Harassment of female employee మహిళా ఉద్యోగికి వేధింపులు
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:27 AM
Harassment of female employee స్త్రీశిశుసంక్షేమశాఖలో జూనియర్ సహాయకురాలిపై ఓ అధికారి వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. మూడు రోజుల కిందట సదరు అధికారి తనపై వాటర్‌బాటిల్‌ను విసరడంతో భయపడి స్పృహ కోల్పోయానని, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరానని బాధితురాలు తెలిపారు.
మహిళా ఉద్యోగికి వేధింపులు
మానసిక వేదనకు గురిచేస్తున్న ఐసీడీఎస్ అధికారి
ఇటీవల వాటర్‌బాటిల్‌ను ఉద్యోగిపై విసిరిన వైనం
భయపడి స్పృహ కోల్పోయిన ఉద్యోగి
ఆసుపత్రిలో చికిత్స
రాష్ట్ర ఉన్నతాధికారి, ఎస్పీ, ఆర్‌జేడీకి బాధితురాలు ఫిర్యాదు
విజయనగరం టౌన్, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): స్త్రీశిశుసంక్షేమశాఖలో జూనియర్ సహాయకురాలిపై ఓ అధికారి వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. మూడు రోజుల కిందట సదరు అధికారి తనపై వాటర్‌బాటిల్‌ను విసరడంతో భయపడి స్పృహ కోల్పోయానని, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరానని బాధితురాలు తెలిపారు. ఆమె తెలిపిన వివరాల మేరకు..
జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ (స్త్రీశిశుసంక్షేమశాఖ)లో ఈ ఏడాది జూన్ 25న జూనియర్ సహాయకురాలిగా శ్రావణికుమారి కారుణ్య నియామకం కింద చేరారు. అయితే ఆమెకు కొద్ది నెలలుగా ఓ అధికారి నుంచి వేధింపులు ఎదురవుతున్నాయి. రాత్రి 8గంటల వరకూ కార్యాలయంలోనే ఉండమని చెబుతూ తోటి ఉద్యోగుల ముందు చునకనగా మాట్లాడుతున్నారు. అప్పగించిన పని చేయడం లేదంటూ విరుచుకుపడుతున్నారు. అయినా భరిస్తూ ఆమె తనపని తాను చేసుకుంటుండగా ఈనెల 20న శనివారం సాయంత్రం ఆ అధికారి మరింత రెచ్చిపోయారు. ‘చేస్తే ఉద్యోగం చెయ్ లేకుంటే మానెయ్’ అంటూ వెనుక నుంచి వాటర్‌బాటిల్ ఆమెపైకి విసిరారు. ఆయన ప్రవర్తనకు ఆందోళన చెంది శ్రావణకుమారి స్పృహ తప్పిపడిపోయారు. అనంతరం చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేరారు. ఆదివారం ఇంటికి వెళ్లిన ఆమె సోమవారం మరోసారి వైద్య తనిఖీ కోసం ఆస్పత్రికి వెళ్లారు. కొద్ది నెలలుగా సదరు అధికారి తనను టార్గెట్ చేస్తూ మానసిక వేదనకు గురిచేస్తున్నారని, తనతో పాటు తోటి ఉద్యోగులు కూడా ఆయన వల్ల ఇబ్బందులకు గురువుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర స్త్రీశుసంక్షేమశాఖ డైరెక్టర్, ఎస్పీ, ఆర్జేడీకి ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.
అమానుషంగా ప్రవర్తించారు
నేను ఉద్యోగంలో చేరి ఏడు నెలలైంది. నా పట్ల ఆ అధికారి అమానుషంగా ప్రవర్తించారు. కార్యాలయంలో తోటి సిబ్బంది మధ్యలో కేకలు వేస్తూ మానసికంగా వేధించారు. వాటర్‌బాటిల్‌ను విసిరి శారీరక దాడికి పాల్పడ్డారు. ఇది చూసి ఒత్తిడికి లోనై కార్యాలయం ఆవరణలోనే స్పృహ కోల్పోయాను. తోటి సిబ్బంది ఆసుపత్రికి తీసుకువెళ్లారు. నా ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా ఆయన ప్రవర్తించారు. నేను పడిన ఇబ్బందులపై పీడీ, కమిషనర్, ఎస్పీకి ఫిర్యాదు చేశాను.
- శ్రావణికుమారి, జూనియర్ సహాయకురాలు, ఐసీడీఎస్
నా వరకు రాలేదు
శ్రావణికుమారిని అధికారి పలుమార్లు మానసిక వేదనకు గురిచేస్తున్నట్లు నా వరకూ ఫిర్యాదు రాలేదు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసి ఫోన్‌లో మాట్లాడాను ఎలా ఉందని ఆరా తీశాను. ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు కూడా ఇప్పుడే తెలిసింది.
- విమలారాణి, పీడీ, ఐసీడీఎస్, విజయనగరం