టిడ్కో ఇళ్లను అప్పగించండి
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:04 AM
:పట్టణ పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లను తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పి.శంకరరావు డిమాండ్ చేశారు.
బొబ్బిలి, ఆగస్టు11 (ఆంధ్రజ్యోతి):పట్టణ పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లను తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పి.శంకరరావు డిమాండ్ చేశారు. సోమవారం మునిసిపల్ చైర్మన్ రాంబార్కి శరత్‌బాబు, కమిషనరు లాలం రామలక్ష్మిలకు టిడ్కో ఇళ్ల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ టిడ్కో ఇళ్లను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించకుండానే బ్యాంకులు రుణవాయిదాల కోసం ఒత్తిడి చేస్తున్నాయని ఇది సమంజసం కాదన్నారు.ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించకుండానే లోన్‌రికవరీ చేయడం హాస్యాస్పదమని, బ్యాంకుల ఒత్తిడి నుంచి లబ్ధిదారులకు ఉపశమనం కలిగించి, టిడ్కో ఇళ్లను పూర్తిచేసి అప్పగించాలని శంకర రావు డిమాండ్‌చేశారు.టిడ్కో ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసిందని, త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుందని కమిషనరు రామలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎస్.గోపాలం, యుగంధర్ పాల్గొన్నారు.