవాలి. గుండెకు రక్తం సరఫరా చేసే నరాలు పూడికపోతాయి. అప్పుడు నరాలు చిట్లి రక్తం గడ్డ కడుతుంది. గుండెకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఛాతి బరువు లేక నొప్పితో పాటు శ్వాస ఆడకపోవడం, తల తిరగడం, చెమట పట్టడం, గుండెదడ, ఎడమచేతికి లేదా రెండు భుజాలకు, వెనుక భాగానికి, గొంతు భాగానికి నొప్పి పాకినట్లు ఉంటే అది కచ్చితంగా గుండె నొప్పిగానే పరిగణించవచ్చు. అప్పుడే గుండెపోటుకు దారితీసే అవకాశం ఉంటుంది. ముందస్తుగానే దీన్ని గుర్తించే చాలా పరీక్షలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానంగా కరోనరీ కాల్షియం స్కోర్‌ తెలుసుకోవడం ద్వారా గుండెపోటును నియంత్రించవచ్చు. కార్డియాక్‌ సిటీ స్కాన్‌ ద్వారా పరీక్షించుకోవచ్చు. ఇది రక్తనాళాల్లోని కాల్షియం మోతాదును లెక్కించి స్కోర్‌ను తెలియజేస్తుంది.

పరీక్షలు తప్పనిసరి..

సాధారణంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు విధిగా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకోవాలి. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి గుండె కాల్షియం స్కోర్‌ పరీక్ష చాలా ఉపయోగపడుతుంది. సుగర్‌, హైబీపీ, అధిక కొలస్ర్టాల్‌ ఉన్నవారు, కుటుంబంలో అప్పటికే గుండెపోటు వచ్చిన వారి రక్తసంబంధికులు, పొగతాగే అలవాటు, భారీ ఉబకాయం ఉన్నవారు ఈ పరీక్షలు చేసుకుంటే చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 35 నుంచి 40 ఏళ్ల వయసులో ఒకసారైనా కాల్షియం స్కోర్‌ పరీక్ష చేసుకుకోవాలని అంటున్నారు. మూడు నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి కాల్షియం స్కోర్‌ పరీక్ష చేయించుకోవడం చాలా ఉత్తమమని చెబుతున్నారు. కాల్షియం స్కోరు ఎక్కువగా ఉంటే కొలస్ర్టాల్‌ తగ్గించే స్టాటిన్లు వేసుకోవడం, వ్యాయామం చేయడం, ఆహారంలో మార్పులు చేసుకోవడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం, తరచూ డాక్టర్లను సంప్రదించడం వంటి జాగ్రత్తలతో పెద్ద ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

నిర్లక్ష్యం వద్దు..

గుండె సంబంధిత వ్యాధుల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ముందుగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎప్పటికప్పుడు కాల్షియం స్కోరు పరీక్ష చేసుకోవడం చాలా ఉత్తమం. ఆహారంలో ఉప్పు, చక్కెరను తగ్గించాలి. జంక్‌ఫుడ్స్‌ జోలికి వెళ్లకూడదు. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 30నిమిషాల పాటు వ్యాయామం, నడవడం చేయాలి. యోగా, ధ్యానం చేయడం ద్వారా గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. గుండె జబ్బులు ఉన్నవారి కుటుంబీకులు, ఛాతినొప్పి, శ్వాస ఆడకపోవడం, ఆకస్మిక అలసట వంటి లక్షణాలు కన్పిస్తే ఆలస్యం చేయకుండా కార్డియాలజిస్ట్‌ని సంప్రదించాలి.

-డాక్టర్‌ బొబ్బిలి రవికిషోర్‌, కార్డియాలజిస్ట్‌, విజయనగరం

Updated Date - Sep 29 , 2025 | 12:03 AM