చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ మృతి
ABN , Publish Date - Jul 22 , 2025 | 12:21 AM
కారు ఢీకొన్న ఘటనలో గాయాలపాలైన ఐదో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ కోరాడ రామునాయుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు.
డెంకాడ, జూలై 21(ఆంధ్రజ్యోతి): కారు ఢీకొన్న ఘటనలో గాయాలపాలైన ఐదో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ కోరాడ రామునాయుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల 23న చింతలవలస 5వ బెటాలియన్ మెయిన్ గేటు ఎదురుగా 26వ జాతీ య రహదారిపై రామునాయుడు నడుచుకుంటూ వెళ్తుండగా కారు ఢీకొంది. దీంతో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు విజయనగరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ పట్టణం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈయన భార్య సూర్యకాంతం మోపాడ పీహెచ్‌సీలో స్టాఫ్‌నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. మృతదేహాన్ని విశాఖ నుంచి విజయనగరం మహరాజ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. స్వగ్రామం పద్మనాభం మండలం, కోరాడలో దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. రామునాయుడు పోలీసు అసోసియే షన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఈయన అకాల మరణాన్ని ఇక్కడి అధికారులు, సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు.