Share News

happy happy సందడే సందడి

ABN , Publish Date - Jul 11 , 2025 | 12:50 AM

happy happy జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల వద్ద గురువారం పండుగ వాతావరణం కన్పించింది. అటు ప్రైవేటు పాఠశాలల వద్ద కూడా అదే జోష్‌ ప్రస్ఫుటమైంది. అన్ని పాఠశాలల్లో మెగా తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.

happy happy సందడే సందడి
జామి కేజీబీవీలో ఆధికారులతో కలిసి టగ్‌ఆఫ్‌వార్‌ ఆడుతున్న కలెక్టర్‌ అంబేడ్కర్‌

సందడే సందడి

ఉత్సాహంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు

గతానికి భిన్నంగా కార్యక్రమాలు

తల్లి పేరుతో మొక్కల పంపిణీ, సంరక్షణ బాధ్యతలు

ప్రతి విద్యార్థికి గ్రీన్‌ పాస్‌పోర్టులు

విజయనగరం, జూలై 10(ఆంధ్రజ్యోతి):

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల వద్ద గురువారం పండుగ వాతావరణం కన్పించింది. అటు ప్రైవేటు పాఠశాలల వద్ద కూడా అదే జోష్‌ ప్రస్ఫుటమైంది. అన్ని పాఠశాలల్లో మెగా తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా గురువారం 2,232 విద్యాలయాలు, 180 జూనియర్‌ కాలేజీల్లో ఈ సమావేశాలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. దత్తిరాజేరు మండలం మరడాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. విద్య మన భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని, చదువుకోవడం ద్వారా ఉన్నత స్థానాన్ని సాధించవచ్చని ఆయన సూచించారు. కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జామి మండలం కుమరాం కేజీబీవీ పాఠశాలలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా నియోజకవర్గాల్లో హాజరయ్యారు. ప్రభుత్వం విద్యాశాఖ బలోపేతానికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరుకావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ తల్లిదండ్రులు, విద్యార్థులు ఒకే చోట ఉన్నారు. సామూహిక భోజనాలు చేశారు.

సామాజిక బాధ్యతగా..

విద్యార్థులకు సామాజిక బాధ్యతను గుర్తుచేస్తూ మొక్కలను అందించారు. వారితో మొక్కలు నాటించారు. నాటిన మొక్కల సంరక్షణకు మూడేళ్ల పాటు తామే బాధ్యత తీసుకుంటామని విద్యార్థులతో ప్రమాణం చేయించారు. వారికి గ్రీన్‌ పాస్‌పోర్టు కూడా అందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి పేరుతో మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విస్తృతంగా మొక్కలు నాటాలని నిర్ణయించారు. విద్యాశాఖ తనవంతు బాధ్యతగా ఈ రోజు కోటి మొక్కలు నాటాలని నిర్ణయించింది. పర్యవేక్షించేందుకు కలెక్టర్‌ అంబేడ్కర్‌ నేతృత్వంలో కంట్రోల్‌ రూం కూడా ఏర్పాటు చేశారు.

విద్యార్థులకు సమగ్ర వివరాలతో పత్రాలు

గతానికి పూర్తిగా భిన్నంగా మెగా తల్లిదండ్రుల సమావేశాలు జరిగాయి. తల్లిదండ్రులకు విద్యార్థులే స్వయంగా స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పాఠశాలల ప్రాంగణంలో వైద్య శిబిరాలు ఏర్పాటుచేయడం విశేషం. పిల్లల చదువు, ఆరోగ్యం, విద్యాలయాల్లో వసతులు, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి తల్లిదండ్రులతో చర్చించారు. ప్రతి పాఠశాలలో పిల్లలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలియజేసే కార్డులు అందించారు. వారి మానసిక, ఆరోగ్య పరిస్థితిని తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భంగా అందించిన సమగ్ర పత్రాలు బాగున్నాయి. ఆకట్టుకునేలా ఉన్నాయి. బాలల ఆరోగ్య వివరాలు, గత ఏడాది సాధించిన ఫలితాలు, తల్లికి వందనం పథకంలో బాలల వివరాలు, విద్యార్థి సమగ్ర నివేదిక వంటివి అందులో పొందుపరిచారు. మరోవైపు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సైతం అలరించాయి.

తల్లిదండ్రుల్లో హర్షం

పేరెంట్స్‌, టీచర్స్‌ మెగా సమావేశంపై తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమౌతున్నది. కార్పొరేట్‌ స్కూల్స్‌లో పేరెంట్స్‌ సమావేశాలు తరచూ జరుగుతుంటాయి కాని ఈ తరహాలో ప్రభుత్వ పాఠశాలలు, స్కూల్స్‌లో నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. తల్లిదండ్రులు, పిల్లలు ఈ సమావేశంలో కూర్చోవడం, స్కూలో వున్న సమస్యలు ప్రస్తావించడం, ఆ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేయాలన్నది సమావేశంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి నిర్ణయాలు తీసుకోవడం విశేషం.

చక్కని విద్య లభిస్తోంది

కాకర కొండబాబు, తోటపల్లి గ్రామం, జామి మండలం

నా కుమార్తెకు చక్కని విద్య ఉచితంగా లభిస్తోంది. మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ సమావేశం ద్వారా కుమార్తె చదువు గురించి ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సమావేశంతో ఉపాధ్యాయులతో పాటు ఇతర తల్లిదండ్రులతో పరిచయాలు ఏర్పడ్డాయి. స్కూల్‌లోని సమస్యలు కూడా తెలిశాయి. పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు సమష్టిగా నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రోత్సాహంతో 523 మార్కులు సాధించా

మౌనిక, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం

టెన్త్‌లో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో 563 మార్కులు సాధించాను. పాఠశాలలో చదువుతో పాటు క్రమశిక్షణ, ఆటలు, వివిధ అంశాల్లో ప్రత్యేక శిక్షణ అందించడం వల్ల అనేక పతకాలు సాధించాను. ఏడాదికి ఒక్కసారి కాకుండా విద్యా సంవత్సరంలో రెండు పర్యాయాలు ఈ విధమైన సమావేశాలు నిర్వహిస్తే ఇంకా మేలు జరుగుతుంది.

=========================

మెరిట్‌ స్టూడెంట్‌ను కాదు.. కష్టపడి కలెక్టర్‌ అయ్యాను

పేరెంట్స్‌ మీటింగ్‌లో కలెక్టర్‌ అంబేడ్కర్‌

జామి, జూలై 10(ఆంధ్రజ్యోతి): తాను మెరిట్‌ స్టూడెంట్‌ను కాదని, ఒక సెకెండ్‌క్లాస్‌ స్టూడెంట్‌ను అని, యూనివర్సిటీకి వెళ్లాక కష్టపడి చదివి గ్రూపు-2 సాధించి కలెక్టర్‌ స్థాయికి చేరుకున్నానని కలెక్టర్‌ అంబేడ్కర్‌ చెప్పారు. కుమారాం కేజీబీవీలో గురువారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ అంబేడ్కర్‌ ముఖ్య అతిథిగా హాజరై కాసేపు విద్యార్థులతో మమేకమ య్యారు. పిల్లల తల్లిదండ్రులతో ఒక స్నేహితునిగా ముచ్చటించారు. చివరిగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి దశలో తాను ఎలా చదివిందీ వివరించారు. విద్యార్థులు పలు ప్రశ్నలు అడగ్గా వారికి ఎంతో ఓపికతో నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అమ్మపేరుతో మొక్కలు నాటించి వాటిని సంరక్షించాలని సూచించారు. పిల్లలను వారికి నచ్చిన చదువు చదివించాలని, ఇదిచదువు అదిచదువు అని బలవంతం చేయొద్దని కోరారు. అనంతరం పిల్లలు, తల్లిదండ్రులు, అధికారులతో ఆటలు ఆడారు. పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. సామాన్య వ్యక్తిగా కలెక్టర్‌ కలిసిపోవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.

--------------

భవిష్యత్తును తీర్చిదిద్దేది చదువే

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

దత్తిరాజేరు, జూలై 10(ఆంధ్రజ్యోతి): చదువు ఎదుగుదలకు దోహదం చేస్తుందని, అభివృద్ధికి మార్గం చూపుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మరడాం జిల్లా పరిషత్‌ పాఠశాల ప్రాంగణం, జూనియర్‌ కళాశాలలోనూ గురువారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రికి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్య మన భవిష్యత్తును తీర్చిదిద్దుతుందన్నారు. అనంతరం విద్యార్థులు, అధికారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులు తయారు చేసిన మెగా పీటీఎం సెల్ఫీ పాయింట్‌ వద్ద ఫొటోలు దిగారు. అలాగే రంగోళి, టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీల్లోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో మోహనరావు, తహసీల్దార్‌ పి.విజయభాస్కర్‌, ఎంపీడీవో వైవి.రాజేంద్రప్రసాద్‌, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ గణపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 12:50 AM