గురజాడ రచనలు స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:11 AM
మహాకవి గురజాడ అప్పారావు రచనలు నేటికీ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- రూ.10 లక్షలతో మహాకవి స్వగృహం అభివృద్ధి: ఎంపీ కలిశెట్టి
విజయనగరం రూరల్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):మహాకవి గురజాడ అప్పారావు రచనలు నేటికీ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో గురజాడ జయంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. గురజాడ నివాసంతో పాటు అదే రోడ్డులో ఉన్న గురజాడ విగ్రహానికి మంత్రి కొండపల్లితో పాటు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలుత గురజాడ నివాసం నుంచి సభా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గురజాడ భావాలు, రచనలు నిత్య నూతనమని అన్నారు. 150 ఏళ్ల కిందటే ముందు చూపుతో గొప్ప రచనలు చేశారని కొనియాడారు. ప్రధాని నరేంద్రమోదీ సైతం గురజాడ రచనలు నుంచి స్ఫూర్తి పొందినట్లు చెప్పారని గుర్తు చేశారు. గురజాడ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆయన జీవిత చరిత్ర, దేశభక్తి గీతాలను పాఠ్యాంశాల్లో చేర్పించాలని సూచించారు. ప్రతి పాఠశాలలో ఆయన చిత్రపటాన్ని ఉంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గురజాడ స్వగృహం పక్కన ఉన్న స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఎంపీ కలిశెట్టి మాట్లాడుతూ.. ఎన్ని తరాలు మారినా, గురజాడ రచనలు సజీవంగా నిలిచే ఉంటాయన్నారు. ఆయన దేశభక్తి గేయం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. గురజాడ స్వగృహం అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.10 లక్షలు కేటాయించినట్టు చెప్పారు. కలెక్టర్ రామసుందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గురజాడ గొప్ప సంఘసంస్కర్తని, తెలుగుభాష ఉన్నంత వరకూ ఆయన రచనలు నిలిచి ఉంటాయన్నారు. కన్యాశుల్కంలో సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పపంతులు వంటి పాత్రలు నేటికీ మన కళ్లముందే కదలాడుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి, జేసీ సేతుమాధవన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీవో కీర్తి, డీఈవో మాణిక్యం నాయుడు, మునిసిపల్ కమిషనర్ నల్లనయ్య, లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, డీఐపీఆర్వో గోవిందరాజులు, జిల్లా పర్యాటక శాఖాధికారి కుమారస్వామి, ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ మండపాక నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.