మందలిస్తున్నాడని చంపేశాడు..
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:31 AM
బొబ్బిబి గ్రోత్‌సెంటర్‌లోని రాఘవ కనస్ట్రక్షన్స్ (ఎలక్ట్రికల్) స్టోర్ వాచ్‌మన్ కనిమెరకల వెంకటరమణ (55) హత్య కేసును పోలీసులు ఛేదించారు.
- వాచ్‌మన్ హత్య కేసులో నిందితుడి అరెస్టు
- రిమాండ్‌కు తరలింపు
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాఘవులు
బొబ్బిలి, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): బొబ్బిబి గ్రోత్‌సెంటర్‌లోని రాఘవ కనస్ట్రక్షన్స్ (ఎలక్ట్రికల్) స్టోర్ వాచ్‌మన్ కనిమెరకల వెంకటరమణ (55) హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుడి కుమార్తెకు పరిచయమున్న యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను మందలిస్తున్నాడని వెంకటరమణను చంపేశాడు. టెక్నాలజీ సాయంతో నిందితుడిని గుర్తించి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను స్థానిక పోలీసుస్టేషన్‌లో శుక్రవారం రాత్రి చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు విలేకరులకు వెల్లడించారు. బొబ్బిలి పట్టణంలోని దిబ్బవీధికి చెందిన వెంకటరమణ గ్రోత్‌సెంటర్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 20న అర్ధరాత్రి విధుల్లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఆయన్ను తీవ్రంగా కొట్టి గాయపరిచి పారిపోయాడు. వెంకటరమణ గాయాలతో సమీపంలోని పెట్రోల్ బంకుదగ్గరికి వెళ్లి కుప్పకూలి పోయాడు. అక్కడ ఉన్న వారు వెంకటరమణ ఫోన్ నుంచి అతని కుమారుడు పురుషోత్తంకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే ఆయన వచ్చి తండ్రిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటరమణ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు విజయనగరం మహారాజా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ కటకం సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ రమేష్ ఇతర సిబ్బంది రంగంలోకి దిగారు. బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. ఘటనా స్థలంలో నిందితుని పర్సు, ఫొటో లభ్యమయ్యాయి. సెల్‌ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుని ఆచూకీ కనుక్కోగలిగారు. పాతబొబ్బిలికి చెందిన కోట సర్వేశ్వరరావు(20) అనే యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. అతన్ని శుక్రవారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.
ఏం జరిగిందంటే..
నిందితుడు సర్వేశ్వరరావు ఓ చికెన్ సెంటరులో పనిచేస్తున్నాడు. మృతుడు వెంకటరమణ కుమార్తె అదే చికెన్ సెంటరులో అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. దీంతో వీరిమధ్య పరిచయం ఏర్పడింది. ఈ విషయంలో వెంకటరమణ ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. సర్వేశ్వరరావును కూడా వెంకటరమణ మందలించేవాడు. దీంతో వెంకటరమణను హతమార్చాలని సర్వేశ్వరరావు వ్యూహం పన్నాడు. ఈ నెల 20న రాత్రి వెంకటరమణ పనిచేసే చోటకు వెళ్లి చాలాసేపు కాపు కాశాడు. సమయం చూసి ఆయన్ను తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. వెంకటరమణ మృతి చెందాడని అనుకుని అక్కడ నుంచి జారుకున్నాడు. టెక్నాలజీ సహాయంతో నిందితుని ఫోన్ సిగ్నల్స్, ఇతరత్రా ఆధారాలను పోలీసులు సేకరించారు. నేరాన్ని అంగీకరించడంతో సర్వేశ్వరరావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రాఘవులు తెలిపారు. హత్యకేసును ఛేదించిన సీఐ కటకం సతీష్‌కుమార్, ఎస్‌ఐ రమేష్, సిబ్బందిని అభినందించారు.