Share News

Health with vaccination టీకాతో ఆరోగ్యం

ABN , Publish Date - Nov 09 , 2025 | 11:59 PM

Health with vaccination పిల్లలకు టీకా ఓ సంజీవిని. వారి ఆరోగ్య జీవన బాటకు ఓ పునాది. అటువంటి టీకాలను ఆరోగ్య శాఖ సిబ్బంది ఏటా అందిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి 448 మంది చిన్నారులకు బీసీజీ (క్షయ నివారణ), ఓపీవీ (పోలియో), హెపటైటిస్‌-బి(పచ్చకామిర్లు), ఫెంటావాలెంట్‌ (గోరింతదగ్గు, ధనుర్వాతం, పచ్చకామిర్లు, న్యూమోనియా, కంఠసర్పి- ఐదు రకాల వ్యాధులు), రోటా వైరస్‌ (నీళ్ల విరోచనాలు) టీకాలను, పది సంవత్సరాల వయసు కలిగిన 684 మందికి టీడీ (ధనుర్వాతం, గోరింత దగ్గు) టీకాలను, 16 సంవత్సరాల వయసు కలిగిన 574 మందికి టీడీ(ధనుర్వాతం, గోరింత దగ్గు) టీకాలను లక్కవరపుకోట ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అందించారు.

Health with vaccination టీకాతో ఆరోగ్యం

టీకాతో ఆరోగ్యం

వివిధ రకాల వైరస్‌ల నుంచి కాపాడే సంజీవిని

పుట్టిన బిడ్డ నుంచి పదహారేళ్ల వరకు అవసరం

ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ

నేడు ప్రపంచ వ్యాధి నివారణ టీకాల దినోత్సవం

శృంగవరపుకోట, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి)

పిల్లలకు టీకా ఓ సంజీవిని. వారి ఆరోగ్య జీవన బాటకు ఓ పునాది. అటువంటి టీకాలను ఆరోగ్య శాఖ సిబ్బంది ఏటా అందిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి 448 మంది చిన్నారులకు బీసీజీ (క్షయ నివారణ), ఓపీవీ (పోలియో), హెపటైటిస్‌-బి(పచ్చకామిర్లు), ఫెంటావాలెంట్‌ (గోరింతదగ్గు, ధనుర్వాతం, పచ్చకామిర్లు, న్యూమోనియా, కంఠసర్పి- ఐదు రకాల వ్యాధులు), రోటా వైరస్‌ (నీళ్ల విరోచనాలు) టీకాలను, పది సంవత్సరాల వయసు కలిగిన 684 మందికి టీడీ (ధనుర్వాతం, గోరింత దగ్గు) టీకాలను, 16 సంవత్సరాల వయసు కలిగిన 574 మందికి టీడీ(ధనుర్వాతం, గోరింత దగ్గు) టీకాలను లక్కవరపుకోట ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అందించారు.

పిల్లలకు 16 సంవత్సరాలు వచ్చే వరకు పలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఈ టీకాలను అందిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఈ శాఖకు చెందిన మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (ఏఎన్‌ఎం)లు పనిచేస్తున్నారు. వీరు క్రమం తప్పకుండా టీకాలన్నింటినీ అందిస్తున్నదీ లేనిదీ పర్యవేక్షించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో పాటు కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌, హెల్త్‌ విజిటర్‌, ఆరోగ్య పర్యవేక్షకుడు తదితర అధికారులు పనిచేస్తున్నారు. బుధ, శనివారాల్లో గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న హెల్త్‌ సెంటర్‌, ఆరోగ్య ఉపకేంద్రాల వద్దకు తల్లులు చిన్నారులను తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. వీరికి ఆశ కార్యకర్తలు తోడ్పాటు అందిస్తున్నారు. టీకాలు ఇవ్వడం ద్వారా వివిధ రకాల వైరస్‌ల బారి నుంచి పిల్లలను వైద్య ఆరోగ్య శాఖ కాపాడుతోంది. ఈ టీకాలు అనేక అంటు వ్యాధులను తగ్గిస్తున్నాయి. ఒకప్పుడు మసూచి, ఆ తరువాత పోలియో, నాలుగేళ్ల క్రితం కొవిడ్‌-19 ప్రపంచ జనాభాను వణికించిన వైరస్‌లు. లక్షల సంఖ్యలో ప్రాణాలను హరించిన మహమ్మారులు. 2020 డిసెంబర్‌లో దేశంలోకి ప్రవేశించిన కరోనా వైరస్‌ మొదటి, రెండవ దశలో ఎంతో మంది ప్రాణాలను హరించింది. దీన్ని ఎదుర్కొనేందుకు రెండు సంవత్సరాల కాలం పట్టింది. దీని నివారణకు భారత దేశమే వ్యాక్సిన్‌ (టీకా)ను కనిపెట్టింది. తద్వారా మన దేశంతో పాటు ప్రపంచ దేశాల ప్రజలను కొవిడ్‌ నుంచి కాపాడింది. ఈ విధంగా టీకాలు ఏటా లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతున్నాయి. సోమవారం ప్రపంచ వ్యాధుల నివారణ టీకా దినోత్సవం. పలు వ్యాధులను ఎలా నివారించవచ్చుననే విషయం గురించి అవగాహన కల్పించడం కోసం దీనిని ఏటా నవంబరు 10న జరుపుకుంటున్నాం.

టీకాలతో వ్యాధుల నుంచి రక్షణ

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నిత్యం ఎంతో మంది పిల్లలు పుడుతున్నారు. వీరు రోగాల బారిన పడకుండా వ్యాధి నిరోధక టీకాలు తప్పనిపరి. పుట్టిన బిడ్డ నుంచి 16 సంవత్సరాలు వచ్చేవరకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం ఉచితంగా టీకాలను అందిస్తుంది. బీసీసీ నుంచి పెంటావాలంటీన్‌ వరకు అన్ని రకాల టీకాలు అందుబాటులో ఉంటున్నాయి. వంద శాతం లక్ష్యాలను చేరుకోవాలంటే తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల ఆరోగ్యం కోసం శ్రద్ధ పెట్టాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నడుస్తున్న ప్రత్యేక వ్యాక్సినేషన్‌ (టీకా కార్యక్రమం)ను వినియోగించుకోవాలి.

వారంలో ప్రతి బుధ, శనివారం గ్రామాల్లో ఉన్న విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ (వెల్‌నెస్‌ సెంటర్‌), ఆరోగ్య ఉప కేంద్రాల వద్ద ఏఎన్‌ఎం (ఆరోగ్య కార్యకర్తలు) అందిస్తున్నారు. పిల్లలు జన్మించిన వెంటనే బీసీజీ (బాసిల్లె క్లామెట్టి గ్యూరిన్‌), ఓపీవీ (ఓరల్‌ పోలియో వ్యాక్సిన్‌), హైపటైటిస్‌-బి టీకాలు వేస్తున్నారు. ఆరు, పది, పద్నాలుగు వారాలకు పెంటావాలెంట్‌ (పెంటా-1,పెంటా-2, పెంటా-3) ఆర్‌వీవీ (రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ 1,2,3), పీసీవీ (నిమోకోకల్‌ కంజుగేట్‌ వ్యాక్సిన్‌ 1,2) ఇస్తున్నారు. తొమ్మిది నెలలకు ఎం.ఆర్‌ (మీజిల్స్‌ తట్టు-1), జేఈ (జపనీస్‌ ఎన్‌సీఫాలిటిక్స్‌ వ్యాక్సిన్‌ -1) ఇస్తుండగా 16 నుంచి24నెలల మధ్య డీపీటీ (డిప్తీరియా ,పెర్టుసిస్‌, టెటనస్‌)బూస్టర్‌, ఓపీవీ బూస్టర్‌, ఎంఆర్‌-2, జీఈ-1, విటమిన్‌ ఏ ఇస్తున్నారు. 5నుంచి 6 ఏళ్ల పిల్లలకు డీపీటీ బూస్టర్‌-2, 10 నుంచి 16 సంవత్సరాల పిల్లలకు టీడీ (టెటనస్‌ డిప్తీరియా)టీకా చిన్నారులకు ఇప్పించడం ఖచ్చితంగా పాటించాలి. అన్ని రకాల టీకాలను సకాలంలో వేయించడం వల్ల 12 ప్రాణంతక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది

వ్యాధులు రాకుండా టీకాలు కాపాడుతాయి. వ్యాధి నిరోధక శక్తికి పెంచుతాయి. పుట్టిన వెంటనే బిడ్డకు వైద్యుల సలహాతో టీకాలు వేయించాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా టీకాలు వేసేందుకు ఆరోగ్య కార్యకర్తలను క్షేత్ర స్థాయికి పంపిస్తున్నారు. విలేజ్‌, వార్డు హెల్త్‌ క్లినిక్‌, ఆరోగ్య ఉప కేంద్రాల వద్ద వైద్యులు సూచించిన విధంగా క్రమపద్ధతిలో ఈ టీకాలను వేస్తున్నారు. ఉచితంగా అందిస్తున్న ఈ టీకాలు ఎంతో మంది చిన్నారుల ప్రాణాలను కాపాడుతున్నాయి.

- డి.అనిల్‌కుమార్‌, వైద్యాధికారి, పీహెచ్‌సీ, లక్కవరపుకోట

Updated Date - Nov 09 , 2025 | 11:59 PM