happy asha workers ‘ఆశ’లు వెల్లివిరిసేలా..
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:03 AM
happy asha workers సమస్యల పరిష్కారానికి సంవత్సరా లుగా పోరుబాట సాగిస్తున్న ఆశ కార్యకర్తల ఆశలు ఫలించాయి. ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు సత్ఫలితాలిచ్చాయి. వారి న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంది. వరాలు కురిపించింది. దీంతో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ప్రకటనలు ఇస్తున్నారు.
‘ఆశ’లు వెల్లివిరిసేలా..
ఆశ కార్యకర్తలపై వరాల జల్లు
పూర్తి వేతనంతో కూడిన ఆరునెలల ప్రసూతి సెలవులు
ఉద్యోగ విరమణ తరువాత నెలకు రూ.5వేల గ్రాట్యుటీ
రాజాం/ రూరల్/ గజపతినగరం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారానికి సంవత్సరా లుగా పోరుబాట సాగిస్తున్న ఆశ కార్యకర్తల ఆశలు ఫలించాయి. ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు సత్ఫలితాలిచ్చాయి. వారి న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంది. వరాలు కురిపించింది. దీంతో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ప్రకటనలు ఇస్తున్నారు.
- పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో మాతా, శిశు సంరక్షణ, జాతీయ ఆరోగ్యకార్యక్రమాల అమలు, ప్రభుత్వాసుపత్రులలో ప్రసవాల పెంపు, సీజనల్, ప్రాణాంతక వ్యాధులపై ప్రజల్లో అవగాహన తదితర కీలకమైన వైద్య ఆరోగ్య సేవల్ని ఆశా కార్యకర్తలు అందిస్తున్నారు. అయితే ప్రజారోగ్య పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్న వీరి పట్ల గత ప్రభుత్వం చిన్నచూపు చూసింది. వారి ఆవేదనను పట్టించుకోలేదు. ఆందోళనలను అణచివేసింది. వారిపై ఉక్కుపాదం మోపింది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఆశ కార్యకర్తల ఆవేదనపై దృష్టి సారించింది. వారి ప్రధాన డిమాండ్లపై ఉన్నతాధికారులతో చర్చించింది. సానుకూలమైన డిమాండ్ల అమలుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం జీవో 94ను వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు విడుదల చేశారు. ఫలితంగా జిల్లాలో సుమారు 2వేల మంది వరకూ ఆశ కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లువిరుస్తున్నాయి.
వరాలు ఇవే..
ఆశ వర్కర్లకు ఇప్పటివరకూ లేని మెటర్నిటీ లీవ్‌ను ఆరునెలలు (180 రోజులు) పూర్తివేతనంతో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ వెసులుబాటును రెండు డెలివరీలకే పరిమితం చేసింది. ఈ ఏడాది మార్చిలో చలో విజయవాడ కార్యక్రమంలో ప్రభుత్వం ఇచ్చిన హామీమేరకు ఆశ వర్కర్ల ఉద్యోగ విరమణ కాలాన్ని 62 ఏళ్లుగా నిర్ణయించారు. అయితే ఈ హామీపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ఇప్పటివరకూ ఆశవర్కర్లకు గౌరవ వేతనంగా రూ.10 వేలు ఇస్తున్నారు. ఈమొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.7200, కేంద్ర ప్రభుత్వం రూ.2800 సమకూరుస్తోంది. ఇదిలా ఉంటే ఆశవర్కర్ ఉద్యోగ విరమణ తరువాత ఆర్థిక భద్రత కోసం గౌరవవేతనంలో సగం రూ.5వేలు వంతున గరిష్టంగా రూ.1.50 లక్షలు గ్రాట్యుటీగా చెల్లించాలని ప్రభుత్వం ప్రకటించింది. కాగా గ్రాట్యుటీ చెల్లింపునకు సంబంధించి కనీస కాలాన్ని ప్రామాణికంగా నిర్ణయిస్తారా, అందరికీ వర్తింపజేస్తారా అనేది ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. గ్రాట్యుటీ చెల్లింపు విషయానికొస్తే దేశంలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఆశవర్కర్లకు చెల్లిస్తున్నాయి. ప్రభుత్వ తాజా ప్రకటనతో మన రాష్ట్రం కూడా ఆయా రాష్ట్రాల సరసన చేరబోతోంది.
శుభ పరిణామం
రామ్మూర్తినాయుడు, ఆశ కార్యకర్తల సంఘ గౌరవాధ్యక్షుడు
కూటమి ప్రభుత్వ తాజా ప్రకటన ఆశ కార్యకర్తలకు ఎంతో శుభపరిణామం. ఏళ్లుగా చేసిన పోరాటాలకు ఇన్నాళ్లకు ఫలితం దక్కనుంది. గ్రాట్యుటీ చెల్లింపు, ఉద్యోగ విరమణ విషయంలో ఇంకా స్పష్టంగా వివరించాల్సి ఉంది. ఏదేమైనా ఆశవర్కర్లకు ఎంతో మేలు కలగనుంది. జిల్లాలోని ఆశ వర్కర్లందరి తరపున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. చాలా రోజులుగా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. ప్రసూతి సెలవులు ప్రకటించడం బాగుంది. రూ.1.50 లక్షల గ్రాట్యూటీ చెల్లింపు, పదవీ విరమణ వయసు పెంచడం ఆనందంగా ఉంది. గౌరవ వేతనం కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవాలి.
- తులసీరత్నం, ఆశా కార్యకర్త, రాజాం
------------------